Movies

కట్టిపడేసే అందం…దీక్షా సేథ్

The movie records of Deeksha Seth-Telugu Movie News

చిత్రసీమలో రాణించాలంటే అందం… ప్రతిభే కాదు, కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కొంతమంది ప్రయాణాన్ని పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. దీక్షాసేథ్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమకి తగ్గ కథానాయిక. ఆమె అందం ఇట్టే ఆకర్షిస్తుంది. కమర్షియల్‌ కొలతలకి తగ్గట్టే ఉంటుంది. కావల్సినంత ప్రతిభ కూడా ఉందని ఆమె చేసిన పాత్రలు చాటి చెప్పాయి. ఒకట్రెండు విజయాలు కూడా లభించాయి కానీ… ఆమె నిలదొక్కుకోలేకపోయింది. ‘రెబల్‌’ తరువాత ఆమె తెలుగు చిత్రసీమవైపు తిరిగి చూడలేదు. ‘వేదం’తో తెలుగు తెరకు పరిచయమైన దీక్ష ఫెమీనా మిస్‌ ఇండియా ఫైనలిస్టుల్లో ఒకరు. గ్లామర్‌ రంగంతో ఉన్న ఆ అనుబంధమే ఆమె సినిమాల్లోకి రావడానికి కారణమైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకోవడంతో వెంటనే ఆమెని అవకాశాలు వరించాయి. ‘మిరపకాయ్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న దీక్షా… ‘వాంటెడ్‌’, ‘నిప్పు’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’, ‘రెబల్‌’… ఇలా వరుసగా పరాజయాల్ని మూటగట్టుకొంది. ఇక ఆ దెబ్బతో ఆమెకి కొత్తగా అవకాశాలే రాలేదు. మరోపక్క తమిళం, కన్నడలోనూ అవకాశాలు లభించినా అక్కడ కూడా పరాజయాలే. హిందీలోనూ ‘లేకర్‌ హమ్‌ దీవానా దిల్‌’, ‘సాద్‌ కదమ్‌’ అనే చిత్రాలు చేసింది కానీ.. ఫలితం మాత్రం లభించలేదు. దాంతో ఆమె 2016 నుంచి సినిమా రంగానికి దూరమైంది. దీక్షాసేత్‌ 14 ఫిబ్రవరి 1990న దిల్లీలో జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగం వల్ల ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, ఖాట్మండు, నేపాల్‌ తదితర ప్రాంతాల్లో దీక్షా బాల్యం సాగింది. కాలేజీలో ఉన్నప్పుడే ఫెమీనా మిస్‌ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొని గ్లామర్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ గెలుచుకొంది. మోడలింగ్‌ అసైన్‌మెంట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆమెని దర్శకుడు క్రిష్‌ చూసి ‘వేదం’లో నటించే అవకాశాన్నిచ్చారు. ఆరంభంలో అవకాశాలు వచ్చినా అదృష్టం తోడు కాకపోవడంతో వెనుదిరిగింది. ఈ రోజు దీక్షాసేథ్‌ పుట్టినరోజు.