Devotional

మేడారం జాతర సందడి–TNI కధనాలు

Medaram Jaatara Special News Coverage-TNILIVE

1. మహా జాతర మేడారం
దండకారణ్యం…మధ్యలో ఓ గిరిజన గూడెం.ఓ వంద ఇళ్లు కూడా లేని ఆ గూడెం రెండేళ్లకోసారి భక్తజన కోటితో కిక్కిరిసిపోతుంది. భక్త పారవశ్యంతో తరించిపోతుంది. ఆ దృశ్యం మరో రెండు రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది. వందలుగా బయలుదేరి, వేలుగా జత కూడి, లక్షలాదిగా కదిలిపోయి, కోట్లాదిగా జమకూడి సమ్మక్క-సారలమ్మ వన దేవతలను దర్శించుకునే వేడుకే ‘మేడారం’ జాతర. ఈ జాతర గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. దక్షిణ భారత కుంభమేళగా ఇప్పటికే సుప్రసిద్ధం.మేడారం జాతర వెనుక ఓ మహత్తరమైన పోరాటగాథ ఉంది. తరతరాల నుంచి సమసిపోని ఓ స్ఫూర్తి, ఓ తృప్తి.
అచ్చంగా చెప్పాలంటే మేడారం జాతరనేది కోట్లాది మంది సబ్బండ వర్గాల ప్రజల నిఖార్సైన నమ్మకం. అంతకు మించిన విశ్వాసం. అసలు సిసలైన ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ వేడుక. వారి సంస్కృతికి ప్రతీక. మొదట గిరిజనులు మాత్రమే తమ ఆరాధ్య దేవతలుగా భావించిన సమ్మక్క-సారలమ్మలు కాలక్రమేణ నాగరికుల అభిమానాన్ని కూడా చూరగొని మొక్కులందుకోవడం మరో విశేషం. మేడారం జాతరలో కులాలు, మతాలు మచ్చుకైనా కనిపించవు. సంపన్న, ఆపన్న వర్గాల తారతమ్యం లేకుండా మమేకం కావడం మరో విశేషం. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్నాటక ఏడు రాష్ట్రాల నుంచి భక్తజనం తరలివస్తారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర జరిగే ప్రదేశం. మేడారానికి రైలు మార్గం లేదు. ఎంతటి పెద్ద వారికైనా రోడ్డు మార్గమే శరణ్యం కాగా గత రెండు జాతర్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సౌకర్యాన్ని కల్పించింది. అతి తక్కువ మందిని చేరవేయగలిగిన హెలికాప్టర్ చార్జీలను సామాన్య, మధ్యతరగతీయులు భరించలేని స్థాయిలో ఉంటాయి. వరంగల్ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉండే మేడారం జాతరకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ ఆర్టీసీ దాదాపు ఐదు వేల ప్రత్యేక బస్సులను వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి నడిపిస్తుంది.
