1. గోదావరి జలాల్ని 100% వాడాలి
గోదావరి జలాలను నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని.. మొత్తం 530 టీఎంసీలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వచ్చే వర్షాకాలంలో వరద నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతుందని.. వృథా కాకుండా ఎప్పటికప్పుడు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ నుంచి తోడుకోవాలని, ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు.
2. సీఎం పదవి.. హాజరుకు అడ్డు కాదు
అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం పదవి పొందినంత మాత్రాన… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం సరికాదని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ముఖ్యమంత్రి పదవి పేరుతో శాశ్వతంగా హాజరు నుంచి మినహాయింపు పొందాలని చూస్తున్నారని, ఒకవేళ మినహాయింపునిస్తే రాజకీయ, ధన, బల ప్రయోగాలతో సాక్షులను ప్రభావితం చేసి, విచారణ ప్రక్రియను బలహీనపరచగలరని పేర్కొంది.
3. ఇల్లు..గుల్ల
ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ఇలా ప్రకటించారో లేదో.. అమరావతి చుట్టుపక్కల కలల సౌధాలు కుప్పకూలాయి. రాజధానే ఇక్కడ లేనప్పుడు కొనడం ఎందుకని ఆగిపోయారు. ధరలు తగ్గించినా కొనేవాళ్లు లేరు. అడ్వాన్సులు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టిన బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
4. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యానికే సవరణలు
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే వైకాపా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మధురవాడ విమానాశ్రయంలో గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
5. 15 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ
ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి కడపతోపాటు మరో 3 జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయబోతున్నారు. మలివిడతలో మిగిలిన జిల్లాల్లో పంపిణీ చేపట్టి మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్లాస్టిక్ కార్డులు ఇస్తున్నందున వాటిలోని అక్షరాలు చెదిరిపోవు. కార్డు చిరిగిపోదు.
6. ప్రేమికుల రోజుకు యువత సన్నాహాలు
ప్రేమికుల రోజు.. ప్రపంచవ్యాప్తంగా రూ.లక్షల కోట్ల వ్యాపారం నడిచే రోజిది. యువతీ, యువకులకు వినూత్న బహుమతులు, పర్యటన ఏర్పాట్లు, విందు-వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కంపెనీలు, ఆన్‌లైన్ గిఫ్టింగ్ – ఇకామర్స్ పోర్టళ్లు, పర్యాటక సేవలు అందించే సంస్థలు పోటీపడుతున్నాయి. ఇతర పండుగల కంటే ప్రేమికులరోజు సందర్భంగా ఇచ్చే బహుమతుల ‘సగటుమొత్తం’ అధికంగా ఉంటోందని యూఎస్‌టు గుంటూర్ పోర్టల్ ఎండీ శ్రీధర్ తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. అచ్చం మన భాషలో మాట్లాడినట్టే!
పరభాషా వీడియోలను వీక్షకుడి మాతృభాషలోకి అనువదించే సరికొత్త సాంకేతికతను హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ పరిశోధక బృందం అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఇతర భాషల్లోని వీడియోల అనువాదం సబ్ టైటిల్స్ రూపంలోనే ఉంటోంది. లేదంటే డబ్బింగ్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు వీడియోలోని వ్యక్తుల పెదాలు కదిలే తీరు అనువాద భాష ఆడియోతో సరిపోలదు. ఈ సమస్యని అధిగమిస్తూ ఇతర భాషల వీడియోలోని వ్యక్తులు.. వీక్షకుల మాతృభాషలోనే మాట్లాడుతున్నట్లు అనిపించేలా ‘ఫేస్ టు ఫేస్’ అనువాదాన్ని ఈ బృందం అందుబాటులోకితీసుకువచ్చింది.
8. చికెన్‌తో చిక్కు లేదు
పక్షుల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోందన్న కథనాలపై కేంద్ర పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ స్పందించింది. కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు తినడంతో కరోనా సోకదని స్పష్టం చేసింది. చికెన్ వినియోగం సురక్షితమని, ఇందులో ఎలాంటి సందేహం వద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ మాలిక్ బహిరంగ ప్రకటన జారీ చేశారు.
9. సుష్మాస్వరాజ్ భవన్‌గా.. ప్రవాసీ భారతీయ కేంద్రం
రెండు ప్రముఖ సంస్థలకు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని సుష్మాస్వరాజ్ భవన్‌గా, ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌ను సుష్మాస్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌గా పిలుస్తారనివిదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.
10. బ్రోకర్ల ఆగడాలు ఇక చెల్లవ్ : సెబీ
ఖాతాదారుల షేర్లను బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా ఆన్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేశామని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. స్టాక్ బ్రోకర్లు ఖాతాదార్ల షేర్లను దుర్వినియోగపరిచినా, మదుపర్ల నిధుల్ని దారి మళ్లించాలని ప్రయత్నించినా ఈ వ్యవస్థ వెంటనే గుర్తించి ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించేలా దీన్ని రూపొందించారు.