Devotional

శివలింగంపై ఎలుక…ఆర్యసమాజ్ స్థాపనకు కారణం

The story of dayananda saraswati and the founding of arya samaj mumbai

ఓ శివరాత్రి వేళ…శివాలయంలో పూజలు, భజనలు జరుగుతున్నాయి. తండ్రితో కలిసి జాగారం చేస్తున్న మూలశంకర్‌ తివారీ అనే పద్నాలుగేళ్ల పిల్లాడు మెలకువగా ఉన్నాడు. ఎదురుగా కనిపిస్తున్న శివలింగాన్నే చూస్తున్నాడు. ఇంతలో గర్భాలయంలో చిన్న కలకలం…ఓ ఎలుక శివలింగంపైకి ఎక్కి, చుట్టూ తిరిగి అక్కడున్న నైవేద్యాన్ని తినేసింది. అది చూసిన మూలశంకర్‌ మనసులో ఓ ప్రశ్న…రాక్షసులు, దుష్టులను సంహరించే పరమశివుడు ఓ ఎలుకను అలా చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? తండ్రిని నిద్ర లేపి, ఇదే ప్రశ్నను అడిగాడు. తండ్రి దగ్గర సమాధానం లేదు. దైవం గురించి అలా మాట్లాడకూడదని కోపంగా అన్నాడు. కానీ మూలశంకర్‌ మనసులో ఆ సంఘటన శాశ్వతంగా ఉండిపోయింది. అదే అతని సత్యాన్వేషణకు కారణమైంది. మూఢాచారాలపై పెను ఉప్పెనలా పడేలా చేసింది. సనాతన ధర్మానికి సరికొత్త దిశానిర్దేశం చేసేలా చేసింది..ఆ బాలుడే తర్వాత దయానంద సరస్వతిగా ప్రసిద్ధుడయ్యారు. ఆర్య సమాజాన్ని లోకానికి అందించారు.

1824లో గుజరాత్‌ కథియవాడ్‌ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో మూలశంకర్‌ తివారీ జన్మించారు. చిన్ననాటి నుంచి ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించి, అన్వేషించే మూలశంకర్‌లో శివరాత్రి నాటి సంఘటన బలంగా నాటుకుంది. 18వ ఏట చెల్లెలు కలరాతో చనిపోవడం చూసిన తరువాత మనిషి మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడని ప్రశ్నించుకున్నాడు. సమాజంలో ధర్మం పేరుతో జరుగుతున్న మోసాలను చూసి కలత చెందాడు. కొంతకాలం తర్వాత మధురలో మహర్షి విరజానందను కలిసిన తర్వాత మూలశంకర్‌ జీవితం మారిపోయింది. అక్కడ వేదశాస్త్రాలు అభ్యసించారు. మూలశంకర్‌ పేరును దయానంద సరస్వతిగా మార్చింది విరజానందే.. అనేక రుగ్మతలతో బాధ పడుతున్న సమాజానికి వేద సందేశాన్ని అందించి చైతన్యపరచాలని గురువు సూచనల మేరకు దయానంద తన కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆ క్రమంలోనే 1875, ఏప్రిల్‌ 10న ముంబయిలో ఆర్య సమాజ్‌ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వేదాధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో కులవివక్షకు తావులేదన్నారు.భగవంతుడు సర్వవ్యాపకుడు, ఆయనకు విగ్రహారాధన అవసరం లేదని చెప్పారు. బాలికా విద్య సమాజానికి అవసరమని చెప్పారు. కులాంతర వివాహాలకు ఆర్యసమాజ్‌ వేదికగా నిలిచింది. ఒకసారి మతం మారిన హిందువు తిరిగి స్వధర్మంలోకి రాలేడన్న భ్రమను ఆర్యసమాజ్‌ దూరం చేసింది. ఇలా ఎన్నో సంస్కరణలకు దయానంద ఆద్యుడయ్యారు.