* భారత్ నుంచి ఉత్పత్తయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్ నుంచే 35 శాతం తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంకేతికత, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో తెలంగాణ రాణిస్తోందని చెప్పారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన బయో ఆసియా సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
* తన మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ జరిపిన సోదాలపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని వైకాపా డిమాండ్ చేసింది. రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆదాయపన్ను శాఖ ప్రకటనలో తెలిపినా.. చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. దమ్ముంటే సోదాలు జరిపిన ఐటీ శాఖపై పరువునష్టం దావా వేయాలని డిమాండ్ చేశారు.
* ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. భారత సిలికాన్ వ్యాలీలాంటి హైదరాబాద్ మహానగరంలో వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్ లభించడం లేదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను పబ్లిక్ డొమైన్‌లో పొందుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ భాజపా నేత పేరాల శేఖర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.
* ‘నిర్భయ’ దోషులకు మార్చి 3న ఉరి తీసేందుకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఉరిశిక్ష అమలు చాలా ఆలస్యమైందనీ.. అయినా తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు సంతోషం కలిగించిందని చెప్పారు. న్యాయం కోసం తామెంతగానో పోరాటం చేశామని గుర్తు చేసుకున్నారు. తన కుమార్తెను కిరాతకంగా బలితీసుకున్న ఆ మృగాళ్లకు చివరకు డెత్ వారెంట్ జారీ చేయడం హర్షణీయమన్నారు.
* పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మెజారిటీ పక్షాల మద్దతుతో పార్లమెంటులో తీసుకొచ్చిన ఓ చట్టాన్ని రాష్ట్రం ఏ విధంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా? లేక ఒవైసీ మెప్పు కోసమా? అని నిలదీశారు.
* స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్‌లో ఇప్పుడే పాల్గొననని, దానికి కొంత సమయం కావాలని సంప్రదాయ క్రీడ ‘కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ తెలిపాడు. ‘‘సాయ్ నిర్వహించే ట్రయల్స్‌లో నేను పాల్గొనను. కంబళలో మరిన్ని ఘనతలు సాధించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కంబళ టోర్నమెంట్ సాగుతోంది. అందుకే ఒక నెల గడువు కావాలని సాయ్‌ను కోరాలని భావిస్తున్నా’’ అని శ్రీనివాస గౌడ పేర్కొన్నారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భాజపా ద్వారా జరుగుతున్న ఈ కుట్ర ప్రమాదకరమైందన్నారు. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో భట్టి మాట్లాడారు. తాము కూడా భారతీయులమేనంటూ జాతీయ జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి దేశంలో నెలకొందన్నారు.
* చైనాలో కొవిడ్-19 ప్రభావిత వుహాన్ నగరంలో ఇద్దరు భారతీయ దంపతులు స్వదేశానికి వచ్చేందుకు పాట్లు పడుతున్నారు. యూపీకి చెందిన ఆ దంపతులు తమను స్వదేశానికి రప్పించండంటూ కేంద్రప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు చైనాలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వీడియోలో వివరించారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ మొత్తం ఖాళీ అయిందని.. తమను భారత్‌కు తీసుకువెళ్లాలంటూ ప్రధానిని కోరారు.
* చైనాలో కొవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, ఈ వైరస్‌ను 40 ఏళ్ల ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాకు చెందిన రచయిత డీన్ కూంట్జ్ రచించిన ఐస్ ఆఫ్ డార్క్‌నెస్ నవలలో ఈ వైరస్ ప్రస్తావన ఉంది. అయితే, కరోనా అని కాకుండా వుహాన్-400 అని అందులో పేర్కొన్నారు. ఓ లేబోరేటరీలో తయారైన ఓ జీవరసాయన ఆయుధంగా రచయిత తన కాల్పనిక (ఫిక్షన్) నవల్లో పేర్కొన్నారు.
