Movies

ఐటీ కార్యాలయానికి…

Actor Vijay Taken To Income Tax Office In Chennai

సినీ నటుడు విజయ్‌కు ఆదాయపు పన్ను అధికారులు బుధవారం షాక్‌ ఇచ్చారు. కొత్త చిత్రం ‘మాస్టర్‌’ చిత్రీకరణలో నైవేలిలో ఉన్న ఆయన్ను నేరుగా దర్యాప్తు నిమిత్తం చెన్నైకు తీసుకురావడం కూడా కలకలం రేపింది. గతేడాది విడుదలైన ‘బిగిల్‌’ చిత్రానికి సంబంధించి విజయ్‌ నివాసాలతోపాటు ఆ చిత్రాన్ని తెరకెక్కించిన ఏజీఎస్‌ సంస్థ కార్యాలయాలు, సంస్థకు చెందిన వ్యక్తులు తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. రూ.180 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఏజీఎస్‌ సంస్థ చెబుతోంది. వాస్తవ బడ్జెఫట్‌ రూ.220 కోట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రూ.140 కోట్లకుపైగా ఈ చిత్రం వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టిందని ఏజీఎస్‌ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ ఆదాయపు పన్ను ఎగవేసిందన్న ఆరోపణలతో సోదాలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. ఈ చిత్రానికి విజయ్‌ రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఏజీఎస్‌ సంస్థకు ఫైనాన్స్‌ అందించిన ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌కు చెందిన సంస్థలు, మదురైలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరిగాయి. చెన్నైలోని సాలిగ్రామం, నీలాంగరైల్లోని విజయ్‌ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించిన అధికారులు… ‘బిగిల్‌’ ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ తదుపరి చిత్రం ‘మాస్టర్‌’ షూటింగ్‌ నైవేలి ప్రాంతంలో జరుగుతోంది. అధికారులు నేరుగా అక్కడకు వెళ్లి విజయ్‌ను ప్రశ్నించారు. పారితోషికం వివరాలపై ఆరా తీశారు. అనంతరం విజయ్‌ కారులోనే దర్యాప్తు నిమిత్తం ఆయన్ను చెన్నై తీసుకువచ్చారు. దీంతో షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది.ఏజీఎస్‌ సంస్థ సహా ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌కు చెందిన దాదాపు 20 సంస్థల్లో జరిగిన దాడుల్లో రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.