DailyDose

నేటి పది ప్రధాన వార్తలు

Today's Top 10 Breaking News-Telugu News Roundup

* ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ప్రైవేట్‌ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

* గోదావరి నదిపై నిర్మితమవుతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసీ వనదేవత ‘సమ్మక్క’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

* విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీ కార్యాలయాలకు స్థలం సరిపోకపోతే ఇక్కడే వేరే కార్యాలయంలోకి వెళ్లాలి కాని.. మరో జిల్లాకు ఎందుకు తరలించాల్సి వచ్చిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయంలో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి. కావాల్సిన విస్తీర్ణం ఎంత? అందులోని సిబ్బంది, వారి జీతభత్యాల వివరాలను ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారితో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. 

* కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా గత అయిదేళ్ల వ్యవధిలో రూ. 2,72,928 కోట్లను తెలంగాణ చెల్లించగా.. అందులో రూ.1,12,854 కోట్లను మాత్రమే రాష్ట్ర వాటాగా కేంద్రం తిరిగి ఇచ్చిందని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణకు అధిక నిధులు ఇచ్చామని పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం బాధ కలిగించిందని బుధవారం ట్విటర్‌లో ఆయన వెల్లడించారు. 

* పొట్ట చేతపట్టుకుని 40 ఏళ్ల కిందట ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన నేతన్నలు దశాబ్దాల తర్వాత సొంతూళ్లకు తరలివస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మడికొండలో నిర్మాణంలో ఉన్న కాకతీయ టెక్స్‌టైల్‌ అండ్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ పరపతి సంఘం ఒకటి, రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వం ప్రోత్సాహంగా అందించే రాయితీలను అందిపుచ్చుకొని సంఘంగా ఏర్పడి…దేశంలోనే తొలి పవర్‌ లూమ్‌ టెక్స్‌టైల్‌ క్లస్టర్‌గా ఇది గుర్తింపు పొందనుంది.

* జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూళ్ల కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌లను ఉచితంగా పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈనెల 15 నుంచి 29 వరకు వీటిని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు చెందిన టోల్‌ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్‌ పంపుల వద్ద ఉచితంగానే వాహనదారులు పొందవచ్చని తెలిపింది. 

* సివిల్‌ సర్వీసెస్‌-2020కు సంబంధించి ప్రాథమిక పరీక్ష మే నెల 31వ తేదీన జరగనుంది. ఈ మేరకు యూపీఎస్‌సీ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 796 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2019లో 896 పోస్టులు ఉండగా.. ఈ దఫా ఆ సంఖ్య 100 మేరకు తగ్గడం గమనార్హం.

* దేశంలో ఎక్కడ ఉంటున్నా తన స్వస్థలంలో ఓటు వేసేందుకు ఓటరుకు వెసులుబాటు కల్పించేలా సాంకేతికతను సమకూర్చుకునేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐఐటీ మద్రాస్‌ సహకారంతో బ్లాక్‌ చైన్‌ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సభ్యులు కృషి చేస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి చెన్నైలో ఉంటున్నా, రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడు తన ఓటు వేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు. 

* దేశంలో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మరి ప్రధాని భద్రత కోసం రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? అక్షరాలా రూ. 1.62కోట్లు. దేశంలో ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పిస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ లోక్‌సభలో ప్రశ్నించారు. ఇందుకు కిషన్‌రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.