Editorials

అమెరికాలో సిక్కులపై దాడులు పునరావృతం

Telugu Editorials-Attacks On Sikhs In USA Is On High Rise

అమెరికాలో ఒకప్పటి నల్ల జాతీయుల కష్టాలు మళ్లీ ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాత్యహంకారానికి భారతీయులూ బలవుతున్నారు. లాటినోలు, ముస్లింలు, ఏసియన్లు ఇలా శ్వేత జాతి కాని వారందరిపై వివిధ రకాల దాడులు తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు వీరంతా ఏకతాటిపైకి వచ్చి వివక్షకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. పోరాటాలు చేస్తున్నారు. వీటిల్లో ఓ అమ్మాయి మాట చాలా బలంగా వినిపిస్తోంది. చాలా సూటిగా తగులుతోంది. ఆమె వలేరీ కౌర్‌. అమెరికా పౌర హక్కుల ఉద్యమానికి, జాతి వివక్ష వ్యతిరేక వేదికకు పదునైన ఆ గొంతుకను అమెరికానే కాదు ప్రపంచమూ జాగ్రత్తగా వింటోంది. వలేరీ కౌర్‌కు ఆమె తాతయ్య వలస కథ బాగా తెలుసు. అమెరికాకు చేరీ చేరగానే తీసుకెళ్లి జైల్లో కుక్కిన చేదు స్వాగతం రుచి అడుగడుగునా వివక్ష రూపంలో ఆమె నాలుకకు పంచబడింది. జైలు గదిలోని చీకటి నుంచి వెలుతురులోకి వచ్చి తమ తరం వరకు అస్తిత్వ పోరాటం, మనుగడ పోరాటం చేసిన తాతయ్య కథ ఆమెకు ఎంతో స్ఫూర్తి. ఆమె తల్లి తనను కన్న వ్యథ కూడా ఆమెకు స్ఫూర్తే. కడుపులోని చీకటి, జైలు గదిలోని చీకటి నుంచి ఎలా బయట పడి జీవన పోరాటం చేసి బతకగలిగామో అలా అమెరికాలోకి వచ్చిన ఈ చీకటి రోజుల నుంచి కూడా అలానే పోరాడి జీవిద్దామని తమ కార్యకర్తలకు ఆమె చెబుతోంది. ‘బ్రీత్‌ అండ్‌ పుష్‌’ ‘బ్రీత్‌ అండ్‌ పుష్‌’ కాన్పు సమయంలో అమ్మ చిట్కా ఇది. అమెరికా నుంచి కూడా జాత్యంహకారాన్ని పారద్రోలేందుకు ఎంచుకున్న ఎత్తుగడ కూడా ఇదే. బ్రీత్‌…. శ్వాసిస్తూ సహిద్దాం. పుష్‌…. బలాన్ని కూడదీసుకుని తోసేద్దాం. ఏమంటారంటూ చేసిన ఆమె ఓ ప్రసంగం అమెరికా హక్కుల ఉద్యమాన్ని కదిలించివేసింది. ఉద్వేగాలతో కొట్టుకుంటున్న గుండె చప్పుళ్లు చప్పట్లతో కలసి వినిపించాయి. 9/11 దాడుల ప్రభావం అక్కడుండే సిక్కులపై కూడా పడింది. ముస్లింలతో పాటు తీవ్ర పరిణామాలని ఎదుర్కోబోతున్నారనే భయం మొదలైంది. బల్బీర్‌ సింగ్‌ సోధి అరిజోనాలోని మెసా ప్రాంతంలో ఒక గ్యాస్‌ స్టేషన్‌ వద్ద అమెరికన్ల కాల్పులకి బలైన తొలి సిక్కు మతస్తుడు. జాత్యోన్మాదంతో సిక్కులని వెంబడించి కొట్టేవారు. ఈ మధ్య అమెరికాలో మారిన రాజకీయ వాతావరణంతో జాతి అహంకార దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఆ నిజాలని ప్రపంచానికి తెలిపేందుకు కృషిచేస్తున్నారు సామాజిక హక్కుల కార్యకర్త వలేరి కౌర్‌. వలేరి మూలాలు భారత్‌వే అయినా పుట్టి పెరిగింది కాలిఫోర్నియాలో. భారతీయ పంజాబీ రైతు కుటుంబానికి చెందిన కౌర్‌ కుటుంబం శతాబ్దం క్రితం అమెరికాలో స్థిరపడింది. ఆమె తాతయ్య అమెరికాకు వలస వెళితే అప్పట్లోనే అనుమానించి అరెస్ట్‌ చేశారు. ఆయన్ను విడిపించి అమెరికాలో బతికే అవకాశం కల్పించిందీ ఓ శ్వేత జాతీయుడే. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. చిన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎన్నో జాగ్రత్తలు చెప్పి బడికి పంపించేవారు. పైచదువులపుడు అమెరికాలో సిక్కుల స్థితిగతులు ఆమెకు అవగతంలోకి వచ్చాయి. మతం-అంతర్జాతీయ సంబంధాలపై స్టాండ్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివింది. హార్వర్డ్‌ డివినిటి స్కూల్లో లాజికల్‌ స్టడీస్‌, యేల్‌ న్యాయ విద్యాలయంలో పట్టా పొందింది. అప్పటి నుంచి సిక్కులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. పదిహేనేళ్లుగా పౌర హక్కుల కార్యకర్తగా పనిచేస్తూ జాతీయ స్థాయి ప్రదర్శనలు, ప్రచారాలని నిర్వహిస్తోంది. దీనికి కారణం జాతి అహంకార దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బల్బీర్‌ సింగ్‌ మరణం. ఆయన వలేరీకి దూరపు బంధువు కూడా. బల్బీర్‌ మరణం తర్వాత అలాంటి ఘటనలు అడుగడుగునా చోటుచేసుకుంటూనే వున్నాయి. 9/11 దాడులకి సిక్కులకి ఏ మాత్రం సంబంధం లేదనే విషయాలు వెలుగులోకి రాకపోవడమే సిక్కులపై దాడులు పునరావృతమవడానికి కారణమంటారు వలేరీ. దర్శకుడు శరత్‌ రాజుతో కలిసి అమెరికాలోని దాదాపు 200 నగరాలలో ‘డివైడ్‌ వీ ఫాల్‌’ క్యాంపెయిన్‌ని నిర్వహించి సిక్కుల వాస్తవిక స్థితిగతులని తెలుసుకున్నారు. ఆ యదార్థ గాథల ఆధారంగా 2008లో ఆమె నిర్మించిన ‘డివైడ్‌ వీ ఫాల్‌’ చిత్రానికి వివిధ విభాగాల్లో పన్నెండుకి పైగా జాతీయస్థాయి అవార్డులు దక్కాయి. వివక్షని ప్రశ్నిస్తూ ఆ సినిమా కోసం తను రాసిన కొన్ని డైలాగులు 2008, 2016 ఎన్నికల క్యాంపెయిన్‌లలో వినిపించేవి. ఆ తర్వాత రాజుతో కలిసి సామాజిక న్యాయ సమస్యలపై వందకుపైగా డాక్యుమెంటరీలని నిర్మించింది వలేరీ. ఏలినేషన్‌ (2011), స్టిగ్మా (2011) లఘుచిత్రాలు, ఓక్‌ క్రీక్‌ ఇన్‌ మెమోయిర్‌(2012) విస్కాన్సిన్‌ ప్రాంతంలో సిక్కుల మందిరంలో చోటుచేసుకున్న కాల్పులపై రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ చిత్రాలు అక్కడి ప్రభుత్వ విధానాల్లో మార్పుతోపాటు దేశవ్యాప్తంగా సిక్కుల సామాజిక స్థితిగతుల్లో మార్పులకు దోహదపడ్డాయి. 2013లో అమెరికాలోని 13 మంది ప్రగతిశీల నాయకుల్లో ఒకరిగా ‘ది సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌’ వేదిక ద్వారా ఆమె గుర్తించబడింది. అమెరికన్‌ కరేజ్‌ అవార్డుతోపాటు ‘ఏషియన్‌ అమెరికన్‌ వుమెన్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌’ అవార్డుని అందుకున్నారు. తనతో కలిసి పనిచేసిన శరత్‌ రాజుని వివాహం చేసుకుని జంటగా ఉద్యమంలో కలసి అడుగులు వేస్తున్నారు.