పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పనులన్నీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇతర ఖర్చులను పక్కనపెట్టి గ్రామాలకు నిధులు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. కలెక్టర్లకు సహాయకంగా ఉండేందుకే అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని.. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించినట్లు వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని.. జిల్లా స్థాయిలో వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాలు, పరిశుభ్రతతో వెల్లివిరియడం అత్యంత ప్రాధాన్యమని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కలెక్టర్లకు అండగా ప్రభుత్వం అదనపు కలెక్టర్లను నియమించిందని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరించేవారని.. ప్రస్తుతం ఆ కమిటీలను 26 విభాగాలుగా విభజించడం ద్వారా పనిఒత్తిడి తగ్గుతుందని కేసీఆర్ వారికి వివరించారు.
శాశ్వతంగా పల్లెప్రగతి ఉండాలి
Related tags :