Sports

ముఖ్యమంత్రికి ద్రవిడ్ బౌలింగ్

Rahul Dravid Bowls To Tamilnadu CM Palanisamy

జాతీయ క్రికెట్‌ అకాడమీ అధ్యక్షుడు‌, మాజీ క్రికెటర్‌ రాహుల్ ద్రవిడ్‌ బంతులు విసిరితే తమిళనాడు సీఎం పళనిస్వామి బ్యాటింగ్‌ చేశారు. తమిళనాడులోని సాలెం నగరంలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించడానికి వచ్చిన వీరిద్దరు సరదాగా ఇలా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. బౌలర్ శైలిలో కాకుండా ద్రవిడ్‌ సరదాగా బంతులు విసరగా పళనిస్వామి బ్యాటింగ్‌ చేశారు. స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నె సూపర్‌ కింగ్స్‌ యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌, టీఎన్‌సీఏ అధ్యక్షుడు రూపా గురునాథ్ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ స్టేడియంలోని సదుపాయాలను కొనియాడాడు. ‘‘టీఎన్‌సీఏ, తమిళనాడు ప్రభుత్వం స్టేడియంలో సదుపాయాలను అద్భుతంగా ఏర్పాటు చేశాయి. వచ్చే తరంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లు చిన్న చిన్న పట్టణాల నుంచే వస్తారని గట్టిగా నమ్ముతున్నాను. వారికి ఇలాంటి సదుపాయాలున్న మైదానాలు ఎంతో ఉపయోగపడతాయి’’ అని పేర్కొన్నాడు. సాలెం నగరానికి చెందిన ఎడమచేతి వాటం పేసర్‌ టి.నటరాజన్‌ను కూడా ద్రవిడ్‌ కొనియాడాడు. అతడు తర్వాతి తరానికి ప్రేరణగా నిలుస్తాడని అన్నాడు. ఐపీఎల్‌లో నటరాజన్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. ధోనీ సారథ్యంలో చెన్నె జట్టు ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ ఆడటానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.