Politics

కిషన్‌రెడ్డి…సోది చెప్పకు

Kishanreddy Is Spreading False Rumors On OldCity Metro-TRS

మెట్రో రైలు వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవంలో పాటించాల్సిన ప్రొటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిందన్నారు. మెట్రో వ్యవహారంలో విషయాలు సరిగా తెలుసుకొని.. హుందాగా ప్రవర్తిస్తే మంచిదని కిషన్‌రెడ్డికి కర్నె హితవు పలికారు. భాజపా పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం చూపిస్తున్న ప్రేమలో నాలుగో వంతైనా తెలంగాణపై చూపితే అభివృద్ధి మరింత వేగంగా జరిగేదన్నారు. కేంద్ర మంత్రులు ఎవరైనా వారి రాష్ట్రాలకు నిధులు తీసుకెళ్లాలని తాపత్రయపడతారని.. ఈ విషయంలో కిషన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తీసుకువస్తే ఆయనకు పౌరసన్మానం చేయడానికీ సిద్ధంగా ఉన్నామని కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు.