DailyDose

తెదేపా నేత నివాసంలో ఐటీ సోదాలు-రాజకీయం

TDP Leader Under Income Tax Scrutiny-Telugu Political News Roundup

* కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 10 మంది ఐటీ అధికారులతో కూడిన బృందం కడప ద్వారకానగర్‌లోని ఆయన నివాసంలో పలు దస్త్రాలను పరిశీలించింది. ఆయన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేసింది. సకాలంలో ఆదాయపుపన్ను చెల్లిస్తున్నారా? అనే వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇంటి తలుపులు మూసివేసి ఎవరూ లోపలికి వెళ్లకుండా బయట పోలీసులు మోహరించారు. ప్రముఖ కాంట్రాక్టరైన శ్రీనివాసులరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంట్లోని పలు రికార్డులు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు పరిశీలించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
* ప్రధాని పదవి కోసమే దేశాన్ని విభజించారు : మోదీ
రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఏకిపారేశారు. ‘‘భారత ప్రధాని కావాలన్న ఒకరి (నెహ్రూ) ఆకాంక్ష కోసం ఓ మ్యాపులో లైను గీసి, భారత్‌ను రెండుగా విభజించారు. విభజన తర్వాత హిందువులను, సిక్కులతో పాటు ఇతర మైనారిటీలను ఎలా హింసించారో ఊహించడానికే కష్టం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 1950 లో నెహ్రూ, లియాఖత్ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లోని మైనారిటీలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయమని సంతకాలు చేశారని గుర్తు చేశారు.
* ప్రధాని మోదీని అభినందించా: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం దేశ ప్రజలను ఆకట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొనియాడారు. లోక్‌సభ తర్వాత ప్రధాని మోదీని అభినందించానని చెప్పారు. అయితే ప్రధాని ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం లేకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విచారం వ్యక్తం చేశారు.
* ప్రజలే కేంద్రంగా పాలన ఉండాలి: కేటీఆర్‌
మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. మున్సిపల్‌ అధికారులు ప్రజలతో మమేకం కావాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలే కేంద్రంగా పాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అందాల్సిన పౌరసేవలు పారదర్శకంగా, అవినీతిరహితంగా.. వేగంగా అందాలన్న లక్ష్యంతో పలు విధానాలు తీసుకొస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. అవినీతికి తావులేకుండా నిర్దిష్ట సమయంలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. మున్సిపల్‌ చట్టంలోని విధులనే జాబ్‌చార్ట్‌గా భావించాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగించాలని మంత్రి వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్‌లు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.
* సెలక్ట్‌ కమిటీ ఛైర్మన్లుగా బుగ్గన, బొత్స
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్‌ కమిటీలను నియమిస్తూ ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లుకు బొత్సను ఛైర్మన్లుగా నియమించారు. ఒక్కో కమిటీలో ఛైర్మన్‌ సహా 8 మంది సభ్యులుగా ఉండనున్నారు. సెలక్ట్‌ కమిటీల నియామకంపై ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. కమిటీల నియామకం లేఖలను ఛైర్మన్‌ షరీఫ్‌.. అసెంబ్లీ కార్యదర్శికి పంపినట్లు సమాచారం.
*రజనీ పై మండిపడుతున్న తమిళ ప్రతిపక్ష నేతలు
చట్టానికి మదతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనను వరుస కౌంటర్ లు పేలుతున్నాయి. సిఏఏ ఎన్పేఆర్ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి రజనీకాంత్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నాయకులూ తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం రజనీకాంత్ పై విమర్శలు గుప్పించారు. అధికార భాజపా చేతిలో ఆయన కీలుబొమ్మగా మారిపోయారని తమిళ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఆలగిరి మండిపడ్డారు.
*కన్నడ కేబినెట్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్స్‌-పూర్తయిన మంత్రివర్గ విస్తరణ
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్స్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన 10 మంది శాసనసభ్యులను (వీరంతా కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల నుంచి వచ్చిన వారే) కేబినెట్‌లోకి తీసుకున్నారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం రాజ్‌భవన్‌లో జరిగింది. గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా వీరితో ప్రమాణం చేయించారు. దీంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 18కి(సీఎంతో కలిపి) చేరింది. యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే.