**జాతరకు నేపథ్యం..
దండకారణ్యం ప్రాంతంలోని గిరిజన రాజ్యమైన మేడారం పరగణాను కోయ రాజులు పాలించేవారు. వీరు కాకతీయులకు సామంత రాజులుగా ఉండేవారు. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాధికారాన్ని చేపట్టిన నాటికే కరీంనగర్‌ను రాజధానిగా చేసుకుని కోయచక్రవర్తి మేడరాజు పాలించేవాడు. కాకతీయ సామంతరాజుల గిరిజన గూడెం మేడారం పగిడిద్దరాజు స్వాధీనంగా వచ్చింది. ఇతని పరిపాలనా కాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు అనావృష్టి సంభవించి పంటలు పండక కరువు కాటకాలతో విలయతాండవం చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కప్పం చెల్లించలేని స్థితికి చేరారు. దీంతో కాకతీయులకు కప్పం చెల్లించడానికి పగిడిద్దరాజు నిరాకరించాడు. దీంతో కోపోద్రోక్తుడైన ప్రతాపరుద్రుడు గిరిజన చక్రవర్తి పగిడిద్దరాజును అణిచివేతకు ప్రధాన సైన్యాధిపతి యుగంధరుడి సారధ్యంలో సైన్యాన్ని పంపారు. సంపెంగ వాగు వద్ద గిరిజన సేనలకు, కాకతీయ సేనలకు మధ్య భీకరపోరాటం జరిగింది. యుద్ద నిపుణత గల కాకతీయ సైన్యం ధాటికి కోయ సేనలు చెల్లాచెదురయ్యాయి. యుద్ధంలో పగిడిద్ద రాజుతో పాటు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు వీర మరణం పొందారు. మేడారంలోకి కాకతీయ సేనలు ప్రవేశించకుండా కాపలాగా ఉన్న పగిడిద్ద రాజు కుమారులైన జంపన్న పరాజయాన్ని సహించలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండే సంపెంగ వాగు జంపన్న వాగుగా వాడుకలోకి వచ్చింది. ఈ తరుణంలో సమ్మక్క స్వయంగా కాకతీయ సేనలతో యుధ్దానికి తలపడి పరాశక్తి అవతారమైన సమ్మక్క అపరకాళిలా విజృంభించి కాకతీయ సేనలను అంతం చేయడం ఆరంభించింది. సమ్మక్క చేతులలో పరాభవం తప్పదని గ్రహించిన కాకతీయ సైనికుల్లో ఒకడు దొంగచాటుగా వెనుక నుంచి సమ్మక్కను బల్లెం పొడిచాడు. వెంటనే సమ్మక్క యుద్ధ్భూమి నుండి వైదొలిగి మేడారానికి ఈశాన్య వైపుగల చిలుకల గుట్ట వైపు వెళ్లింది. కొందరు కోయ సైనికులు ఆమెను అనుసరించినప్పటికీ, కొండ మలుపుల్లో అదృశ్యమైపోయింది. ఎంతకూ ఆమె జాడ తెలియరాలేదు. అయితే గుట్టమీద గల నాగవృక్షం సమీపంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ గల భరిణి వారికి కనిపించింది. అదే సమ్మక్క గుర్తుగా భావించి కోయ దొరలు నిద్రాహారాలు మాని సమ్మక్క తిరిగి వస్తుందనే ఆశతో వేచి చూస్తారు. ఎంత వెదికినా వీరిద్దరి జాడ తెలియదు. సమ్మక్క అదృశ్యమైన చోట నెమలినార చెట్టు కింద కుంకుమ భరణి లభిస్తుంది. ఆ భరిణనే సమ్మక్కగా భావించి ప్రతి రెండేళ్లకోసారి మార్గశిర పౌర్ణమి రోజున నిర్వహించుకునే జాతరనే మేడారం.
ఈ ఆదివాసీ గిరిజన వీర వనితల చరిత్ర చరిత్ర పుటల్లో ఎక్కడా లేదు. చరిత్ర పుటల్లోకి ఎక్కకపోయినా, సమ్మక్క, సారలమ్మ వీరోచిత పోరాటానికి గుర్తు చేసుకుంటూ తరతరాలుగా తమ వారసత్వ ఆస్థిత్వాన్ని కాపాడుకుంటూ మేడారం జాతరను జరుపుకుంటూ వస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ వీరిద్దరూ తల్లీకూతుళ్లనీ, కాదు అక్క చెల్లెండ్రనీ, కాదు కాదు సవతులని రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరూ తల్లీకూతుళ్లా, అక్కాచెల్లెండ్లా, సవతులా అనేది ఇంతవరకు ఇతమిత్థంగా ఏ చరిత్రకారుడు తేల్చి చెప్పలేకపోయారు. వీరు వరసకు ఏమవుతారనే ఆలోచనకు తావులేకుండానే వీరి పట్ల అచంచలమైన భక్తిని చాటుకునే అసంఖ్యాకమైన భక్త జనకోటి వీరి సంపద. మరొక విషయం ఏమిటంటే సమ్మక్క, సారలమ్మలు వీరమరణం పొందిన స్థలానే్న పరమ పవిత్రంగా భావించి, అక్కడీ దేవతలను కొలుస్తున్నారా? అంటే, అదీ లేదు. కాకతీయ సేనలతో జరిగిన యుద్ధంలో వీరిద్దరూ వీర మరణం పొందిన స్థలం, జాతర జరిగే మేడారానికి సమీపంలోని బయ్యక్కపేటగా మేడారం జాతరలో పూజాదికాలు నిర్వహిస్తున్న వీరి వంశస్తులు చెబుతారు. పోనీ ఈ వన దేవతలకు ప్రతీకగా వెలిసిన విగ్రహాలను పూజిస్తున్నారా? అంటే.. అదీ లేదు. సమ్మక్క, సారలమ్మలకు ప్రతీకలుగా ఎర్రమట్టి గద్దెలపై పాతిన రెండు దిమ్మలనే పూజించడం ఇక్కడ మరో విశేషం. హిందువుల దేవాలయాల్లో మద్యం, మాంసం, అంటు, ముట్టును దరి చేరనీయరు. కానీ దీనికి భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, పూజా విధానాలు మేడారంలో అనుసరిస్తారు. గుక్కెడు మందుతో నాలుక తడపకపోతే, కోడి కూర, బగారా అన్నం లేకుంటే సమ్మక్క, సారలమ్మలు మెచ్చరని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే మేడారం జాతరకు ఆబ్కారీ శాఖ ప్రత్యేకంగా తాత్కాలిక మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇస్తుంది. లక్షలాది కోళ్లు, మేక పోతులు, గొర్రె పొట్టేళ్లు జాతరలో బలి ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. ఈ జాతరలో మద్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, ఒక ఉదంతాన్ని చెప్పుకుంటారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో మద్య నిషేదం అమలులో ఉన్నప్పుడు మేడారం జాతర వచ్చింది. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెకు తీసుకురావడానికి పూజారులు వెళ్లారు. దేవతల ఆగమనంతోనే జాతర ప్రారంభం అవుతుంది. కానీ అమ్మవారిని తీసుకురావడానికెళ్లిన పూజారులు ఎంతకు గుట్ట దిగిరాలేదు. అప్పటికే గుట్ట కింది భాగానికి చేరుకున్న లక్షలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో భక్తుల్లో ఆందోళన, అలజడి, అసహనం తలెత్తింది. సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్సీలు అమ్మవార్ల రాకను స్వాగతించే సాంప్రదాయం కూడా ఉంది. వారికి కూడా ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దేవతలు గుట్ట దిగడానికి సమ్మతించడం లేదన్న సమాచారం వీరికి చేరింది. దీంతో కలెక్టర్ అక్కడి నుంచే ఉన్నతాధికారులను సంప్రదించి, మద్యాన్ని తెప్పించి సాకా పెట్టాకే దేవతలు కొండ దిగారు. అసలు సిసలైన ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా జరగాల్సిన, మేడారం జాతరలో ఏర్పాట్ల పేరిట పెరిగిపోతున్న ప్రభుత్వ జోక్యం వల్ల బ్రాహ్మణీయ పూజా విధానాలు, బ్రహ్మోత్సవాల సంస్కృతి చోటు చేసుకుంటుందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమినాడు మేడారం జాతర ఆరంభమై నాలుగు రోజుల పాటు జరగుతున్నప్పటికీ గిరిజనేతరులకు గిరిజనులకు మాత్రం ఇది నెల రోజుల పండుగ. ప్రతి ఏటా కాకుండా, రెండేళ్లకోసారి జాతర జరగడం ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తకమానదు. కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా మన 24 నెలలను వారు ఒక సంవత్సరంగా పరిగణిస్తారని చెబుతారు. ఈ కారణంగానే మేడారం జాతర రెండేళ్లకోసారి జరగుతోందంటారు.
**వన దేవతలు కొండ దేవర స్వరూపం..
మేడారం జాతరలో పూజలందుకునే గిరిజన వీర వనితలు సమ్మక్క – సారలమ్మ గురించి అనేక జానపద కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో 7వ శతాబ్దంలో దండకారణ్యంలోని మేడారం నుండి కోయ దొరలు ఒకరోజు దట్టమైన అడవుల్లోకి వేటకు వెళ్లగా పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా ఒక పసిపాప కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యానికి గురైన కోయ దొరలను రప్పించి ఆ పసిపాపను పల్లకిలో తీసుకొచ్చి మేళ తాళాలతో గూడెం తీసుకెళ్లారు. ఆపసిపాప మేడారంకు వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతం సుభిక్షంగా విరాజిల్లింది. అడవిలోని విషసర్పాలు, క్రూర మృగాల గుంపుమధ్యలో గద్దెపై తమకు లభించిన పసిపాపను సాక్ష్యాత్తూ కొండ దేవరగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్కగా నామకరణం చేశారు. పులులు, సింహాలు, జంతువులపై స్వారీ చేయడం, ఎన్నో రోగాలను చిటికలో నయం చేయటం, వృద్ధులు, స్ర్తిలు, అనాథలకు సహాయ పడటం, సంతానం ప్రాప్తికి అనుగ్రహించడం వంటి మరెన్నో అతీతమైన మహిమలు కలిగి ఉండటంతో సమ్మక్క కీర్తి నలుదిశలా వ్యాపించింది. అనంతరం ఇప్పటి కరీంనగర్-వరంగల్-ఖమ్మం సరిహద్దులోని దండకారణ్యం ప్రాంత రాజ్యాన్ని పరిపాలించే కోయ చక్రవర్తి మేడరాజు మేనల్లుడు పగిడిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న పేర్లు గల ఇద్దరు సంతానం కలిగారు.
**గిరిజన సంస్కృతి మేళవింపు
మేడారం జాతరలోని గద్దెలపైకి దేవతా మూర్తులను తీసుకురావడం అంటే వారు కొలువైన కుంకుమ భరిణెను గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో గద్దెలపైకి తీసుకురావడమే. కుంకుమ భరిణెలోని బండారిగా పిలుచుకునే పసుపు, కుంకుమలు, బంగారంగా పిలువబడే బెల్లం గద్దెకు చేరుకోవడంతోనే మేడారం జాతర ప్రారంభమైనట్టు. జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్న వాగులో స్నానమాచరించి మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్దకు రావడం అనవాయితీ. దేవతల కుంకుమ భరిణెలను తీసుకొచ్చే పూజారులకు ఎదురేగే మహిళా భక్తురాండ్రు (శివసత్తులు) శిగం పూనుతారు. దేవతలు గద్దెకు వచ్చే దారిలో భక్తులు అడ్డంగా పడుకుంటే కుంకుమ భరిణెతో ఊరేగే పూజారులు వారిపై నడుచుకుంటూ వెళ్తుంటారు. తమపై నుంచి దేవతలను తీసుకెళ్లే పూజారులు వెళ్తే జన్మ సార్థకమైనట్టుగా విశ్వసిస్తారు. దేవతలకు ఎదురేగి కోళ్లను ఎగురవేస్తూ, అవి కింద పడకముందే ఒకే వేటుకు తల తెగే విధంగా బలి ఇవ్వడం ఇక్కడ ఆచారం. దీనిని ఎదురుకోళ్లు అంటారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు కిలో మీటర్ల పొడవునా బారులు తీరుతారు.
