* అది బంజారాహిల్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల.. రాజ్యసభ సభ్యుడి నివాసానికి సమీపంలో ఉన్న పాఠశాల.. వారు ఎనిమిది నుంచి పదో తరగతి లోపు విద్యార్థులు.. ఉపాధ్యాయులకు ఉప్పందడంతో ఆ విద్యార్థుల సంచులను తనిఖీ చేశారు. ఆశ్చర్యపోయారు. కారణం.. ఆ సంచుల్లో ఈ-సిగరెట్లు లభ్యమయ్యాయి.
* ఓ యువ మంత్రి ఓటు వేసే పాఠశాల అది. షేక్‌పేట మండల పరిధిలోని ఉన్న ఆ పాఠశాలలో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థుల సంచుల్లో ఉపాధ్యాయులకు చాక్లెట్లు లభించాయి. విద్యార్థుల కంగారును గమనించిన ఉపాధ్యాయులు చాక్లెట్ల రుచి చూసి ఆశ్చర్యపోయారు. అవి కాస్త మత్తును కలిగిస్తుండటంతో ఆందోళన చెందారు. తమ దృష్టికి వచ్చిన ఈ ఘటనలను బయటి ప్రపంచానికి తెలియకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త తీసుకున్నారు. విద్యార్థులను హెచ్చరించి వదిలేశారు. మూడు నెలల క్రితం ఓ పాఠశాలలో ఈ-సిగరెట్లు లభించగా.. తాజాగా మత్తునిచ్చే చాక్లెట్లు లభించడం ఉపాధ్యాయులనే కాదు.. తల్లిదండ్రులనూ కలవరపరుస్తోంది.
*** ధూల్‌పేట నుంచి..
నగరంలోని ధూల్‌పేట గుడుంబాకు పెట్టింది పేరు. కొద్ది కాలంగా చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో గుడుంబా దాదాపు కనిపించకుండా పోయింది. స్థానికులకు పోలీసులు ఉపాధి అవకాశాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు మాత్రం తప్పుడు దారి వదలడం లేదు. నిషేధిత ఉత్పత్తులను అలవాటు చేయడానికి, విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వివిధ పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని విద్యార్థులకు వాటిని అంటగడుతున్నారు. ఈ-సిగరెట్లు పట్టుబడిన నేపథ్యంలో విద్యార్థులను ఉపాధ్యాయులు విచారించారు. ధూల్‌పేట నుంచి వచ్చిన కొందరు విక్రయించినట్లు వారు చెప్పారు. వాటన్నింటిని ఉపాధ్యాయులను స్వాధీనం చేసుకొని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
*** అంతర్జాలంలో శోధించి..
నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం తాగిన అనుభూతినిచ్చే చాక్లెట్లు లభ్యమవుతున్నాయి. మరికొన్ని చాక్లెట్లు మత్తునిచ్చేవిగా ఉన్నాయి. ఇలాంటి చాక్లెట్లు ప్రాథమిక స్థాయి విద్యార్థుల పుస్తకాల సంచుల్లో లభ్యమవుతుండటం ఆందోళనకరమే. ‘నాకు ఈ చాక్లెట్ తింటే ఎంతో హాయిగా ఉంటుంది సర్’ అంటూ ఉపాధ్యాయుడికి ఇటీవల ఓ పాఠశాలలో పట్టుబడిన విద్యార్థి చెప్పడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరా తీసిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులు ఇలాంటి మత్తు చాక్లెట్లకు అలవాటుపడ్డారని గుర్తించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దొంగతనంగా చరవాణులను పాఠశాలలకు తీసుకొస్తున్న కొందరు విద్యార్థులు అంతర్జాలంలో ఇలాంటి వాటి గురించి శోధిస్తున్నట్లు గుర్తించారు.
*** నిఘా పెట్టాల్సిందే..
ఇంటి వద్ద తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లల సంచులను తనిఖీ చేయాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి చెబుతున్నారు. పిల్లలు ఒంటరిగా కూర్చోవడం, గదిలో ఎక్కువ సమయం గడపడం తదితర లక్షణాలున్న పిల్లలపై కచ్చితంగా దృష్టి సారించాలంటున్నారు. పిల్లల చేతులను తరిచిచూడటమే కాకుండా అనుమానం వస్తే వాసన చూడాలని చెబుతున్నారు. పిల్లలపై మత్తు పదార్థాల ప్రభావం పడకుండా చూసుకోవడంతో పాటు వాటి వల్ల కలిగే నష్టాలను వివరించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులు ఎవరెవరితో స్నేహంగా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు తదితర అంశాలను గమనించాలి. పాఠశాలల వద్ద అనుమానాస్పదంగా సంచరించేవారిపై దృష్టి పెట్టాలి. పాఠశాల బయట, ఆవరణలో నిఘానేత్రాలను ఏర్పాటు చేయాలి.