Movies

నేడు మీరా జన్మదినం

Today Is Meera Jasmine's Birthday-Telugu Movie News

అందం… అభినయం కలబోతతో దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన నటి… మీరా జాస్మిన్‌. ఆమె ‘సూత్రధారన్‌’ అనే మలయాళ చిత్రంతో తెరకు పరిచయమైంది. ‘రన్‌’తో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఒకేసారి మురిపించింది. తొలిసారి ఆమెని తెరపై చూడగానే తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరుసటి యేడాదే తెలుగు చిత్ర పరిశ్రమ స్వాగతం పలికింది. ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. అందులో సత్య, జనని అనే రెండు పాత్రల్లో మురిపించింది. అప్పట్నుంచి ఆమెకి వరసగా అవకాశాలు. పవన్‌కల్యాణ్‌తో ‘గుడుంబాశంకర్‌’, రవితేజతో ‘భద్ర’, గోపీచంద్‌తో ‘రారాజు’, బాలకృష్ణతో ‘మహారథి’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మురిపించింది. ‘యమగోల మళ్లీ మొదలైంది’, ‘మా ఆయన చంటిపిల్లాడు’, ‘గోరింటాకు’, ‘బంగారు బాబు’ చిత్రాలు ఆమెని కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. విశాల్‌తో కలిసి ఆమె చేసిన ‘పందెంకోడి’ కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. తరువాత విడుదలైన ‘పందెంకోడి2’లో ఆమె ఓ చిన్న పాత్రలో దర్శనమిచ్చింది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘మోక్ష’. సుదీర్ఘమైన ప్రయాణంలో చేసింది తక్కువ సినిమాలే అయినా.. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ ఆమె అవకాశాలు అందుకొంది. నాలుగుచోట్ల స్టార్‌ కథానాయికగా గుర్తింపు పొందింది. ఆరంభంలో ఆమె మలయాళంలో చేసిన ‘పాదంఒన్ను: ఒరు విలాపం’ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఏ పాత్రలోనైనా అత్యంత సహజంగా నటించడం మీరా ప్రత్యేకత. కేరళలోని కుట్టప్పజ గ్రామానికి చెందిన జోసెఫ్, అలేయమ్మ దంపతులకి 1982 ఫిబ్రవరి 15న జన్మించింది మీరా. ఆమె చెల్లెళ్లు జీబీ సారా జోసెఫ్, జెనీ సుసాన్‌ జోసెఫ్‌ కూడా నటులే. ఇద్దరు సోదరుల్లో ఒకరు ఛాయాగ్రాహకుడుగా కొనసాగుతున్నారు. తిరువల్లలోని బాలవిహార్, మార్తోమ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యని పూర్తి చేసిన మీరా… చంగనశేరిలో డిగ్రీ చదువుతుండగా దర్శకుడు బ్లెస్సీ దృష్టిలో పడింది. ‘సూత్రధారన్‌’లో నటించే అవకాశం అందుకుంది. సినిమా రంగంలోకి వస్తానని.. ఇలా డ్యాన్సులు చేస్తానని తాను కలలో కూడా అనుకోలేదని మీరా జాస్మిన్‌ చెబుతుంటుంది. మాండోలిన్‌ రాజేష్‌తో ప్రేమలో ఉందనే ప్రచారం సాగినప్పటికీ… ఆమె 2014లో దుబాయ్‌కి చెందిన ఇంజినీర్‌ అనిల్‌ జాన్‌ టైటస్‌ని వివాహం చేసుకుంది. ఈ రోజు మీరా జాస్మిన్‌ పుట్టినరోజు.