*మొక్కుబడి ఉన్న కొందరు పురుషులే మహిళల వేషధారణతో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు తీర్చే ఆచారం కూడా ఇక్కడుంది. వీరిని ఆచారవంతులుగా పిలుస్తారు. దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు హుండీలో వేసినట్టుగా ఇక్కడ డబ్బు, నగలను కానుకలుగా కాకుండా, ఎక్కువగా పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు, బెల్లాన్ని కానుకలు సమర్పిస్తారు. కొందరు సమ్మక్క సారలమ్మలకు కోడెలను కానుకలుగా సమర్పించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కోసం వరాలు పడుతుంటారు. తల్లి దీవెన వల్ల సంతానం కలిగిన వారు తమ పిల్లలనే త్రాసులో కూర్చోబెట్టి వారికి నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) తులాభారంగా సమర్పిస్తారు.
**లక్ష్మీదేవర ప్రత్యేక ఆకర్షణ
మేడారం జాతరలో గుర్రం ముఖ కవళికలుగల ప్రతిమతో గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో చేసే నృత్యం విలక్షణంగా ఉండి ఆకట్టుకుంటుంది. లక్ష్మీదేవరగా పిలిచే ఈ దైవం, గిరిజన తెగల్లో ఒకటైన నాయకపోడు గిరిజనులు ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు. ఈ దేవతా మూర్తిని మహాభారత కురుక్షేత్రం యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు బహూకరించినట్లుగా నాయకపోడు తెగ విశ్వసిస్తోంది. కురుక్షేత్ర యుద్దంలో రుక్మిణీ భీకర పోరాటం చేస్తుండగా, ఎదురుగా అర్జునుడు వేసిన బాణానికి ఆమె తల తెగి దండకారణ్యంలో పడగా, అది నాయకపోడు తెగకు దొరికినట్లు పురాణ గాథ ఉందని గిరిజనులు చెబుతారు. తమకు లభించిన రుక్మిణీ తలను శ్రీకృష్ణునికి అప్పగించేందుకు గిరిజనులు తీసుకెళ్తారు. అప్పటికి యుద్ధ రంగంలో గుర్తించిన రుక్మిణి మొండానికి గుర్రం తలను అమర్చేందుకై కృష్ణుడు యజ్ఞం ప్రారంభిస్తారు. అదే సమయంలో రుక్మిణి తలతో వచ్చిన నాయకపోడు తెగవారిని చూసి శ్రీకృష్ణుడు వారిని అభినందించి రుక్మిణి మొండానికి వారు తీసుకువచ్చిన తలను జత చేస్తారు. అదే సమాయానికి గుర్రం తలకు సైతం ప్రాణం రావడంతో దానిని లక్ష్మీదేవతగా నాయకపోడు తెగవారు భావిస్తారు. అప్పటి నుంచి గుర్రం తల కలిగిన ప్రతిమను నాయకపోడు తెగ గిరిజనులు పూజలు నిర్వహిస్తోన్నట్టు చెబుతారు. గిరిజన జాతలు, తెగల్లోని సంస్కృతి, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్న తరుణంలో కనీసం మేడారంలో జాతరలోనైన ఇవి కాపాడుతున్నాయి.
**సమ్మక్కకు.. అయ్యప్పకు సారూప్యం
మేడారంలోని సమ్మక్క- సారలమ్మ వన దేవతలకు, శబరిమలలోని అయ్యప్పకు మధ్య దగ్గరి సారూప్యం కనిపిస్తుంది. మేడారంలోని వన దేవతల పూజలు, చరిత్రకు, అయ్యప్ప స్వామి పూజలు, చరిత్రకు అతి దగ్గరి సారూప్యం ఉంది. సహ్యాద్రి పర్యత శ్రేణుల్లో అయ్యప్ప కొలువు దీరితే, దండకారణ్యంలోని మేడారం అడవిలో సమక్క-సారలమ్మలు కొలువు దీరుతారు. అయ్యప్ప ఆలయాన్ని ఏడాదికి కేవలం మూడు సార్లు మాత్రమే తెరిస్తే, మేడారం జాతర రెండేళ్లకోసారి మాత్రమే నిర్వహిస్తారు. అయ్యప్పను దర్శించుకునే భక్తులు మొదట ఎరుమేలిలో వావర్‌స్వామిని దర్శించుకుంటే, మేడారం జాతర భక్తులు మొదట ములుగు సమీపంలోని గట్టమ్మ దేవతను దర్శించుకుంటారు. అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు పంబా నదీలో స్నానం ఆచరిస్తే, మేడారం భక్తులు జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. శబరిలో మకర జ్యోతికి ముందు పందళ రాజవంశీయుల నుంచి నగలను తీసుకవచ్చి అయ్యప్పకు అలంకరిస్తే, మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవతలను చిలుకలగుట్ట, కనె్నపల్లి నుంచి తీసుకువస్తారు. అయ్యప్ప స్వామిని భక్తులు నెయ్యితో కొలిస్తే, మేడారంలో వన దేవతలను బంగారంతో (బెల్లం) కొలుస్తారు. పందళరాజు రాజశేఖరునికి అయ్యప్ప అడవిలో వేటకు వెళ్లినప్పుడు లభిస్తే, మేడారం రాజు పగిడిద్దరాజు కూడా వేటకు వెళ్లినప్పుడే సమ్మక్క లభిస్తుంది. అయ్యప్పస్వామి పులి మీద స్వారీ చేసినట్టుగానే సమ్మక్క-సారలమ్మలు ఒకరు పులి మీద, మరొకరు జింక మీద స్వారీ చేస్తారు. అయ్యప్పతో పాటు భక్తులు ఆయన సోదరులైన కుమారస్వామి, వినాయకున్ని కొలిచినట్టుగానే, మేడారంలో భక్తులు సమ్మక్క కూతురు సారాలమ్మ, కుమారుడు జంపన్నను కొలుస్తారు. శబరిలో ప్రతి ఏడాది జనవరిలో అయ్యప్ప దర్శనం ఇస్తే మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరిలో సమ్మక్క దర్శనం ఇస్తారు.
2. భక్త జనసంద్రంగా మేడారం పరిసరాలు
లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మేడారం జాతరలో రెండో రోజు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరించిన అనంతరం అమ్మవారికి ప్రీతి పాత్రమైన బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల వద్ద క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. బుధవారం అర్ధరాత్రి గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరోకోగా ఇవాళ సాయంత్రం సమ్మక్క చేరుకోనుంది.
3. మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం
మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి మేడారం గద్దెల పైకి సారలమ్మ చేరుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అర్ధరాత్రి 12:30 గంటలకు గద్దెలపైకి సారలమ్మ చేరుకుంది.
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తోంది.
4. మేడారంలో ఆదివాసీ మ్యూజియంను సంద‌ర్శించిన మంత్రి స‌త్య‌వ‌తి
మేడారంలో ఆదివాసీ మ్యూజియంను సంద‌ర్శించిన మంత్రి స‌త్య‌వ‌తి హైద‌రాబాద్‌: మేడారంలో బ‌స చేసిన గిరిజ‌న సంక్షేమ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌.. ఇవాళ అక్క‌డ ఆదివాసీ మ్యూజియంను సందర్శించారు. సమ్మక్క – సారలమ్మ వాడిన కత్తులు, వస్తువులు, నాటి దుస్తులు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిశీలించారు. అనంతరం జంపన్న వాగు దగ్గర వసతులను ఆమె పర్యవేక్షించారు. ఆ తరవాత మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జడ్పీ చైర్మన్ జగదీశ్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా, సీపీ రవీందర్, కలెక్టర్ కర్ణన్, ఇతర అధికారులు కలిసి మేడారంలో భక్తులకు వసతులు, శాంతి భద్రతలపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం మేడారం గద్దెల వద్ద ప్రధాన రహదారి పై దుకాణాల్లో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నివారణ పై పర్యవేక్షించారు. పరిశుభ్రత పాటించని దుకాణాలు మూసి వేయాలని అధికారులకు ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా సీఎం కేసీఆర్ గారు రేపు మేడారం రానున్న సందర్భంలో సీఎం వసతి, బస, హెలిప్యాడ్ ప్రదేశాలని తనిఖీ చేశారు. హెలికాప్టర్ లో ఎక్కి మేడారంలో భక్తుల సౌకర్యాలు, క్యూ లైన్ లను విహంగ వీక్షణం చేశారు.