*స్థిరాస్తి వ్యాపారం కోసమే ఫార్మాసిటీ:కోమటిరెడ్డి
స్థిరాస్తి వ్యాపారం కోసమే తెలంగాణలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలిసిన ఆయన.. ఫార్మా సిటీ భూ అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మా సిటీ అనుమతులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వద్ద ఎకరా రూ. 8 లక్షలకు కొనుగోలు చేసి రూ. కోటిన్నరకు విక్రయిస్తున్నట్లు కోమటిరెడ్డి ఆరోపించారు. ఫార్మా కంపెనీలతో చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
*రామమందిర నిర్మాణంపై తెరాస వైఖరిని స్పష్టం చేయాలి
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై తెరాస విధానపరమైన వైఖరేంటో స్పష్టం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మతం రంగుతో రాజకీయ పన్నాగాలు పన్నుతున్న ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీకి సీఎం కేసీఆర్ ఊతమిస్తున్నారని విమర్శించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలనే కాకుండా దేవుళ్లు, దేవతలనూ సీఎం మోసం చేస్తున్నారని, ఇప్పటివరకు చేసిన రూ.98 కోట్ల వ్యయంలో అధికార పార్టీ నేతలు అందినంత మేరకు దండుకున్నారని ఆయన ఆరోపించారు. రామమందిర నిర్మాణంపై ట్రస్టును ఏర్పాటుచేస్తున్నట్లు లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ భాజపా నేతలు పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం మేడారం జాతరలో భక్తులకు వైద్యసేవలను అందించేందుకు గాను భాజపా వైద్య విభాగం ఆధ్వర్యంలో సిద్ధంచేసిన అంబులెన్స్లను లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు.
*ప్రభుత్వ చర్యతో పేద రైతులకు అన్యాయం: పవన్కల్యాణ్
విశాఖ మహా నగరానికి సమీపంలోగల పది మండలాల్లో భూ సమీకరణ పేరుతో అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోడానికి సిద్ధమైన రాష్ట్రప్రభుత్వం పేద రైతులకు అన్యాయం చేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ విమర్శించారు. ప్రభుత్వ చర్యతో ఎస్సీ, ఎస్టీ రైతులు ఎక్కువగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులను ప్రభుత్వం రోడ్డున పడేసిందని, అదేవిధంగా తమనూ రోడ్డు మీదకు తీసుకొస్తారేమోనని ఉత్తరాంధ్ర రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో భూ సమీకరణ అంశం బుధవారం పవన్కల్యాణ్ దృష్టికి రావడంతో ఆయన జనసేన నాయకులతో చర్చించారు.
*22 నుంచి మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు
సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలను ఈ నెల 22 నుంచి 24 వరకు మంచిర్యాలలో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి వెల్లడించారు. మహాసభలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారన్నారు. బుధవారం హైదరాబాద్లో హిమాయత్నగర్లోని మఖ్దూంభవన్లో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు.
*ఫలితాలు షాక్ ఇస్తాయి: షా
ఈ నెల 8న జరగనున్న దిల్లీ శాసనసభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని, వాటి ఫలితాలు అందరికీ షాక్ ఇస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. తూర్పు దిల్లీలో బుధవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘370 అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ, అయోధ్య వంటి విషయాల్లో కాంగ్రెస్, ఆప్లు భాజపాని వ్యతిరేకించాయి. కేవలం ఓటు బ్యాంకు భయంతోనే అలా చేశాయి. దేశాన్ని రక్షిస్తున్న మోదీ పక్షాన నిలవాలా, లేదంటే రాహుల్బాబా, కేజ్రీవాల్ అండ్ కో పక్షానా అనేది మీరు తేల్చుకోవాలి. మీ నిర్ణయమేమిటో నాకు తెలుసు’ అని అమిత్షా చెప్పారు.
*మున్సిపోల్స్లో బలపడ్డాం-‘సహకారం’లోనూ సత్తా చాటుతాం: లక్ష్మణ్
సహకార సంఘాల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి భాజపా సిద్ధమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్కమిటీ, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో మంగళవారం ఇక్కడ సమావేశమై అసెంబ్లీ, లోక్సభ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల శాతంపై చర్చించారు. అసెంబ్లీతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బాగా బలపడిందని.. ఓట్లు, సీట్లు పెరిగాయని అభిప్రాయపడ్డారు. 23 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైందని, తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతోందని కొందరు నేతలన్నారు.
*మేం అడ్డుకుంటే జగన్ తిరిగేవారా?:చంద్రబాబు
తెదేపా ప్రభుత్వం ధర్మం కోసం పోరాడుతోందని.. ఆ విషయం వైకాపా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ ఎక్కడికెళ్లినా తెదేపా ప్రభుత్వం అడ్డుకోలేదని.. అలా అనుకుంటే జగన్ రాష్ట్రంలో తిరిగేవారా? అని ప్రశ్నించారు. నాయకులు మాట్లాడే ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు హితవుపలికారు. ఇప్పటివరకు 37 మంది చనిపోయారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వైకాపా నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా వ్యవహరిస్తోన్న తీరుకు త్వరలోనే వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.
*నిరుద్యోగం యాదృచ్ఛికమా? మీ ప్రయోగమా?-మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక గట్టి కౌంటర్
దేశంలో 35 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం పెరగడం యాదృచ్ఛికమా? ప్రధాని చేసిన ప్రయోగమా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలనుద్దేశించి ప్రధాని మోదీ నిన్న దిల్లీలో చేసిన వ్యాఖ్యలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం దిల్లీలోని సంగమ్ విహార్లో రాహుల్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో ఏడు ప్రముఖ రంగాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు పోయాయని ఓ నివేదిక చెప్పినట్టు ఈ సందర్భంగా ప్రియాంక ప్రస్తావించారు. ప్రధాని ఎప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడినా నిరుద్యోగం గురించి నోరుమెదపరన్నారు. నేడు దేశంలో నెలకొన్న ఈ తీవ్ర నిరుద్యోగ సమస్యకు కారణం యాదృచ్ఛికమా?.. ఆయన చేసిన ప్రయోగమా? మోదీ చెప్పగలరా అని ప్రశ్నించారు.
*వైకాపా ప్రభుత్వం మసికావడం ఖాయం: లోకేశ్
వైకాపా మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎందుకు చెప్పలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. అమరావతిని మార్చబోం అని చెప్పిన వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించి సభలో లోకేశ్ మాట్లాడారు
*ఓట్లకోసం మభ్యపెట్టే ప్రభుత్వం కావాలా?: మోదీ
దేశ రాజధానిలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయపార్టీలు తమ విమర్శలకు పదును పెట్టాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అధికార ఆమ్ ఆద్మీపై తన విమర్శలు కొనసాగించారు. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వం అక్కర్లేదన్నారు. శత్రువులు దాడి చేసేందుకు అవకాశమిచ్చే ప్రభుత్వానికి ప్రజలంతా చరమగీతం పాడాలని షహీన్బాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మోదీ పిలుపునిచ్చారు. రహదారులను దిగ్భందించే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదంటూ ఆప్కు చురకలంటించారు.
*భాజపాలో చేరిన సమీర్ ద్వివేది
కాంగ్రెస్ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది కుమారుడు సమీర్ ద్వివేది భాజపాలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో సమీర్ మంగళవారం కమలదళం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. ‘‘మొదటి సారి నేను ఓ రాజకీయ పార్టీలో చేరాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రేరణ పొందే భాజపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు. సమీర్ తండ్రి జనార్దన్ ద్వివేది దశాబ్దం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. గతంలో మతపరమైన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్తో వేదిక పంచుకున్నారు.
*కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు అన్యాయం: బీవీ రాఘవులు
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా మార్చి 16 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, టి.జ్యోతి పాల్గొన్నారు.
*సీఏఏను వ్యతిరేకిస్తాం: కె.కేశవరావు
పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ)ను తెరాస వ్యతిరేకిస్తోందని ఎంపీ కేశవరావు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇచ్చినప్పటికీ, సీఏఏను వ్యతిరేకిస్తామన్నారు. హైదరాబాద్లో సుమారు 14 శాతం ముస్లింలు ఉన్నారని, అంతా కలసిమెలసి ఉంటున్నామని తెలిపారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో అర్థం చేసుకోవాలని సూచించారు. పౌరసత్వ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో కేంద్రం యోచించాలని కేశవరావు తెలిపారు.
*జగనే బినామీలకు బ్రాండ్ అంబాసిడర్
బినామీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఆయనకు చెందిన మీడియా…తెదేపా నేతలపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని తెదేపా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘తన ఆస్తులు, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ బినామీలతోనే నడుపుతున్న జగన్, చివరకు రాజకీయాల్లోనూ కేసీఆర్కు బినామీగా వ్యవహరిస్తున్నారు. తెల్ల రేషన్కార్డుదారులు అమరావతిలో భూములు కొంటే దాన్ని తెదేపాకి అంటగట్టడం ఎంత వరకు సబబు?’’ అని రామానాయుడు నిలదీశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 4 వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. జగన్ పత్రిక 600 ఎకరాలంటూ కొత్త కథలు చెబుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల ప్రకారం గత ఐదేళ్లలో 125 ఎకరాల రిజిస్ట్రేషన్లే జరిగాయని తెలిపారు.
*మా దృష్టిలో శాసనమండలి రద్దయిపోయింది: సజ్జల
‘మా దృష్టిలో రాష్ట్ర శాసనమండలి రద్దయిపోయింది. ప్రక్రియ పూర్తికి సాంకేతికంగా కొంత సమయం పట్టవచ్చు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘సెలక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని ఇప్పటివరకూ మమ్మల్ని ఎవరూ అడగలేదు. ఒకవేళ సెలక్ట్ కమిటీ వచ్చినా, మూడు నెలలకు మించి బిల్లులను ఆపే పరిస్థితి లేదు. సెలక్ట్ కమిటీకి పంపడం తప్పని అదేరోజు సభలో, బయట చెప్పిన భాజపా, పీడీఎఫ్ వాళ్లు ఇప్పుడెందుకు కమిటీకి ప్రతినిధుల పేర్లు ఇచ్చారో వారే చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మంగళవారం విలేకర్లతో మాట్లాడారు.