దేశ రాజధాని ఢిల్లీ సరికొత్త రూపు సంతరించుకోనున్నది. నేటి అవసరాలకు అనుగుణంగా సెంట్రల్ విస్టాను (రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకు) ఆధునీకరించేందుకు కేంద్రం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. రూ.12 వేల కోట్లతో 2024నాటికి దీన్ని అభివృద్ధిచేయనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనానికి ఆనుకుని త్రికోణాకృతిలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తారు. 75వ స్వాతంత్య్ర వేడుకల నాటికి దీన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
* సుమారు రూ.12,000 కోట్ల వ్యయంతో సెంట్రల్ విస్టాను (రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు) ఆధునికీకరించేందుకు మోదీ సర్కారు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. 2024 ఆగస్టు నాటికి ఆధునికీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అలాగే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నూతన పార్లమెంట్, కేంద్ర సచివాలయ (సెంట్రల్ సెక్రటేరియట్) భవనాలను నిర్మించనున్నది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న భవనాలు సుమారు వందేండ్లకు పైబడినవి కావడం, నేటి అవసరాలకు తగ్గట్లుగా లేకపోవడంతో కేంద్రం ఈ ప్రాంతాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. గుజరాత్కు చెందిన ‘హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్, మేనేజ్మెంట్’ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకున్నది. వచ్చే ఏప్రిల్ నాటికి ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేయనున్నది. 1931లో దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారినప్పుడు నాటి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యుటియెన్స్, మరో ఆర్కిటెక్ట్ బేకర్తో కలిసి రాజధాని భవనాలకు రూపకల్పన చేశారు. పాశ్చాత్య నిర్మాణ శైలికి భారతీయతను జోడించి వీటిని నిర్మించారు. ఇక ఇప్పుడు ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్.. సెంట్రల్ విస్టా పునరుద్ధరణ ప్రాజెక్టును తలకెత్తుకున్నారు. గతేడాది ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
**ఆధునీకరణ ఇలా..
ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు, రక్షణ, ఆర్థిక, హోం శాఖల కార్యాలయాలున్న నార్త్, సౌత్ బ్లాకులను మ్యూజియంలుగా మార్చనున్నారు. శాస్త్రిభవన్, ఉద్యోగ్భవన్, నిర్మాణ్ భవన్, క్రిషి భవన్ల స్థానంలో అన్ని శాఖలను ఒకేచోటకు చేర్చుతూ కేంద్ర సచివాలయాన్ని నిర్మించను న్నారు. నూతన నిర్మాణాలు ఇండియా గేట్ కంటే తక్కువ ఎత్తులో ఉండనున్నాయి. జాతీయ మ్యూజియాన్ని పాత సచివాలయానికి తరలించనున్నారు. రాష్ట్రపతి భవన్ అలాగే కొనసాగనుంది. ప్రధాని నివాసాన్ని సౌత్ బ్లాక్కు దక్షిణంగా, ఉపరాష్ట్రపతి నివాసాన్ని నార్త్ బ్లాక్ ఉత్తరంగా నిర్మించనున్నారు. అప్పట్లో ఢిల్లీ భూకంప ప్రభావ తీవ్రత తక్కువగా ఉన్న జోన్-2లో ఉండగా, నేడు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న జోన్-4కు చేరింది. ఈ నేపథ్యంలో భూకంపాలను తట్టుకునేలా నూతన భవనాలను నిర్మించనున్నారు.
**2024నాటికి కేంద్ర సచివాలయం..
ప్రభుత్వ శాఖల మధ్య మరింత సమన్వయాన్ని ఏర్పరిచేందుకు కేంద్ర సచివాలయం ద్వారా అన్నింటినీ ఒకేచోటకు తీసుకురానున్నారు. సుమారు 70 వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా సెంట్రల్ విస్టాకు ఇరువైపులా పది భారీ భవనాలను (ఒక్కోటి ఎనిమిది అంతస్తులు) నిర్మించనున్నారు. 2024నాటికి ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వివిధ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిని సొంత భవనాల్లోకి తరలించడం ద్వారా ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభు త్వ శాఖలన్నీ ఒకేచోట ఉండేలా 2011లో గాంధీనగర్లో సెంట్రల్ సెక్రటేరియట్ను నిర్మించారు. దీనిని కూడా బిమల్ పటేల్కు చెందిన హెచ్సీపీ డిజైన్ సంస్థే నిర్మించినది.
**త్రికోణాకృతిలో పార్లమెంట్
2022లో దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయానికి కొత్త పార్లమెంట్ను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం పెరిగిన అవసరాలకు తగ్గట్లు లేకపోవడంతో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం పక్కనే త్రికోణాకృతిలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. లోక్సభలో 900 మంది, రాజ్యసభలో 450 మంది కూర్చొనేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. లోక్సభనే ఉభయ సభల సమావేశాలకు కూడా ఉపయోగించనున్నారు. నూతన భవనంలో ఎంపీలందరికీ కార్యాలయాలు ఉండనున్నాయి.ఇప్పుడున్న భవనాలు 1911-1927 మధ్య నిర్మించినవి. 1947లో అవి మన అధీనంలోకి వచ్చాయి. అయితే అవన్నీ 100 ఏండ్లకు పైబడినవి. అవి ఇప్పుడు బలంగా లేవు. కొన్ని భవనాలు ఢిల్లీ భూకంప ప్రభావ తీవ్రతను తట్టుకునే విధంగా లేవు
న్యూఢిల్లీ రూపు మారిపోతోంది
Related tags :