5. మేడారం జాతర : ఎడ్ల బండ్లే.. గుడారాలు
ఎడ్ల బండ్లే.. గుడారాలు మేడారం బృందం: ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లపై భక్తులు జాతరకు తరలివచ్చారు. దాదాపు 150 నుంచి 300 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే ఈ భక్తులు ఎన్నో ఏళ్ల నుంచి ఎడ్ల బండ్లనే తమ వాహనాలుగా ప్రయాణం చేస్తున్నారు. అంతకంటే పూర్వం కాలినడకనే జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకునే వారమని చెబుతున్నారు. దాదాపు వందేళ్ల నుంచి ఈవిధంగా ఎడ్ల బండ్లపై జాతరకు రావడం ఆనవాయితీగా మారిందన్నారు. తల్లులు గద్దెలను చేరిన రోజే దర్శించుకుంటామని చెబుతున్నారు. జాతర జరిగే నాలుగు రోజులు ఇక్కడే బస చేస్తామని, సమ్మక్క గద్దెకు చేరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భూపాలపట్నం, భూపాలపల్లి జిల్లా యాసన్‌పల్లి, ముత్తారం, దౌత్‌పల్లి, దొబ్బలపాడు, ఆజంనగర్‌, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలాల నుంచి అనేక మంది ఈవిధంగా ఎడ్లబండ్లలో అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చారు. వాటినే గుడారాలుగా మలుచుకుని బస చేస్తున్నారు. ఆధునిక యుగంలోనూ సంప్రదాయబద్ధంగా ఎడ్లబండ్లలోనే కుటుంబ సమేతంగా జాతరకు వస్తున్న వీరి కాలుష్యరహిత ప్రయాణం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.
6. బండెనక బండి కట్టి…
పండుగలు ఎన్ని ఉన్నా మేడారం జాతర అంటే సమ్మక్క, సారలమ్మలను కొలిచే భక్తులకు మహా సంబరం. మేడారం జాతర కంటే రెండు నెలల ముందు నుంచే తమ పిల్ల పాపలతో వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఎడ్ల బండ్లను సిద్దం చేసుకోవడంతో పాటు జాతరలో బలి ఇచ్చేందుకు మొక్కుకున్న కోడి పుంజులను, మేక పోతులను, గొర్రె పొట్టే ల్లను తమ వెంట తీసుకువెళ్లేందుకు సమకూర్చుకుంటారు. జాతరకు వెళ్లడానికి ముందు ఇంటిని శుద్ధి చేసుకొని, ఇంట్లో సమ్మక్క పండుగను చేసుకుంటారు. మేడారం చేరుకోవడానికి దూరప్రాంతాలైన చత్తీస్‌గడ్, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు నెల ముందే బయలు దేరుతారు. దగ్గర ప్రాంతాల్లోని వారేమో వారం ముందు బయలు దేరి, ముందుగా సిరిసిల్ల రాజన్న జిల్లా జిల్లా వేములవాడ రాజన్నను, సిద్దిపేట జిల్లా కొమురెల్లిని మల్లన్నను దర్శించుకుంటారు. రాజన్నను తప్పని సరిగా దర్శించుకున్న తర్వాతే మేడారానికి రావడం అనావాయితీగా వస్తోంది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఏ సౌకర్యానికి కూడా ఇతరులపై ఆధారపడరు. తమ వెంటే వంట చెరుకును, వంట సరుకులను, సామాగ్రిని, ఉండటానికి కావాల్సిన గుడారాలను ఎడ్ల బండ్లకు పైనా కట్టుకొని వస్తారు. మార్గ మధ్యలో వచ్చే గుళ్లు గోపురాలను దర్శించుకుంటూ, నీళ్లున్న చోట వంటలు చేసుకుంటు, సత్రాల్లో బస చేసుకుంటు మాఘశుద్ధ పౌర్ణమికి రెండు రోజుల ముందు తడ్వాయి అడవుల్లోకి చేరుకుంటారు. జాతరకు ముందు రెండు వారాల ముందు దండకారణ్యంలో ఎక్కడ చూసిన చీమల బారుగా వెళ్లే ఎడ్ల బండ్లే కనిపిస్తాయి. మేడారానికి నాలుగు, అయిదు కిలో మీటర్ల దూరంలోనే బస చేయడానికి అనువైన చోటు చూసుకొని, అక్కడ గుడారాలను వెసుకుంటారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు వచ్చే బుధవారం రోజున సారలమ్మను తీసుకురావాడానికి మేడారం నుంచి కనే్నపల్లికి వెళ్లే పూజారుల వెంట భక్తులు వెళ్తారు. సారలమ్మ బుధవారం రాత్రికి మేడారం గద్దెలకు చేరుకోగానే, ఆ మరుసటి రోజు గురువారం ఉదయం నుంచే పూజారులు (వడ్డెరలు) తమ ఇలవేల్పుకు పూజాలు ఆరంభిస్తారు. అవీ సాయంత్రం మూడు గంటలకు ముగియగానే, మేడారం నుంచి పూజారుల కుటుంబాలు సాంప్రదాయ గిరిజన వాయిద్యాలతో చిలుకల గుట్టకు బయలుదేరుతారు. వారి వెంట సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, దేవాదాయశాఖ అధికారులు, లక్షలాది మంది భక్తులు చిలకల గుట్ట దిగువ భాగానికి చేరుకుంటారు. గుట్టపైకి మాత్రం కేవలం పూజారులు మాత్రమే వెళ్తారు. అక్కడికి గిరిజనులకు తప్పా మరొకరికి ప్రవేశం లేని గుడిలో పూజలు జరిపి, ఆ తర్వాత గుట్ట దిగి కిందకి బయలుదేరుతారు. మొదటిసారి సమ్మక్కను తెచ్చే పూజారి భక్తులకు కనిపించగానే, సంబంధిత జిల్లా ఎస్సీ గాలిలోకి మూడు సార్లు కాల్పులు జరుపుతారు. సమ్మక్క బయలు దేరిందనడానికి కాల్పుల శబ్ధాన్ని సంకేతంగా భావించి మేడారంలో సిద్ధంగా ఉంచుకున్న కోళ్లు, గొర్రె పోటెళ్లు, మేకపోతులను బలి ఇస్తారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం దాకా గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు సమర్పించాక భక్తులు తిరుగు పయనమవుతారు. గురువారం రాత్రి నిండు పౌర్ణమి వెలుతురులో మేడారం అడవిలో చెట్లు, పుట్ట, చెమల మధ్యలో భక్తుల వంటల మంటలు, వాటి వల్ల కమ్ముకునే పొగ మేఘాలు, విందు వంటకాల గుబాలింపులు, గిరిజన సాంప్రదాయిక వాయిద్యాల చప్పుళ్లు భక్తులకు అలౌకిక ఆనంద పారవశ్యుల్ని చేస్తుంది.
7. చిలకలగుట్ట బయల్దేరిన పూజారులు
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ప్రధాన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చేందుకు పూజారులు బయల్దేరారు. గిరిజన సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో అక్కడికి పయనమయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం సమ్మక్కను మేడారానికి తీసుకురానున్నారు. సమ్మక్క వచ్చే మార్గంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మేడారం గద్దెల వద్ద భక్తుల తాకిడిని మంత్రులు ఎర్రబెల్లి , సత్యవతి రాథోడ్ పరిశీలించారు