చాలామందికి చేతి వేలి గోళ్లను పెంచడం అంటే సరదా. ఎప్పట్నుంచో ఇదొక ఫ్యాషన్ కూడా. కానీ కొంత కాలానికే ఇవి విరిగిపోతుంటాయి. దీనికి కారణాలు అనేకం. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ చేతి వేలి గోర్లు దృఢంగా తయారవుతాయి.
* ఒక స్పూన్ కొబ్బరి నూనెలో 5 చుక్కల నిమ్మరసం వేసి మైక్రో ఓవెన్‌లో ఒక సెకన్ వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లకు రాసి మసాజ్ చేస్తే గోళ్లు విరిగిపోకుండా బలంగా పెరుగుతాయి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ పాలిపోయిన గోర్లను ఆరోగ్యంగా చేయడంలో సాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్‌యాసిడ్ గోళ్లకు అవసరమైన పోషణను ఇచ్చి బలంగా ఉండేలా చేస్తుంది.
* నారింజ రసంలో గోళ్లను ముంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. గోర్లను పొడిటవల్‌తో తుడుచుకొని మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నారింజ రసంలోని ఫోలిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. గోళ్ల పెరుగుదలలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
* ఎక్కువగా గోళ్లను నీటిలో కానీ డిటర్జెంట్ పౌడర్‌నీటిలో కానీ నాననీయకూడదు. గోళ్లతో డబ్బాల మూతలు తీయడం, పాత్రలని గీరడంలాంటివి చేయకూడదు. నోటిలో పెట్టుకొని కొరకరాదు. గోళ్లు పగిలినా, పుచ్చినా వెంటనే కట్ చేసేయాలి.
* ప్రతిరోజూ నిమ్మరసంతో గోరువెచ్చని నీటిలో కడిగితే గోళ్లపైన పచ్చదనం పోయి అందంగా తయారవుతాయి. బట్టలు ఉతికేటప్పుడు రబ్బరు గ్లౌజులు తొడుక్కోవాలి. లేదంటే కొన్ని రకాల డిటర్జెంట్‌ల వల్ల గోళ్లు పాడైపోయే అవకాశం ఉంది.
* కొందరు గోళ్లను కత్తెరతో కట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గోళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చి పాడవుతాయి. అలాగే బ్లేడును కూడా ఉపయోగించవద్దు. ఓన్లీ నెయిల్ కట్టర్‌తో మాత్రమే గోళ్లను తీసుకోవడం మంచిది. గోళ్లు ఆరోగ్యం కోసం చిట్కాలు పాటిస్తూనే రోజూ క్యారెట్ జ్యూస్ తాగాలి.