దేశ రాజధాని హస్తినలో ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేజ్రీవాల్.. మూడో సారి కూడా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆప్ దూసుకెళ్లింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆప్ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 కాగా, ఆప్ 60 స్థానాలకు పైగా విజయం సాధించింది. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 67 స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 2015 ఫలితాలే పునరావృతమయ్యాయి. ఇక ఈ గెలుపులో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర పోషించారు. ఆప్ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తానికి కిషోర్ వ్యూహలు ఆప్ గెలుపుకు కీలకంగా పని చేశాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ 13,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పట్‌పడ్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా విజయం సాధించారు. ఆప్ గెలుపుతో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుంటూ ఆప్ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు. కేజ్రీవాల్ చేసిన అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ అహర్నిశలు కష్టపడ్డారని.. దానికనుగుణంగా ఫలితం దక్కిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ గెలుపు తమకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్న ఆప్ నాయకులు.. ఢిల్లీని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
2. దిల్లీలో కాంగ్రెస్‌కు రిక్త హస్తం
ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్లుగానే దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. తొలుత ఎగ్జిట్‌పోల్స్‌పై విరుచుకుపడిన ఆ పార్టీ ఇప్పుడు ఫలితాలను చూసి మౌనంగా ఉండిపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వికాస్‌పూరి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ శర్మ తన ఓటమిని అంగీకరించడం విశేషం. 2015 ఎన్నికల ఫలితాలే ఇప్పుడు కూడా పునరావృతమవుతున్నాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అయితే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో భాజాపా పుంజుకోగా కాంగ్రెస్ మాత్రం అదే స్థితిలో కొనసాగుతోంది. 15 సంవత్సరాలు ఏకధాటిగా రాష్ట్రాన్ని పాలించిన షీలాదీక్షిత్ వంటి నాయకులు ఇప్పుడు స్థానికంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. 2013లో దాదాపు 24శాతం ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ 2015 వచ్చేసరికి దాదాపు 10శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే మాత్రం ఈ సారి మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది.
3. ఢిల్లీ విజయాన్ని మూడు ముక్కల్లో తేల్చేసిన బిహార్ సీఎం
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని మూడోసారి అధిరోహించబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ‘జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)’ అంటూ ఆయన మూడు ముక్కల్లో కేజ్రీవాల్ విజయంపై తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో నితీశ్ సారథ్యంలోని జేడీయూ పొత్తు నేపథ్యంలో ఢిల్లీలో రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ పోటీ చేసింది. అమిత్ షాతో కలసి నితీశ్ మూడు స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నితీశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కేవలం ఉచితంగా ఇచ్చే వాటిపైనే మాట్లాడుతున్నారని.. వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
4. కేజ్రీవాల్‌కు సీఎం జగన్ అభినందనలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తమైంది. ఈ సందర్బంగా ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌కి, ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కేజ్రీవాల్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఢిల్లీలో ఆప్ ఘన విజయం–TNI కథనాలు
Related tags :