Movies

ఆస్కార్ బరిలో Netflix హవా

Netflix On High Rise In Academy Award Nominations

ఆస్కార్‌.. ప్రపంచ సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే అకాడమీ అవార్డ్‌. ఆస్కార్‌కి నామినేట్‌ అవ్వాలన్నా ఆ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడే విధంగా ఉండాలి. వెండితెరపై కాసుల వర్షం కురిపించి, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాలే ఆస్కార్‌కి నామినేట్‌ అవ్వటం కష్టం. అలాంటిది ఆస్కార్‌ వేదిక మీద డిజిటల్‌ మాధ్యమానికి బిగ్‌బాస్‌గా పిలుస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ తన హవా చూపిస్తోంది. 2020 అకాడమీ నామినేట్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రాలు మొత్తంగా 24 విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. అందులో ‘ది ఐరిష్‌ మ్యాన్‌ ’ ఒక్కటే అత్యధికంగా 10 నామినేషన్లు దక్కించుకుంది. 2020 ఆస్కార్‌ బరిలో అత్యధిక నామినేషన్లు పొందిన ‘జోకర్‌’ (11)తర్వాత స్థానంలో ‘ది ఐరిష్‌ మ్యాన్‌ ’ (10)నిలిచింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వెండితెరకు పోటీగా డిజిటల్‌ మాధ్యమం సవాల్‌ విసురుతుందనే చెప్పాలి. పుస్తకాల ఆధారంగా ఇప్పటికీ హాలీవుడ్‌లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా 2004లో ప్రచురితమైన ‘ఐ హర్డ్‌ యూ పెయింట్‌ హైసెస్స్‌’ అనే నవలకు వెండితెర రూపమే ఈ సినిమా. 1960లలో సాగే క్రైమ్‌ కథనం ఇది. ఫ్రాంక్‌ షీరన్‌ అనే ట్రక్‌ డ్రైవర్‌ అనుకోకుండా చీకటి సామ్రాజ్యంలోకి ప్రవేశించి గ్యాంగ్‌స్టర్‌గా మారిన వైనాన్ని ఈ చిత్రం చూపించింది. అక్కడ ఉండే అతి పెద్ద క్రైమ్‌ ప్రపంచంలో ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశం. డబ్బు అవసరంతో నేర వృత్తిలోకి వెళ్లిన అతడు మాఫియా డాన్‌కి ప్రాణ స్నేహితుడిగా మారతాడు. ఆ తరువాత ఫ్రాంక్‌ స్నేహితుడు జైలుకి వెళ్లటం, శిక్ష అనుభవించిన తరువాత బయటకి వచ్చి మరణించటం జరుగుతుంది. దీని వెనుక ఉన్న నాటకీయ పరిణామాలను 3 గంటల 29 నిమిషాల నిడివి గల సినిమాని ఏ మాత్రం విసుగు తెప్పించవు. కథలో ప్రేక్షకుడిని అలరిస్తాయి. అందుకే ఈ సినిమా ఎపిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా నిలిచింది. ఆస్కార్‌తో పాటుగా మరో 302 అంతర్జాతీయ అవార్డులకు నామినేట్‌ అయింది. ప్రముఖ దర్శకుడు మార్టిన్‌ స్కోర్సెస్‌ ఈ సినిమాని రూపొందించారు.

‘ది ఐరిష్‌ మ్యాన్‌’ నామినేట్‌ అయిన విభాగాలు ఇవే..!
* ఉత్తమ చిత్రం
* ఉత్తమ సహాయ నటుడు
* ఉత్తమ దర్శకుడు
* ఉత్తమ స్క్రీన్‌ ప్లే
* ఉత్తమ సినిమాటోగ్రఫీ
* బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌
* బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌
* బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌
* బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌

ఈ ఫిబ్రవరి 9న అమెరికాలో అంగరంగ వైభవంగా 92వ ఆస్కార్‌ వేడుకలు జరగనున్నాయి. వీటి ఫలితాల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు అమితాసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లాగే ఈ సారి కూడా హోస్ట్‌ లేకుండా వేడుక నిర్వహిస్తున్నట్టు అకాడమీ ప్రకటించిన విషయం తెలిసిందే.