Food

కిడ్నీ రాళ్లు పోవాలంటే ఈ పీచు తీసుకోండి

Foods that expel kidney stones-Telugu food and diet news

మూత్రం ద్వారా మన శరీరంలోని మలినాలు ద్రవరూపంలో బయటికి పోతుంటాయి. మూత్రం సక్రమంగా తయారై, ఎప్పటికప్పుడు బయటికి పోతేనే, మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాకాకుండా కొందరిలో కొన్నిరకాల పదార్థాలు మూత్రపిండాల్లోనే గట్టిగా, చిన్న రేణువుల్లా పేరుకుంటాయి. శరీరం తీరు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటివి దీనికి కారణమవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు బయటికి పోయేలా చూసుకోవడమే కాదు, కొత్తవి తయారుకాకుండా జాగ్రత్తపడాలి. శారీరక శ్రమ ఉండాలి. అలాగే వ్యాయామం, రోజూ కొంతసేపు నడవడం చాలా ముఖ్యం. పవన ముక్తాసనం, భుజంగాసనం, ధనురాసనం, హలాసనం పద్ధతిగా నేర్చుకుని నిత్యం వేయడం అలవరచుకోవాలి. రోజూ రెండు పూటలా రెండు లేదా మూడు చెంచాల తులసి రసానికి తేనె కలిపి తీసుకుంటే మూత్రం ద్వారా రాళ్లు బయటికి పోతాయి. గంటకొకసారి గ్లాసు నీళ్లు తాగడం అలవరచుకోవాలి. కొబ్బరినీళ్లు, పలుచని మజ్జిగ నిత్యం తీసుకోవాలి. తాజాపండ్లు, కాయగూరలను రోజూవారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే కాఫీ, టీ, శీతలపానీయాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీం, పాలకూర, బాదం, వేరుసెనగ, టమాటా, నిమ్మజాతిపండ్లు, మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచును 40 గ్రా. తీసుకుని దాన్ని అరలీటరు నీళ్లలో అయిదుగంటలపాటు నానబెట్టాలి. తర్వాత పీచును వడకట్టి ఆ నీటిని తాగాలి. ఇలా నిత్యం చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. పల్లేరు కాయల రసం లేదా కషాయం నిత్యం తీసుకుంటుంటే మూత్రం ద్వారా రాళ్లు బయటికి పోతాయి.