* రైల్వే శాఖ దేశంలోని 100 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే బడ్జెట్ 2020 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని తేజస్ రైళ్లను పర్యాటక ప్రాంతాలకు అనుసంధానిస్తామని వెల్లడించారు. మరోపక్క భారత రైల్వే శాఖ ప్రైవేటు కంపెనీలకు అందించిన ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. దాదాపు 24కుపైగా ప్రపంచ స్థాయి సంస్థలు ఆసక్తి చూపాయి. వీటిలో ఆల్సోటామ్ ట్రాన్స్‌పోర్టు, బంబార్డియర్, సీమన్స్ ఏజీ, హ్యూందాయ్ రోటెమ్ వంటి సంస్థలు ఆసక్తి చూపాయి. ఇక దేశీయ కంపెనీల్లో టాటా రియాల్టీ, హిటాచీ ఇండియా, ఎస్సెల్ గ్రూప్, అదానీ పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు ఉన్నాయి. భారత రైల్వేశాఖ ఇప్పటికే 100 మార్గాలను గుర్తించి 150 రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ 100 మార్గాలను 10-12 క్లస్టర్లుగా మార్చారు. ముంబయి-న్యూదిల్లీ, చెన్నై-న్యూదిల్లీ, న్యూదిల్లీ – హౌరా, షాలిమార్-పుణె, న్యూదిల్లీ-పట్నా వంటి మార్గాలు వీటిల్లో ఉన్నాయి. ప్రతి రైలులో కనీసం 16 కోచ్‌లు ఉంటాయి. ఇక ఆ మార్గంలో ప్రయాణించే అతిపెద్ద రైలు కంటే ఎక్కువ కోచ్‌లు మాత్రం అమర్చకూడదు. ఈ ప్యాసింజర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అనుమతులు ఉన్నాయి. ఈ మర్గంలో ధరలను ఆయ సంస్థలు నిర్ణయించుకోవచ్చు. రైళ్ల నిర్వహణ, కొనుగోలుకు సంబంధించిన నిధులను ఆయా సంస్థలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతోన్న కరోనా వైరస్ ప్రభావం వాహన ప్రదర్శనపైనా పడింది. కొత్త వాహనాల ఆవిష్కరణలు, కంపెనీల హడావుడి, వీక్షకుల సందడి ఇంతకుముందుతో పోలిస్తే ఈసారి బాగా తగ్గిందనే మాట పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే స్టాళ్ల వద్ద ఈసారి జనం పలుచగానే కనిపిస్తున్నారు. పైగా కరోనా వైరస్ భయంతో దాదాపు ప్రతి ఒక్కరూ మాస్క్‌లతోనే కనిపిస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద వాహన ప్రదర్శనగా పేరు గాంచిన ఈ గ్రేటర్ నోయిడా వాహన ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
* జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాల పన్ను ఆదాయం 14 శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని భరిస్తూ కేంద్రం ఐదేళ్ల పాటు ఆ నష్టం చెల్లిస్తుంది. ఈ పరిహారం మొత్తం తగినంతగా ఉండడం లేదని రాష్ట్రాలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు మాసాలకు సంబంధించి గత ఏడాది డిసెంబరులో రూ.35,300 కోట్లు విడుదల చేసింది. మరో రూ.35 వేల కోట్ల నిధులను సంచిత నిధి నుంచి రెండు విడతల్లో కేంద్రం విడుదల చేయనుంది. తొలి విడత అక్టోబరు, నవంబరు మాసాలకు సంబంధించి ఉండనుంది. జీఎస్టీలో అత్యధికంగా వసూలయ్యే మొత్తాన్ని కేంద్రం గతంలో సంచిత నిధికి మళ్లించగా.. ప్రస్తుతం నష్టపరిహారం నిధిలో జమ చేస్తోంది. 2017 జులైలో జీఎస్టీ అమలు ప్రారంభమైననాటి నుంచి కేంద్ర జీఎస్టీ ఆదాయ నష్టపరిహారంగా రాష్ట్రాలకు రూ.2,11,000 కోట్లను చెల్లించింది.
* ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రేనాల్ట్ డస్టర్‌లో బీఎస్6 1.3 టర్బో పెట్రోల్ ఇంజిన్ డస్టర్‌ను ఆటో ఎక్స్‌పో2020లో ప్రదర్శించింది. డస్టర్ సరికొత్త వెర్షన్‌లో పలు మార్పులు చేసింది. కొత్త ఇంజిన్‌లో మొత్తం నాలుగు సిలిండర్లు ఉంటాయి. ఇది 153 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేయడంతోపాటు 250 ఎన్‌ఎం టార్క్‌ను కూడా విడుదల చేస్తుంది. దీనిలో సిక్స్‌స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌ను ఇవ్వగా.. సీవీటీ ఆటో ట్రాన్స్‌మిషన్‌ను ఆప్షన్‌గా అందజేశారు. 1.5 పెట్రోల్ ఇంజన్‌ను పక్కకు తప్పిస్తున్నట్లు రేనాల్ట్ వెల్లడించింది.
* నూతన కంపెనీలను, సంస్థలను భారత్‌లో ఏర్పాటు చేయాలనుకునే వారికి వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి కంపెనీలు నమోదు చేసుకునేందుకు సరికొత్త ఎలక్ట్రానిక్ ఫాంను అందుబాటులో తీసుకురానుంది. దీంతో పాటు ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐడీ రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెంటనే జారీ చేయనున్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎస్‌పీఐసీఇ+ పేరుతో పది సేవలను అందించనుంది. ప్రస్తుతం ఎస్‌పీఐసీఇ(సింప్లిఫైడ్ ప్రొఫార్మా ఫర్ ఇన్‌కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రికల్లీ) స్థానంలో కొత్త విధానం రానుంది. ‘సరికొత్త విధానం ద్వారా భారత దేశంలో వ్యాపారం చేయాలనుకునే వారికి అందుకు సంబంధించిన ప్రక్రియ మరింత సులభతరమై సమయం ఆదా అవుతుంది’ అని కార్పొరేట్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.