DailyDose

స్వరూపానందకు అమరావతి సెగ-తాజావార్తలు

Swaroopananda Faces Amaravati Protest-Telugu Breaking News Roundup

* గుంటూరులో స్వరూపనంద సరస్వతీ కి అమరావతి సెగ.గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం కు వచ్చిన సరూప నంద సరస్వతీ.అమరావతి కి మద్దతు పలకాలని మహిళలు నినాదాలు.జై అమరావతివాదాలు,మహిళలు పై వైసిపి నేతలు దాడికి యత్నం.బలవంతంగా స్వామీజీ ని కారులో ఎక్కించుకోని తీసుకెళ్ళిన వైసిపి నేతలు.
* అల్లు అర్జున్ దంప‌తులు ఈ రోజు ఉద‌యం శ్రీనివాసుడిని ద‌ర్శించుకున్నారు. శ్రీవారికి వేకువజామున నిర్వహించే అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి బన్నీ పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. బన్నీతో పాటు అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, నిర్మాత రాధాకృష్ణ‌, బ‌న్నీవాసు కూడా శ్రీవారి ఆశీర్వాదం పొందారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అల వైకుంఠ‌పురములో చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో టీం అంతా తిరుమ‌ల‌కి చేరుకొని మొక్కుని చెల్లించుకున్న‌ట్టు తెలుస్తుంది.
* తిరుమ‌ల శ్రీ‌వారిపై అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడుశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ తెలిపారు
* శ్రీ‌వారి 4వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ ఆదివారం పౌర్ణమి గరుడసేవలో వైభవంగా జరుగనుంది. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు
* ప్ర‌ధాని మోదీ ఇవాళ అస్సాంలోని కోక్ర‌జార్ జిల్లాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. బోడోల‌తో ఇటీవ‌ల శాంతి ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో.. అక్క‌డ భారీ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. హింస వ‌ల్ల శ‌ర‌ణార్థుల‌గా మారిన వేలాది మంది ఈశాన్య రాష్ట్ర ప్ర‌జ‌లు.. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించిన‌ట్లు చెప్పారు.
* కేరళ ప్రభుత్వం తన బడ్జెట్‌ప్రతిపై మహాత్మాగాంధీ హత్యోదంతాన్ని చిత్రీకరించింది. కేరళ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తన ఐదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీఎం థామస్‌ ఐసాక్‌ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్‌ ఎండీని ఆదేశించింది. గతంలో డీపీఆర్‌ రూపకల్పనకు ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియంకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త డీపీఆర్‌కు ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖలో 79.9 కి.మీ పరిధిలో మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌కు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది.
* తెదేపా అధినేత చంద్రబాబుకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సీఎం జగన్‌ దయాగుణం వల్లే ఇంకా ఆయన తిరగగలుతున్నారని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.15వందల కోట్లు వెచ్చించిందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ కార్యక్రమంపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెల తనిఖీ విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పాఠశాల విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు
* జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
* కియా సంస్థ ప్రతినిధులు చెప్పినా పరిశ్రమ తరలిపోతోందని తెదేపా నేతలు గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఎవరైనా వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ఫోక్స్ వ్యాగన్ వ్యవహారంలో నమ్మి మోసపోయానని దానిపై సీబీఐ దర్యాప్తు కూడా వేసుకున్నామని ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యానించారు.
* పింఛన్ల సంఖ్య తగ్గించుకోవాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 53లక్షల 70వేల 210 మందికి పింఛన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
* సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ లో పెన్షన్ల తొలగింపునకు నిరసనగా మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేపట్టిన నిరసన కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు.
* నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 11) విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నేడు పరిశీలించింది
* సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కు వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. సీబీఐ కోర్టుకు సీఎం జగన్‌ హాజరుకాలేదు. సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అక్రమాస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులో జగన్‌ నేడు హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావలసి ఉంది.సీబీఐ వేసిన 11 ఛార్జిషీట్లు, ఈడీ వేసిన 5 అభియోగపత్రాలపై విచారణ జరగాల్సి ఉంది. కానీ న్యాయమూర్తి సెలవు కారణంగా ఈ కేసుపై విచారణ వాయిదా పడింది. కాగా… కచ్చితంగా రావాలన్న కోర్టు ఆదేశంతో గత నెల 10న జగన్‌ కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్‌ అభ్యర్థనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.
