Kids

మీ ఏడేళ్ల బాబు సరైన బరువు ఉన్నాడా?

Telugu Kids News-Is Your 7 Year Old Under Weight

సాధారణంగా ఏడేళ్ల వయసులో అబ్బాయిలు 13 నుంచి 15 కిలోల వరకు బరువుండాలి. వయసుకు తగిన ఎత్తు, బరువు ఉన్నాడో లేదో ముందుగా పరీక్షించండి. ఒకవేళ బాబు వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేనప్పుడు తనకు పెట్టాల్సిన ఆహారం గురించి జాగ్రత్త పడాలి. తన ఎదుగుదలకు అవరోధంగా ఉన్న కారణాలను అన్వేషించాలి. నిజానికి సరైన ఆహార అలవాట్లకు పునాదులు పడేది పసివయసులోనే. కాబట్టి తల్లిదండ్రులు ఓపికగా వాళ్లకు ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించడం, మంచి అలవాట్లు నేర్పించడంపై దృష్టి పెట్టాలి. చిన్నారి ఎందుకు తినడం లేదు. తనకు ఏం నచ్చట్లేదు? అనే విషయాలు తెలుసుకోవాలి. ఇవి గమనించండి… ఏం తిని కడుపు నింపేసుకుంటున్నాడు అనే విషయాన్ని పరిశీలించాలి. స్నాక్స్‌లో ఏం పెడుతున్నారో సమీక్షించుకోండి. కొందరు చిన్నారుల్లో సహజంగానే ఆకలి మీద దృష్టి ఉండకపోవచ్చు. చిప్స్‌, చాక్లెట్లు, స్వీట్లు లాంటివి… చూడటానికి పరిమాణంలో కొంచెంగానే అనిపించినా వీటినుంచి లభించే కెలొరీలు అధికమే. మీ బాబు వీటిని తినడం వల్లే కడుపు నిండిపోయి ఇతర ఆహార పదార్థాల వైపు చూడటం లేదనిపిస్తోంది. అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు ముందు ఎలాంటి చిరుతిళ్లు పెట్టొద్దు. ఆహారం ఇష్టం లేదని మారాం చేసినప్పుడు దానికి బదులుగా పాలు, బిస్కెట్లు లాంటివి పెడుతుంటాం. ఇది సరైన పద్ధతి కాదు. వారికి ఆకలి అనే భావన కలిగించాలి. ‘తినకపోతే ఆకలి వేస్తుంది’ అనేది వారికి తెలిసేలా చేయాలి. ఇష్టమైనవే ఇవ్వండి… మనం పెట్టే కూరగాయలు, మాంసం లాంటివి వారికి కారంగా అనిపించొచ్చు. దానికి కారణం వాటిని చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోవడమే. మనం తీసుకున్నంత ఆహారాన్ని చిన్నారులూ తింటారనేది సరికాదు. ఉదాహరణకు పదిహేను కిలోల బరువున్న చిన్నారికి 30-40 గ్రాముల మాంసాహారం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కూరగాయల్లో చిన్నారికి నచ్చినవాటినే వండిపెట్టండి. అతడికి ఏవి బాగా నచ్చుతాయో వాటినే పెట్టండి. పెట్టినవన్నీ తినాలని బలవంతం చేయకూడదు. ఇలా చేస్తే వాటిపై మరింత అయిష్టం పెరుగుతుంది. ఆహారాన్ని తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఇవ్వాలి. రకరకాల కొత్త పదార్థాలను పరిచయం చేయాలి.