న్యూఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్లో మంగళవారం నాడు అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆ స్కూల్ విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో కష్టపడి చదివేవారికి మంచి భవిష్యతు ఉందని, తాము కోరుకున్న, కలలు కన్న ఉద్యోగాలను చేపట్టవచ్చని డా.హనిమిరెడ్డి సూచించారు. తన జీవితమే ఇందుకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. తాను చిన్నతనంలో పశువులు కాశానని కష్టపడి చదువుకున్నానని, ఈనాడు ప్రముఖ కార్డియాలజిస్ట్ గా పేరు ప్రఖ్యాతులు గడించానని, తాను సంపాదించిన దాంట్లో రూ.80 కోట్ల రూపాయల వరకు వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళాలుగా అందజేశానని డా.హనిమిరెడ్డి పేర్కొన్నారు. తెలుగువారు చాలా తెలివైన వారని, ప్రపంచం నలుమూలల పలు కీలక స్థానాల్లో వారు పదవులు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని హనిమిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రా స్కూల్ జనరల్ సెక్రటరీ డా.సుంకర ఈశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో డా.హనిమిరెడ్డిని స్కూల్ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటి పాలకవర్గ సభ్యులు వాసిరెడ్డి చటర్జీ, సి.భీమన్న, వీవీ.రావు, ఎస్.వినయ్ కుమార్, ఎస్.కే.వలిషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీ ఆంధ్రా స్కూల్లో డా.హనిమిరెడ్డికి సత్కారం
Related tags :