* ఇకపై ఏటీఎంలలో నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
* ఏదైనా టెలికాం సంస్థ దివాళా తీసినట్టు దరఖాస్తు చేస్తే బ్యాంకులు ఆ మొత్తం విలువను చెల్లించాల్సి వస్తుందని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) ఛైర్మన్ రజినీశ్ కుమార్ అన్నారు. రూ.1.47 లక్షల కోట్ల పాత బకాయిలను చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. టెలికాం శాఖ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి తాము వేచిచూసే ధోరణి కనబరుస్తున్నామని ఆయన వెల్లడించారు.
* డిసెంబరు త్రైమాసికంలో ఓఎన్‌జీసీ స్టాండలోన్ ప్రాతిపదికన రూ.4,152 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.8,263 కోట్లతో పోలిస్తే ఇది 49.8 శాతం తక్కువ. ముడి చమురు, సహజ వాయువు ధరలతో పాటు ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో లాభం క్షీణించిందని సంస్థ పేర్కొంది. ఆదాయం కూడా 14.4 శాతం క్షీణించి రూ.23,710 కోట్లకు పరిమితమైంది. ముడి చమురు ఉత్పత్తి 1 శాతం తగ్గి 4.82 మిలియన్ టన్నులు నమోదు కాగా, గ్యాస్ ఉత్పత్తి 8.4 శాతం తగ్గి, 5.875 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా నమోదైంది.
* టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి.