Devotional

రేపు గుణదల మేరీమాత ఉత్సవాలు

Gundala Mary Utsavam 2020-Telugu Devotional News

దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు. తల్లి దేవుడితో సమానమైనప్పుడు, దైవ కుమారుడికే జన్మనిచ్చిన తల్లి గొప్పదనాన్ని ఏమని వర్ణించాలి.ఆమె మేరీమాత. అసలు పేరు మరియ. ఇజ్రాయెల్లోని గలీలియ ప్రాంతానికి చెందిన నజరేతు అనే గ్రామం ఈమెది. మూడేళ్ల వయసు నుంచి యుక్త వయసు వచ్చేవరకు యెరూషలేము దేవాలయంలో పెరిగినట్లు లేఖనాలు పేర్కొంటున్నాయి. తరువాత క్రీస్తుకు తల్లిగా, లోకమాతగా పూజలందుకుంటున్నారు.15, 16 శతాబ్ధాల్లో యూరప్లో యుద్ధాల ఫలితంగా తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో తమకు ఓదార్పును, సాంత్వనను ఇచ్చే తల్లిగా మేరీమాతను పూజించారని చరిత్రకారులు చెబుతున్నారు. 19, 20 శతాబ్ధాలలో కూడా ఆమె దివ్య దర్శనాల సంఘటనలున్నాయి. భారతదేశంలోని వేళాంగణి, ఫ్రాన్సులోని లూర్థు, పోర్చుగల్లోని ఫాతిమా, మెక్సికోలోని గుడలుప్పెల్లో అమ్మకు ప్రసిద్ధ ఆలయాలున్నాయి. విజయవాడలోని గుణదలలో ఉన్న దేవాలయం కూడా ఈ కోవలోనిదే. 1925లో గుణదల కొండపై ఫాదర్ ఆర్లతి అనే బోధకుడు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. 1971 నాటికి అదే పెద్ద ఆలయంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ఏటా జనవరి 31 నుంచి నవదిన ప్రార్థనలు జరుగుతాయి. ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు మూడు రోజులు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారు.