DailyDose

రెపు తెలంగాణా క్యాబినెట్ భేటీ-తాజావార్తలు

Telangana Cabinet Meets Tomorrow Feb 16 2020-Telugu Breaking News Roundup

* తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.

* ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ‘‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీకు ఆసరాగా ఉండాలని వచ్చా. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. జగన్‌ ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపలా మాట్లాడుతున్నారు’’ అని పవన్‌ అన్నారు.

* తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష షెడ్యూళ్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్‌కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుతించబోమని స్పష్టంచేశారు. పరీక్ష ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పిస్తామన్నారు.

* తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. అనుమతి లేకుండా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆయనకు జరిమానా విధించారు. ఈ మేరకు రూ.5వేలు జరిమానా కట్టాలంటూ శనివారం నోటీసులు జారీచేశారు. అధికారుల నోటీసులకు స్పందించిన మంత్రి తనకు విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించారు.

* రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఎంపీ, భాజపా నేత టీజీ వెంకటేశ్‌ అన్నారు. భాజపా, వైకాపా కలయికను పైస్థాయిలో నిర్ణయిస్తారన్నారు. వైకాపా అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి సంకేతాలు వచ్చాయి గనకే బొత్స అలా మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో భాజపా వల్లే వైకాపాకు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు.

* దిల్లీ పర్యటనలో ఏం మాట్లాడారో కూడా చెప్పలేనిస్థితిలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ, అమిత్‌ షాతో ఏం మాట్లాడారో చెప్పలేని నిస్సహాయ స్థితి ఈ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. దిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రంలో ఏముందో సీఎం జగన్‌ చెప్పాలన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే మంత్రులతో ప్రకటన చేయిస్తున్నారని మండిపడ్డారు.

* ఎన్డీయేలో వైకాపా చేరే అంశంపై తమకెలాంటి సమాచారం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా, వైకాపాలకు సమదూరం పాటించాలనేదే తమ పార్టీ నిర్ణయమని స్పష్టంచేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే మోదీ, అమిత్‌ షాలతో జగన్‌ భేటీ అయి ఉంటారన్నారు. బొత్స ఎందుకు అలా మాట్లాడారో తెలియడం లేదని చెప్పారు. ఈ అంశం గురించి గతంలో కూడా ఎప్పుడూ చర్చ జరిగిన సందర్భంలేదన్నారు.

* గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంవ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. వసంత్‌ వైద్యుడిగా ఉండి ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. గాంధీలో పరిణామాలపై ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యమని పేర్కొన్నారు.

* అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ ఏడేళ్లకే దూరమైతే ఆ తల్లి పడే కడుపుకోత వర్ణనాతీతం. అలాంటిది చనిపోయిన కూతుర్ని మళ్లీ కలుసుకునే అవకాశం వస్తే.. ఆ కన్నపేగు ఉప్పొంగిపోతుంది. ఆ అనుభూతినే ఓ తల్లికి అందించింది దక్షిణ కొరియాకు చెందిన టీవీ ఛానల్‌. మన జీవితంలో నుంచి శాశ్వతంగా దూరమైన వ్యక్తులను మళ్లీ కలుసుకునే అవకాశం నిజ జీవితంలో సాధ్యం కాకపోయినప్పటికీ వర్చువల్‌ రియాల్టీతో ఓ తల్లి తన చనిపోయిన కుమార్తెను కలిసేలా చేసింది ఆ టీవీ ఛానల్‌.

* మీ పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించలేదా..?అయితే 31 మార్చి 2020నుంచి ఇక మీ పాన్‌కార్డు పనిచేయనట్లే. ఎందుకంటే మార్చి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులను పని చేయనివిగా పరిగణిస్తామని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే దీని గడువును చాలా సార్లు పొడగించామని..ఈ మార్చి వరకు లింక్‌ చేయని కార్డులని పనిచేయనివిగా గుర్తిస్తామని పేర్కొంది.

* రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రం ఇష్టమేననీ.. ఆ విషయంతో తానూ ఏకీభవిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కానీ, అమరావతినే రాజధానిగా గతంలో అందరూ అంగీకరించి.. ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు.

* గతేడాది(2018-19) అత్యధిక పెట్టుబడులతో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఐదేళ్లలో దేశవ్యాప్త పెట్టుబడుల్లో ఏపీకి రూ.70వేల కోట్లు వచ్చాయని ట్విటర్‌ లో వెల్లడించారు. వైకాపా ప్రభుత్వంలో పీపీఏలు రద్దు చేసి, వాటాల కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు. డీలర్‌ షిప్‌ల కోసం వేధింపులు తట్టుకోలేక పెట్టుబడులు వెనక్కి పోవడం బాధాకరమన్నారు.

* వైకాపా ..ఎన్డీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ఉపముఖ్యమంత్రి మంత్రి అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘నాకు పదవులు కాదు..నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధం. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా’’ అని అంజాద్‌ బాషా అన్నారు.

* మెట్రో రైలు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో రైలు అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో రైలు వస్తే పాత నగర రూపురేఖలు మారిపోతాయి. పాత నగరానికి మెట్రో రాకుండా మజ్లిస్‌ పార్టీ అడ్డుకుంటోంది. మజ్లిస్‌ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

* పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిన వైకాపా రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ర్యాలీలు ఎలా చేస్తుందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ ప్రశ్నించారు. దీనికి వైకాపా నేతలు సమాధానం చెప్పాలన్నారు. వైకాపా నేతలు కేంద్రానికి చెప్పే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అంటున్నారనీ.. అదే నిజమైతే లిఖితపూర్వక ఆధారాలు చూపాలన్నారు.

* దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ హుడ్‌ క్యాన్సర్‌డేను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణతోపాటు నటి రష్మిక, క్యాన్సర్‌ను జయించిన పలువురు చిన్నారులు.. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

* తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో మొత్తం 909 పీఏసీఎస్‌లు ఉండగా.. 157 ఏకగ్రీవమయ్యాయి.మిగతా సొసైటీలకు శనివారం పోలింగ్‌ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం పోలింగ్‌ నమోదైంది. 6,248 వార్డుల్లో సభ్యులైన రైతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* ఇకపై ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్‌ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

* ప్రపంచదేశాలను వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమవంతు సహకారం అందిస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీని చైనా ప్రశంసించింది. చైనాకు వైద్య సహాయం అందిస్తోన్న 33దేశాల జాబితాను తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. ఆ జాబితాలో భారత్‌ లేనప్పటికీ..ప్రధాని మోదీ చైనాకు సహకారం అందిస్తామని చేసిన ప్రకటనను అభినందించింది.

* ఇక నుంచి పూర్తిగా బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం వాహన తయారీ సంస్థలను కోరింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-4 ఇంజిన్‌తో కూడిన వాహనాల విక్రయాల గడువును పెంచబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వాహన తయారీదారులు తప్పకుండా బీఎస్‌-6 ప్రమాణాలతో వాహనాలను తయారు చేసి విపణిలోకి విడుదల చేయాల్సి ఉంటుంది.