* ఉత్తరాఖండ్‌లో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. చమోలీ జిల్లాలోని నందప్రయోగ్ వద్ద భద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు శిథిలాల తొలగింపు చేపట్టారు. చార్‌ధామ్ యాత్రకోసం రహదారిని వెడల్పు చేస్తుండడంతోనే కొండచరియలు విరిగిపడ్డాయని భావిస్తున్నారు.
* ఐఎస్‌ఎస్‌లో 11 నెలలు గడిపిన అమెరికా వ్యోమగామి క్రిస్టీనా కొచ్‌ గురువారం భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చారు. ఆమె ఐఎస్‌ఎస్‌లో 328 రోజులు ఉన్నారు. క్రిస్టీనా ఉన్న సోయుజ్‌ మా డ్యూల్‌ ఉదయం భూమిపైకి చేరింది.
* ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 5, 7, 8, 9, 11 తేదీల్లో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ రెండో దశ పరీక్షకు ఈ నెల 7 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎన్‌టీఏ తెలిపింది
* నిర్భయ కేసులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.
దోషుల ఉరిపై స్టేను ఎత్తివేయాలని తొలుత దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది.
* చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 636కు చేరింది. గురువారం ఒక్కరోజే 73 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 31,000 మందికి పైనే ఈ వైరస్‌ సోకినట్లు వెల్లడించారు. వైరస్‌కి కేంద్రంగా ఉన్న వుహాన్‌లో 69 మంది మృత్యుఒడికి చేరారు. మరో 3,143 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకొని 1,540 మంది ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు.
* అమరావతి పరిరక్షణ సమితి ఐకాస, రాజధాని రైతుల దిల్లీ పర్యటన ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వారంతా తెదేపా ఎంపీలతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఏపీ రాజధాని విషయంలో జోక్యం చేసుకునేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గత 52 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు
* ఇప్పటివరకు రాష్ట్రంలో పరీక్షలు చేసిన వారెవరికీ కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారికి వైద్యపరీక్షలు నిర్వహించడం ఆలస్యమవుతండటంతో.. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో సోమవారం నుంచి ఇక్కడే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా పడింది. ఈ మేరకు నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు మన్మోహన్‌సింగ్‌, శామ్యూల్‌, రాజగోపాల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. సీఎం జగన్‌ కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది.
*సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్లో ఈ నెల 9న ఇఫ్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించనున్నారు. ఐఐటీహెచ్లోని స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ తయారు చేసిన ఈ స్కూటర్ను నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీ్షరెడ్డి, ఐఐటీహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎస్ మూర్తి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్లు ఆదివారం ఆవిష్కరిస్తారు.
*కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఉన్నతాధికారులు, ఇంజినీర్ల బృందం గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు బాటపట్టింది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) ఎండీ బి.మనోహర్రావు నేతృత్వంలో 12 మంది ఇంజినీర్లు, నీటిపారుదలశాఖ అధికారులు ప్రత్యేక బస్సులో ఇక్కడికి వచ్చారు. తొలుత లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ, లక్ష్మీ (కన్నెపల్లి) పంపుహౌస్, సరస్వతి(అన్నారం) బ్యారేజీ వద్ద ఎస్ఈ రమణారెడ్డితో కలిసి ప్రాథమికంగా పరిశీలించారు. ఆయా నిర్మాణాల వద్ద పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశం ఉన్న స్థలాలను చూశారు.
*ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యను కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ పరిష్కరించడంతో సంబంధిత రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఎదుటే ఆయన్ను ఎత్తుకొని సంబరాలు జరుపుకున్నారు. గురువారం బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి వారందరికీ పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు.
*హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటుకు సంబంధించి కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు అడిగిన సమాచారంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం రాలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఈఐటీ) శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు.
*ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేస్తున్న నేపథ్యంలో ‘ప్రభుత్వ భవనాల నిర్వహణ’ విషయమై కేంద్రప్రభుత్వ వైఖరి తెలుసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నేషనల్ బిల్డింగ్ కోడ్ వివరాలు అధ్యయనం చేసి రావాలని సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కృష్ణమోహన్కు సూచించింది. ఆర్టీసీ కార్గో బస్సులపై తన బొమ్మ వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కోరిన విషయం పత్రికల్లో చూశామని.. అలాగే ఏపీలోనూ ప్రభుత్వ కార్యాలయాలపై తన బొమ్మ వద్దని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారేమో చూద్దామని వ్యాఖ్యానించింది.
*శాంతియుతంగా నిర్వహించుకునే సమావేశాలు, ఊరేగింపుల విషయంలో పోలీసుల నియంత్రణను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా షరతులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఐఏఎస్ షఫీకుజ్జమాన్, మరొకరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు చట్టం ప్రకారం ఊరేగింపు, సమావేశాలను నియంత్రించాలే తప్ప నిషేధించరాదని చెప్పారు. పోలీసులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తగిన కారణం లేకుండా నిరాకరిస్తున్నారని చెప్పారు. తలుపులు మూసుకుని లోపల నిర్వహించుకునే సమావేశాలకు కూడా పోలీసు అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు.
*ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా పలు వివరాలను సమాచార కరపత్రిక (బ్రోచర్)లో ముద్రించి దాన్ని కళాశాలల వెబ్సైట్లో ఉంచడాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) తప్పనిసరి చేసింది. ఈ మేరకు తాజాగా కళాశాలల అనుమతులపై రూపొందించిన నియమావళిలో తప్పనిసరిగా వెల్లడించాల్సిన అంశాలను పేర్కొంది. లేకుంటే చర్యలు తప్పవని, సమాచారం కచ్చితంగా లేకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కళాశాలలు కోర్సులు, సీట్లు, అనుమతులు తదితర వాటిని కూడా ఆయా కళాశాలలు వెబ్సైట్లో ఉంచాలని పేర్కొంది. పలు కళాశాలలు ప్రాంగణ నియామకాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నాయి. 100 శాతం మందికి కొలువులు దక్కాయని, రూ.లక్షల్లో వేతనానికి ఎంపికయ్యారని ఇష్టారాజ్యంగా సమాచారం పొందుపరుస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ వేతనాలను పైకి చెబుతూ ఇతర బ్రాంచీల్లో పరిస్థితిని దాచిపెడుతున్నాయి.మరికొన్ని అసలే సమాచారాన్ని బహిరంగపరచడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
*వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే నీట్కు సన్నద్ధమయ్యేందుకు 10 నమూనా ప్రశ్నపత్రాలు, వాటి కీని వాట్సప్ ద్వారా పంపిస్తామని ఫోరమ్ ఫర్ నీట్ కన్వీనర్ కె.లలిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 98490 16661కు నీట్ అని టైప్ చేసి వాట్సప్ మెసేజ్ పంపించాలని ఆయన సూచించారు
*టైటానియంతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను భారత రక్షణ శాఖకు సరఫరా చేయాలని హైదరాబాద్కు చెందిన మిధాని (మిశ్రధాతు నిగమ్) లిమిటెడ్ నిర్ణయించింది. దీనిలోభాగంగా కజకస్థాన్కు చెందిన యూకేటీఎంపీ సంస్థతో కలిసి సంబంధిత ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిధాని సీఎండీ దినేష్ కుమార్ లిఖి, యూకేటీఎంపీ అధ్యక్షుడు మముటోవా అసేమ్ ట్లేకోవ్నాలు గురువారం ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.
*ఆర్టీసీ ఐకాస నుంచి తాము వైదొలిగామని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సంస్థకు చెందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలతో కలిసి గతంలో ఐకాసగా ఏర్పడ్డాం. సమ్మె విరమణ అనంతరం వివిధ కారణాల రీత్యా జేఏసీ స్పందించని పరిస్థితి నెలకొంది. దీంతో అందులోనుంచి బయటకు వచ్చాం. ఇకపై సమస్యల పరిష్కారానికి విడిగానే పోరాటం చేస్తాం’’ అని ఆయన తెలిపారు.
*రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా తలొగ్గేది లేదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) ప్రకటించింది. భూములను కాపాడేందుకు అహర్నిశలు కృషిచేస్తామని పేర్కొంది. గురువారం నిజామాబాద్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్ హైదరాబాద్లో విడుదల చేశారు. ఇటీవల కాలంలో భూరక్షణకు పాటుపడుతున్న ఉద్యోగులు, సిబ్బందిపై దాడులు చోటుచేసుకుంటున్నాయని ఇది సరికాదన్నారు.
*మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ‘సిల్వర్ ఓక్స్’ విద్యార్థులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన చిల్లరను ఆరు నెలల పాటు పొదుపు చేసి ఆ సొమ్మును రెండు స్వచ్ఛంద సంస్థలకు అందజేశారు. ఈ పాఠశాలలో మొత్తం 3,000 మంది విద్యార్థులున్నారు. చిన్నతనం నుంచే వారిలో సేవాతత్పరతను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం ఏటా ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి రూ. 19 లక్షలు సమకూరింది. పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కళ్లెడలోని రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) వ్యవస్థాపకురాలు వందితారావుకు రూ.14 లక్షలు, గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్తి మ్యానంపాడు గ్రామంలోని ‘నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్’ (నైస్) సంస్థ ప్రతినిధి పూర్ణచందర్రావుకు రూ. 5 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ ప్రసాద్ జాస్తి, డైరెక్టర్లు ధనుంజయ, నీలిమ, ప్రిన్సిపల్ సీతామూర్తి పాల్గొన్నారు.
*పౌరహక్కుల సంఘం 19వ రాష్ట్ర మహా సభలను ఈ నెల 8, 9వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ తెలిపారు. విజయవాడలో గురువారం కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్, ఆర్.శ్రీధర్, టి.గంగాధర్, డాక్టర్ బ్రహ్మం, విఘ్నేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు చేపట్టే పనులకు వేసవి దృష్ట్యా అదనపు వేతన భత్యం చెల్లించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. ఉపాధి కూలీలకు ఫిబ్రవరి, జూన్ నెలల్లో చేసే పనులపై 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం అదనపు వేతన భత్యం చెల్లించనున్నారు.
*ఆంధ్రప్రదేశ్లో జనాభాగణన విభాగం సంచాలకుడిగా (డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్/డైరెక్టర్ ఆఫ్ సిటిజన్ రిజిస్ట్రేషన్) ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 2023 మార్చి 31 వరకు ఆ పోస్టులో కొనసాగుతారు.
*గుంటూరు జిల్లాలోని పేరేచెర్ల-సాతులూరు మధ్య 23కిలోమీటర్ల మేర రెండో లైను(డబ్లింగ్) నిర్మాణం, విద్యుదీకరణను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు-గుంతకల్లు మధ్య 401కి.మీ.మేర రూ.3,631 కోట్లతో రెండో లైన్ నిర్మాణం, విద్యుదీకరణ ప్రాజెక్టును 2016-17లో చేపట్టారు. ఇందులో భాగంగా పేరేచెర్ల-సాతులూరు మధ్య మార్గాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. రాయలసీమ ప్రాంతానికి, కర్ణాటకకు ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను మరిన్ని నడిపేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
*స్థిరాస్తి వ్యాపార నియంత్రణ సంస్థ (రెరా) ఛైర్మన్, సభ్యుల భర్తీ కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కమిటీ ఛైర్మన్గా భూపరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్, సభ్యులుగా వెనుకబడిన తరగతుల సంక్షేమ, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల్ వలవన్, డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డిని నియమించారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన ఛైర్మన్, కొందరు సభ్యులు ఇప్పటికే ఉన్నప్పటికీ భర్తీ పేరుతో సెర్చ్ కమిటీని వేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
*జాతీయ ప్రతిభా పరీక్ష స్టేజీ-1 ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన నమూనా ప్రకారం ధ్రువపత్రాలను 25వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. ఫలితాలను ్ర్ర్ర.్జ(’్చ్ప.్న౯్ణ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. స్టేజీ-2 వచ్చే మే 10న నిర్వహించనున్నట్లు తెలిపారు.
*జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణాలను ‘యాన్యుటీ’ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ‘ఆసక్తి వ్యక్తీకరణ’ విధానంలో అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ నెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని అందులో పేర్కొన్నారు.
*కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందుకు నిరసనగా ఈ నెల 13న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకటించింది.