Politics

అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయవల్సిందిగా ఒవైసీ విజ్ఞప్తి

Owaisi Requests KCR To Develop Mahankali Temple

నగరంలోని పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మహంకాళి ఆలయానికి చాలినంత స్థలం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని.. భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆలయాన్ని విస్తరించి, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్‌ఎంసీ అధీనంలోని ఫరీద్‌ మార్కెట్‌ స్థలం కేటాయించాలని సూచించారు. అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుల కోసం రూ.3 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని.. ఆ రెండింటి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.