Movies

ఏడు దెబ్బలు

Tapsee's Seven Slaps

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి తాప్సీ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తప్పడ్‌’. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భర్తని, కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఇల్లాలి పాత్రలో తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రంలో తాప్సీ భర్తగా పవైల్‌ గులాటి నటిస్తున్నారు. అంతేకాకుండా ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండనుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా తాప్సీ ‘తప్పడ్‌’ సినిమా గురించి ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ‘తప్పడ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు.‘ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో పవైల్‌ గులాటి నన్ను చెంపదెబ్బ కొడతాడు. చూడడానికి అది ఒక్క చెంపదెబ్బ మాత్రమే.. కాకపోతే ఆ షాట్‌ చిత్రీకరించడానికి ఏడుసార్లు రీటేక్‌ చేశాం. ఇప్పటివరకూ నా కెరీర్‌లో ఏ సినిమా కోసం అన్నిసార్లు రీటేక్‌ చేయలేదు. సినిమాలో ఎంతో కీలకంగా ఉండే ఈ షాట్‌ కోసం మాత్రమే నేను అన్నిసార్లు చెంప దెబ్బలు తిన్నాను. ఆ షాట్‌ చాలా సహజంగా ఉండాలని అనుభవ్‌ చెప్పారు. ఎందుకంటే సినిమా చూసే ప్రేక్షకులు దాని ప్రభావాన్ని ఫీల్‌ కావాలి. అందుకనే పవైల్‌ కేవలం ఆషాట్‌ కోసమే రెండు రోజుల సమయం తీసుకుని సిద్ధమయ్యాడు. నిజం చెప్పాలంటే పవైల్‌ నన్ను చెంపదెబ్బ కొట్టడానికి చాలా భయపడ్డాడు, ఇబ్బందిగా ఫీలయ్యాడు. ముందు నన్ను కొట్టు.. ఆ తర్వాత నా భయం పోయి నిన్ను కొడతాను అని చెప్పేవాడు. అలా అతను కొన్నిసార్లు నా మెడపై, మరికొన్నిసార్లు నా చెవిపై కొట్టేవాడు. ‘నువ్వు మిగిలిన వాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. నన్ను గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టు చాలు అని చెప్పేదాన్ని’ అని తాప్సీ ఆ షాట్‌ గురించి వివరించారు.