Politics

రామోజీ….మీ తప్పుడు ఆలోచనా విధానం మార్చుకోండి

Botsa Satyanarayana Writes To Ramojirao On False News

తనపై రాసిన తప్పుడు వార్తను ఈనాడు దినపత్రిక వెనక్కి తీసుకోవాలంటూ పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు లేఖ రాశారు. ‘ ఇవాళ ఈనాడు పేపర్‌లో నాపై తప్పుడు వార్త రాశారు. ఆ వార్తను వెనక్కి తీసుకోవాలి. నేను అనని మాటలను మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించారు. చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న మీ మానసిక స్థితిని ప్రశ్నిస్తున్నా. అవసరం అయితే ఎన్డీయేలో చేరుతాం అని నేను అన‍్నట్లుగా మీరు ప్రచురించిన తప్పుడు వార్తను నేను ఎక్కడ అన్నానో చెప్పాలి. అనని మాటలను అన్నట్లుగా మీ పత్రిక మొదటి పేజీలో ప్రచురించి ఎందుకు ఇంతలా దిగజారుతున్నారో ఆత్మ విమర్శ చేసుకోండి. నేను అనని మాటలను అన్నట్లుగా ప్రచురించడంతో మా పార్టీపై నమ్మకం ఉన్న మైనార్టీలను రెచ్చగొట్టాలన్నది మీ దురాలోచన. ఈ వ్యాఖ్యలను మేం చేయలేదని ఖండిస్తే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను దెబ్బకొట్టవచ్చన్నది మీ రెండో దురాలోచన. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రచురించిన తీరు మీ దురాలోచనలకు నిదర్శనం. రాష్ట్ర ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండి… నిధులు తెచ్చుకోవాలని ఏ ప్రభుత‍్వమైనా కోరుకుటుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం లేదు… ఈనాడు పత్రిక వల్ల తెలుగు ప్రజలకు జరిగిన మేలు ఫలానా అంటే చెప్పేందుకు ఏమీ మిగల్లేదు. ఎందుకీ పరిస్థితి వచ్చిందో మీరో ఆలోచించుకోండి. చివరిగా.. మీ వార్త తప్పు, మీ ఆలోచన తప్పు. మీ పాలసీ తప్పు. చంద్రబాబును బతికించుకోవడం కోసం మీరు ఎంతటి అసత్యాలు అయినా పత్రికలో ప్రచురించడం తప్పు మాత్రమే కాదు.. నేరం కూడా. మీ స‍్పందన బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.