Business

ఢిల్లీ డాక్టర్లు 2200 మందికి కోటికి పైగా ఆదాయం

Income Tax Releases Delhi Doctors List Who Make More Than 1Cr

రూ.కోటి కంటే అధిక ఆదాయం పొందుతున్న డాక్టర్లు, సీఏల సంఖ్యను ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. ఈ సంఖ్య కేవలం 2,200 మాత్రమేనని పేర్కొంది. ఆదాయపన్ను చెల్లింపులకు సంబంధించిన చాలా కీలక విషయాలను ఆ శాఖ ట్వీట్ల రూపంలో వెల్లడించింది. 2018-19 ఆదాయపన్ను వివరాలను కూడా ప్రకటించింది. ‘‘ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్‌ను ఫైల్‌ చేసిన వ్యక్తుల్లో కేవలం 2,200 మంది డాక్టర్లు, లాయర్లు, సీఏలు వంటి వృత్తి నిపుణుల ఆదాయం మాత్రమే రూ.కోటి దాటింది. ఇది కేవలం వారి ప్రధాన ఆదాయం మాత్రమే.. ఇతర మార్గాల నుంచి ఆదాయాన్ని దీనిలో కలపలేదు’’ అని తెలిపింది. ప్రజలు దేశాభివృద్ధి కోసం పన్నులు చెల్లించాలని బుధవారం ప్రధాన మంత్రి కోరిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో పన్నులు ఎగ్గొట్టడంతో నిజాయతీగా పన్ను చెల్లంచే వారిపైనే అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లించే వారి సంఖ్యను ట్విటర్‌లో వెల్లడించింది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.78 కోట్ల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్‌ చేశారు.  వీరిలో 1.03 కోట్ల మంది వ్యక్తిగత ఆదాయం రూ.2.5లక్షలు కాగా, 3.29 కోట్ల మంది ఆదాయం రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలు చూపారు. వీరిలో రూ.5లక్షల లోపు ఆదాయం చూపిన 4.32 కోట్ల మందికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక 1.46 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంది. వీరిలో కోటి మంది ఆదాయం రూ.10 లక్షల లోపు,  46 లక్షల మంది ఆదాయం రూ.10 లక్షలకు పైగా..ఉంది. 3.16 లక్షల మంది మాత్రమే రూ.50లక్షల పైన ఆదాయం పొందుతున్నారు. వీరిలో 8,600 మంది 5కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. వీరిలో 2,200 మంది డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏలు వంటి వృత్తి నిపుణులు ఉన్నారు’’ అని  వరుస ట్వీట్లలో పేర్కొంది