* ఓ యువతి అజాగ్రత్తగా రోడ్డు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతూ ద్విచక్రవాహన దారుడిని ఢీ కొట్టింది. అదే సమయంలో వెనక వస్తున్న కారు డ్రైవర్ గమనించకుండా ముందుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో యువతిపైకి కారు ముందు టైరు దూసుకెళ్లింది.
* సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. మార్చి 3 ఉదయం 6 గంటలకు వారిని ఉరితీయాలంటూ దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.
* ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవాస్తవాలు ప్రచురించిన సాక్షిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. శాసన పరిషత్ కార్యదర్శిపై చర్యలు తీసుకొనే అధికారం మండలి ఛైర్మన్‌కు ఉందన్న యనమల.. కార్యదర్శిపై ప్రభుత్వం అంత ఒత్తడి తేవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
* ఎన్నికలు ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్లు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడటం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
* దేశంలో మూడవ ప్రైవేటు రైలు ‘కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వారణాసి – ఇండోర్‌ల మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ లోని బి-5 కోచ్ లోని 64వ నంబరు సీటుకు ఓ ప్రత్యేకత ఉంది. దీనిని భారతీయ రైల్వే సాక్షాత్తూ ఆ మహాకాళేశ్వరుడికి కేటాయించారు. ఆ సీటు మహాకాళేశ్వరుడికి కోసం అని తెలియచేయటానికి అక్కడ పరిసరాలను ఆలయం మాదిరిగా అలంకరించారు.
* రాష్ట్రంలో వైకాపా సర్కార్‌పై టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీల నిధులను ఇతర పథకాలను మళ్లిస్తూ బలహీనవర్గాల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఒక యువకుడు వీడియో పోస్ట్ ద్వారా ప్రశ్నిస్తే అతడిని అరెస్టు చేయడంపై అచ్చెన్న మండిపడ్డారు. ఇదే ప్రశ్న ఇప్పుడు తాము అడుగుతున్నామని.. ధైర్యం ఉంటే జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
* నిర్భయ కేసులో ‘ఉరి’ వాయిదా పడేలా చేసేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహాడ్ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మరో దోషి అక్షయ్ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నాడు.
* ఇప్పటికే కరోనా వైరస్(కొవిడ్-19)తో జనజీవనం స్తంభించిపోయిన చైనాలో ఆర్థిక రంగం కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోరంగ విపణియైన చైనాలో ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో విక్రయాలు 10 శాతం పడిపోయే అవకాశం ఉందని చైనా అసోసియేషన్ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్(సీఏఏఎం) అంచనా వేసింది. ఈ మేరకు నిర్వహించిన ఓ సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
* ఫ్యాషన్ ప్రియుల చూపులను తనవైపు తిప్పుకునే లాక్మే ఫ్యాషన్ వీక్ ఆదివారంతో ముగిసింది. ఫిబ్రవరి 11న నుంచి ఫిబ్రవరి 16 వరకూ ఎంతో సందడిగా జరిగిన ఈ ఫ్యాషన్ షో సినీ, క్రీడా రంగానికి చెందిన ఎందరో తారలు.. డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంపుపై హోయలొలికించారు. తాజాగా డిజైనర్ కావేరి రూపొందించిన దుస్తుల్లో ప్రముఖ నటి నిత్యామేనన్ ర్యాంపుపై సందడి చేశారు. హంస నడకతోపాటు ర్యాంపుపై డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
* కరీంనగర్ శివారులోని అల్గునూరు వద్ద కాకతీయ కాల్వలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం రాత్రి ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి కాల్వలో పడిపోవడంతో గాలింపు చేపట్టిన క్రమంలో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కాల్వలో శవాలుగా తేలారు. నరెడ్డి సత్యనారాయణ రెడ్డి (55), ఆయన భార్య రాధ (50), కుమార్తె వినయశ్రీ అనుమానాస్పదంగా మృతిచెందారు.
* ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌కు మరోసారి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం రూ. 2,500కోట్లు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కంపెనీ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సోమవారం రూ. 2,500 కోట్లు, శుక్రవారం నాటికి మరో రూ. 1000కోట్లు చెల్లిస్తామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని వొడాఫోన్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.