భూమ్మీద ప్రతి పదార్థం భూమ్యాకర్షణకు లోబడి ఉంటుంది. భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే, పట్టులేకుండా అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. భూమ్మీద స్థిరత్వం లేకపోతే జీవి మనుగడే ప్రశ్నార్థకమయ్యేది. గ్రహాలెన్నో ఉండగా భూమ్మీద జన్మించడం మన అదృష్టం. అయస్కాంతం తన ఆకర్షణ శక్తితో ఇనుమును తనవైపు లాక్కుంటుంది. అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉంటే, దాని పరిధి అంత విస్తృతమై, దూరాన ఉన్న ఇనుమును సైతం ఇట్టే ఆకర్షించి అతుక్కుంటుంది. మనిషి తన అందంతో, మనసుతో ఇతరులను ఆకర్షిస్తాడు. ఇతర జీవాలు తమకు ప్రకృతి ప్రసాదిత దైహిక అందంతో ఆకర్షించినా- ఒక్క మనిషి మాత్రం తన ప్రవర్తన, నడవడిక, మనసుతో అందర్నీ ఆకర్షిస్తాడు. సమస్త జీవజాతిలో మనిషికి మాత్రమే దక్కిన అపురూప వరం ఇది. తన ప్రవర్తనను విచక్షణతో సరిదిద్దుకుని అందరికీ దగ్గరయ్యేలా చేసుకునే అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. మనకు నిత్య జీవితంలో కొంతమంది దగ్గరవుతారు. మరి కొంతమంది మన సాన్నిహిత్యాన్ని ఇష్టపడక, దూరమవుతారు. కారణం- మన మనసుకున్న ఆకర్షణ, వికర్షణల ప్రభావం.
పట్టువస్త్రాలు, ధగధగలాడే నగలు, దీపధూప నైవేద్యాలతో అలంకరించిన భగవంతుడి దివ్యమంగళ విగ్రహం భక్తులను ఆకర్షించి, తన్మయత్వానికి గురిచేస్తుంది. ఆ భక్తిభావం వారి మనసులో స్థిరంగా నిలిచిపోతుంది. స్వామి దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు రాగానే భక్తులకు ఎదురుపడేవారు ముందుగా అడిగే ప్రశ్న- ‘దర్శనం బాగా అయ్యిందా?’ అని. దర్శనానికి అంతటి ప్రాధాన్యం ఉంది. ముక్తికి దారిచూపే వంతెన- సర్వాలంకృత స్వామిసమ్మోహన రూపం. మన ఆలోచనలకు ఎంత ఆకర్షణ శక్తి ఉంటే- మనం అనుకున్నది అంత త్వరగా, సంపూర్ణంగా పొందగలుగుతాం’ అంటారు రోండా బర్న్ ‘ద సీక్రెట్’ పుస్తకంలో. అల్కెమిస్ట్ పుస్తకంలో పాలో కొలొ- మనం దేన్ని బలంగా కావాలని కోరుకుంటే, ప్రకృతి సహకరించి అసంఖ్యాకంగా ఉన్న వనరుల నుంచి అవసరమైనదాన్ని ఆకర్షించి మనకు సొంతమయ్యేలా చేస్తుందంటాడు. మనసు చాలా చిత్రమైంది. అది రోజుకు సుమారు అరవై వేల ఆలోచనలకు నెలవవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. నిరంతర ఆలోచనల పర్యవేక్షణ సాధ్యం కాదు. అన్ని ఆలోచనలూ సవ్యమైన రీతిలో సాగవు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అపసవ్యంగా పరిభ్రమిస్తూ, మనసును తద్వారా మనుషులను తప్పుదారి పట్టిస్తుంటాయి. పిచ్చెక్కిస్తుంటాయి. ఎంత త్వరగా అందులోంచి మన మనసును బయటపడేస్తే, అంత త్వరగా మనోవికా సాన్ని పొందుతాం. అభివృద్ధి పథంలో ముందుంటాం. మనిషి మనసు ఆలోచనా తరంగాలను ప్రసారం చేసే ఒక ట్రాన్స్‌మీటర్ అంటాడు ఓ భౌతిక శాస్త్రవేత్త. మనం దేని గురించి ఆలోచిస్తే, ఆ ఆలోచనా తరంగాలు ఒక ప్రత్యేక పౌనఃపున్యం(ఫ్రీక్వెన్సీ)తో ప్రకృతి మొత్తంగా విస్తరించి మనకు కావలసినదాన్ని ఆకర్షించి మనకు చేరువ చేస్తాయంటాడు.
మన ఆలోచనలు సదా సకారాత్మకం(పాజిటివ్)గా ఉండేలా చూసుకోవాలి. పొరపాటున ప్రతికూలం (నెగెటివ్) అయితే- అవి ఉపచేతన మనసుపై ముద్ర వేసి, ప్రకృతిలోని చెడును ఆకర్షించి అభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి. మన మధ్య సంచరించి ఉత్తమ స్థితిగతులు పొందినవారు- అదృష్టవంతులు, కారణజన్ములు కారు. మనసు మర్మాన్ని తెలుసుకుని, దాన్ని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడమే వారి ఘనతకు కారణం. ఆలోచనలకు ఉన్న శక్తి అపారం. అది తెలుసుకోవడమే మానవ జీవితంలోని అసలు రహస్యం. మనిషిని దేవుడికి దగ్గర చేసినా, దేవుణ్నిచేసినా, రాక్షసుడిగా మార్చినా- అందుకు ఆలోచనలకు ఉన్న ఆకర్షణే మూలకారణం.