DailyDose

లండన్‌లో ఓలా సేవలు ప్రారంభం-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Ola Begins Services In London

* భారతీయ క్యాబ్‌ సర్వీసుల కంపెనీ ఓలా లండన్‌లో తన సేవలను మొదలుపెట్టింది. సోమవారం నుంచి లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ 25వేల మంది డ్రైవర్లు ఓలా ప్లాట్‌ఫాంపై పనిచేసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇక వీరికి ఇప్పటికే హై లెవల్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చామని ఓలా కంపెనీ తెలిపింది. దీంతో ప్రయాణికులు సులభంగా ఓలా క్యాబ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆ కంపెనీ తెలియజేసింది. కాగా క్యాబ్‌ సేవల ప్రారంభం సందర్భంగా లండన్‌లోని కస్టమర్లు మొదటి వారం రోజుల పాటు 25 గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల (దాదాపుగా రూ.2300) విలువైన వోచర్లను పొందవచ్చని ఓలా తెలిపింది. అలాగే మొదటి 6 వారాల పాటు తమ డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్‌ను తీసుకోబోమని ఓలా తెలిపింది. కాగా ఇప్పటికే యూకేలోని బర్మింగ్‌హామ్‌, లివర్‌పూర్‌, రీడింగ్‌ సిటీలలో ఓలా క్యాబ్‌ సేవలను గత 7 నెలల కాలంలో ప్రారంభించగా ఇప్పుడు ఆ జాబితాలోకి లండన్‌ వచ్చి చేరడం విశేషం.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కరోనా ప్రభావంతో వరుసగా రెండు రోజులు నష్టాలను చవిచూసిన మార్కెట్లు నేడు ఆ భయం నుంచి కాస్త తేరుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 236 పాయింట్లు లాభపడి.. 41,216 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 12,110 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.30 వద్ద కొనసాగుతోంది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా మరణాలు పెరుగుతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో పయనించగా.. యస్‌ బ్యాంకు, నెస్ట్‌లే, భారత్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.
* చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ 8ఎ డ్యుయల్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో.. 6.22 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌, డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌ స్లాట్స్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌, యూఎస్‌బీ టైప్‌ సి.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్‌ కేర్‌ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాంటి వారి మాటలు నమ్మవద్దని, వారికి వినియోగదారులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం ఇవ్వవద్దని స్విగ్గీ హెచ్చరించింది
*చైనాలోని సగం ప్రావిన్స్ దేశాలు పరిశ్రమల మూతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా ప్రభావమున్న ప్రాంతాల నుంచి కార్మికులు వెనక్కి తిరిగి రాకుండా ఉండేందుకు కొత్త ఏడాది సెలవులను ఫిబ్రవరి 17 వరకు పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. చైనాలోని కొన్ని అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీలు వచ్చే రెండు వారాలకు కానీ తయారీని తిరిగి మొదలుపెట్టే యోచనలో లేవు. మరికొన్ని ఎప్పటి నుంచి తయారీ ప్రారంభించాలో ఇంకా తేల్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17 తేదీని కూడా పొడిగించకుండా ఉంటారన్న హామీ ఏమీ కనిపించడం లేదు. కంపెనీలు ఇలా మూతపడి ఉన్నంతకాలం అనిశ్చితి పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.
*ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.575 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంత క్రితం ఆర్థిక సంత్సరం ఇదే సమయంలో బ్యాంకు రూ.153 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ‘సమీక్షా త్రైమాసికంలో ఎస్సార్ స్టీల్, రుచి సోయా, ప్రయాగ్రాజ్ పవర్ జనరేషన్ సంస్థల నుంచి రూ.2,000 కోట్ల రికవరీ రావడంతో లాభం బాగా పెరిగింద’ని బ్యాంకు ఎండీ, సీఈఓ రాజ్కిరణ్ రాయ్ వెల్లడించారు. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 15.66 శాతం నుంచి 14.86 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 8.27 శాతం నుంచి 6.99 శాతానికి పరిమితమయ్యాయి.
*గ్రీస్లో విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సోమవారం ఇక్కడ వెల్లడించింది. గ్రీస్లోని క్రెటే ప్రాంతంలో నూతన హెరక్లియాన్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టును గ్రీస్ సంస్థ అయిన జీఈకే తెర్నాతో కలిసి జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని నిర్మించటంతో పాటు 35 ఏళ్ల పాటు నిర్వహణ హక్కులు కూడా జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు ఉన్నాయి.
*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎమ్ఈలు) ప్రయోజనం కల్గుతుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సిహెచ్.ఎస్.ఎస్.మల్లికార్జునరావు అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా చేరనున్న నిధులతో ఎంఎస్ఎమ్ఈలకు రుణ లభ్యత మెరుగువుతుందని అన్నారు.
*జనవరిలోనూ దేశీయ ప్యాసింజర్ అమ్మకాలు 6.2 శాతం తగ్గాయని వాహన పరిశ్రమ సంఘం సియామ్ తెలిపింది. వృద్ధి రేటు నెమ్మదించడం, ధరల పెంపు ప్రభావంతో వాహనాల గిరాకీలో స్తబ్దత కొనసాగిందని సియామ్ ప్రెసిడెంటు రాజన్ వధేరా అన్నారు. బీఎస్-4 నుంచి బీఎస్-6 ఉద్గార నిబంధనలకు మారాల్సి ఉండటం, ముడి సరుకు వ్యయాలు పెరగడంతో కంపెనీలు వాహన ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే మౌలికం, గ్రామీణ ప్రాంతాలకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనలు మున్ముందు గిరాకీ పుంజుకునేందుకు తోడ్పడుతాయని వధేరా చెప్పారు.
*ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైహోమ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లోని కోకాపేటలో అతిపెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది. ఇందులో 5.82 ఎకరాల స్థలంలో 4 బ్లాకులుగా… ఒక్కో బ్లాకులో 32 అంతస్తులతో 660 అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. ఒక్కో అపార్ట్మెంట్ 1957 లేదా 2235 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కాంప్లెక్స్లోనే జిమ్, సూపర్ మార్కెట్, గెస్ట్ రూములు, క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నట్లు మైహోమ్ కన్స్ట్రక్షన్స్ వివరించింది.
*హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ‘డియో’ 110 సీసీ స్కూటర్ను బీఎస్-6 ఇంజిన్తో అందుబాటులోకి తెచ్చింది. సోమవారం దీనిని విపణిలోకి విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. స్టాండర్డ్ ధర రూ.59,990 కాగా.. డీలక్స్ ధర రూ.63,340 (దిల్లీ, ఎక్స్షోరూం). ‘దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్కూటర్లలో డియో ఒకటి. ఎక్కువగా ఎగుమతి అయ్యే వాటిల్లోనూ ఇది ఉంది. ఇప్పుడు బీఎస్-6 ఇంజిన్, సరికొత్త సాంకేతికత, స్పోర్టీ డిజైన్తో కొత్త డియోని తీసుకొచ్చాం. ఇది కూడా యువతకు అమితంగా నచ్చుతుందని, వినూత్న అనుభూతిని పంచుతుందని అనుకుంటున్నామ’ని హెచ్ఎమ్ఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (విక్రయాలు, మార్కెటింగ్) యద్విందర్సింగ్ గులేరియా ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్కు ఇప్పటికే బుకింగ్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.