నటి రేణూ దేశాయ్ సోషల్‌మీడియా వేదికగా ఓ కీలక పోస్టు పెట్టారు. రేణూదేశాయ్ కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఖరీదైన నివాసం కొనిచ్చారంటూ గతకొన్నిరోజులగా పలు మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది సన్నిహితులు, స్నేహితులు ఈ విషయంపై రేణూకు ఫోన్లు చేస్తున్నారు. దీంతో రేణూ ఫేస్‌బుక్ వేదికగా ఓ కీలక పోస్టు పెట్టారు. తన కష్టార్జితంతో హైదరాబాద్‌లో ఓ ప్లాట్ కొనుకున్నానని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ఆమె కోరారు.
‘నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం.. నిన్నటి నుంచి నాకు మీడియా, స్నేహితుల నుంచి వస్తున్న ఎన్నో మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్. వాటి ఆధారంగా ఈ విషయం చాలా సీరియస్ అయ్యిందని నాకు అర్థమైంది. వాళ్లు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది. అందుకే ఈ వివరణ..
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం…
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయతీ…
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం…
ఇది మీకు తెలియనిదా??!!
నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్ధతతో ఎంతగానో శ్రమిస్తున్నాను.. శ్రమిస్తూనే పోరాడుతున్నాను. నేనిప్పటి వరకూ కనీసం మా తండ్రి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం!! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్ధమైన అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్లు, ప్రచారం చేస్తున్నట్లు ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయతీ, ఆత్మగౌరవం, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా?? నాకు తెలిసినంతవరకూ ఈ వార్తకు, నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్లి ఉండదు. అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడకోసమో.. ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం..? ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా..? ప్రజలు ఈ అబద్ధపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా..? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్తిత్వం, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా..? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది.!! ఎంతలా చితికిపోతుంది..!! దయచేసి ఆలోచించండి. ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికీ గౌరవం ఇవ్వకపోయినా సరే.. దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్లీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకు మధ్య, దయచేసి ఎలాంటి గొడవలు సృష్టించకండి.
మీ
రేణూ దేశాయ్