ఎండలో ఎక్కువగా తిరగడం, కాలుష్యం, వయసు పైబడటం… ఇలా అనేక కారణాలతో ముఖం మీద నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. మార్కెట్లో దొరికే క్రీంలను వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే ఇంట్లో అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించి మచ్చలను ఎలా మాయం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
పచ్చికొబ్బరిని మెత్తగా మిక్సీపట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఉదయం, సాయంత్రం కొన్ని రోజులపాటు ఇలా చేయడం వల్ల ముఖం మీది మచ్చలు క్రమంగా తగ్గుతాయి. కొబ్బరి బదులుగా కొబ్బరిపాలను కూడా ఉపయోగించవచ్చు.
బంగాళాదుంపను మెత్తగా మిక్సీపట్టి దాంట్లో కొంచెం గులాబీనీరు కలిపి మిశ్రమాన్ని తయారుచేయాలి. మీది జిడ్డు చర్మం అయితే కాస్త నిమ్మరసం, పొడిచర్మం అయితే కొద్దిగా తేనె కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.
బొప్పాయిని మెత్తని పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. లేదా బొప్పాయి రసాన్ని రాసుకున్నా ఫలితం ఉంటుంది. విటమిన్లు అధికంగా ఉండే ఈ పండు మచ్చలను మాయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖానికి కాస్త ఆవనూనె పట్టించి సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది. లేదా ఆవనూనెలో కొద్దిగా సెనగపిండి, పెరుగు, కొంచెం నిమ్మరసం వేసి కలిపి ముఖమంతా రాయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి.
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ సహజసిద్ధమైన బ్లీచ్‌గానూ ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో కాస్త తేనెను కలపి నల్లమచ్చల మీద రాసి ఆరిన తర్వాత కడుక్కోవాలి.