DailyDose

29నుంచి అరకు ఉత్సవాలు-తాజావార్తలు

Araku Utsavam 2020 From 29 Feb-Telugu Breaking News Roundup Today

* విశాఖ జిల్లాలో ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఈనెల 29 నుంచి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం దాదాపు కోటి రూపాయలు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. అరకు ఉత్సవాల కోసం రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఈ రోజు మంత్రి విశాఖనగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక స్వర్గధామంగా భావించే విశాఖ ఏజెన్సీపట్ల సందర్శకుల్లో మరింత ఆసక్తి కలిగించే లక్ష్యంతో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంప్రదాయ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు అరకు లోయ. ఏటా ఈ ప్రాంతాన్ని దేశ, విదేశీయులు లక్షలాదిమంది సందర్శిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం ఏటా ఈ శీతల ప్రాంతంలో హాట్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేది.
* ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న మొత్తం ఆరుగురు అధికారులకు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం మద్యంతర బెయిల్‌పై ఉన్నవీరికి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
* తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీసీల నియామకానికి ముందు సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. వీసీల నియామకానికి ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమమం అవుతుందన్నారు. రెండు నుంచి మూడు వారాల్లోగా మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* తెలంగాణలో సభలు, సమావేశాలకు సంబంధించిన అనుమతులపై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. విశ్రాంత ఐఏఎస్‌ షఫీక్‌ ఉజ్జమాన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారించింది. సభలకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరిస్తున్నారని.. కనీసం వారం ముందే దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
*విజయనగరం జిల్లాకు ఎంవీ ప్రసన్నశ్రీ అనే మహిళ అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు. తన చేతికి ఉన్న గాజులను తీసి అమరావతి పరిరక్షణ జేఏసీకి అందించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు చేసిన కృషి ఫలిస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం భావితరాల దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో తమకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయని, విశాఖకు రాజధాని రావడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రసన్నశ్రీ తేల్చి చెప్పారు…
*కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారితో చైనాలో మరణించిన వారి సంఖ్య 2000 దాటింది. బుధవారం మరో 136 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. వీరంతా వైరస్‌ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సుకు చెందిన వారే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన 1,749 కేసులతో బాధితుల సంఖ్య 74,185కు ఎగబాకింది. వీరిలో 11,977 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 5,248 మంది అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటి వరకు 14,376 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. అయితే, బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిలో 1,716 మందికి వైరస్‌ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక హాంకాంగ్‌లో 62 కేసులను నిర్ధారించారు. మకావులో 10, తైవాన్‌లో 22 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు చైనా వెలుపల 900 మందికి వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. హాంకాంగ్‌లో వైరస్‌ వల్ల మరొకరు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందినట్లైంది. ఫ్రాన్స్‌, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తైవాన్ దేశాల్లో ఇప్పటికే ఒక్కరు చొప్పున మరణించిన సంగతి తెలిసిందే.
*టిక్కెట్ల కోసం పడే చిల్లర కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల్లో ప్రయాణానికి స్మార్ట్ కార్డులను నేటి నుంచి ప్రవేశపెట్టనుంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తే టికెట్ జారీ కానుంది.
మెట్రో రైళ్లలో ప్రయాణానికి వినియోగిస్తోన్న స్మార్ట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలోనూ ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతుంది.
*జమ్ముకాశ్మీర్‌లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) శైలేంద్ర కుమార్‌ మంగళవారం రాత్రి ప్రకటించారు. జమ్ముకాశ్మీర్‌లోని 12,500 పంచాయతీలకు వచ్చే నెల 5 నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నటుల ఇదివరకు షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతలకు సంబంధించి ముందుకొచ్చిన సమస్యలను రెండుమూడు వారాల్లో పరిష్కరించి తాజా షెడ్యూలను విడుదల చేస్తామని ఒక సిఇఒ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది…
*విశాఖలో కరోనా అనుమానిత కేసులు రెండు నమోదయ్యాయి. బాధితులు ఇద్దరూ విశాఖలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని చైనాలో మెడిసిన్‌ మొదటి సంవత్సర చదువుతోంది. ఆమె ఈ నెల 16న విశాఖ వచ్చారు. డయేరియాతో బాధపడుతున్న ఆమెను ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు డయేరియా అదుపులోకి వచ్చింది. అయినా, ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలోనే ఉంచారు. మరో 23 ఏళ్ల యువతి కూడా కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరారు. చైనాలో వైద్య విద్యనభ్యసిస్తోన్న ఆమె ప్రస్తుతం హౌస్‌సర్జన్‌గా అక్కడే శిక్షణ పొందుతున్నారు. చైనా నుంచి ఈ నెల ఎనిమిదిన విశాఖ వచ్చిన ఆమెకు మంగళవారం జ్వరం వచ్చింది. దీంతో, ఆమెకు కూడా ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అనుమానితుల ఇద్దరి బ్లడ్‌ శ్యాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌ పంపారు…
*తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ను ప్రపంచస్థాయిలో మార్కెటింగ్ చేస్తున్నారని, అదే విధంగా భారత్కూ ప్రచారం చేసి పెట్టాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చమత్కరించారు. బయో ఆసియా 2020 సదస్సులో పాల్గొన్న పీయూష్ ఇలా కోరగా, సరదాగా స్పందించిన కేటీఆర్… ‘అప్పుడు మేం జాతీయ పార్టీగా మారాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. దీనికి బదులుగా కేంద్ర మంత్రి.. ‘తప్పకుండా మీరు జాతీయ పార్టీగా మారాలి.. కేంద్ర రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ అవసరం కచ్చితంగా ఉంద’ని వ్యాఖ్యానించారు.
*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది కళకళలాడుతోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అన్నారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులను నిర్మించి, ఎత్తిపోతల ద్వారా దిగువ నుంచి ఎగువ ప్రాంతాలకు నీటిని మళ్లించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని అన్నారు.
*నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్క్వాస్) నివేదిక ప్రకారం ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలు, సేవల్లో తెలంగాణ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్తు నోడల్ అధికారి రాంబాబు నాయక్ అన్నారు. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులోని జిల్లా ఆసుపత్రిని మంగళవారం ఆయన పరిశీలించారు.
*రాష్ట్రంలో కరెంటు డిమాండు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం 7.47 గంటలకు 12,783 మెగావాట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. సోమవారం 12,137 మెగావాట్లతో కొత్త రికార్డు నమోదవ్వగా ఒక్కరోజు వ్యవధిలోనే మరో 646 మెగావాట్లు పెరగడంతో అది కాస్తా చెరిగిపోయింది. ఒక రోజులో ఏదో ఒక సమయంలో అత్యధిక స్థాయి వినియోగం నమోదైతే దాన్ని డిమాండ్ అంటారు. అది కొద్దిసేపే ఉండవచ్చు లేదా రోజంతా ఉండవచ్చు. ఒకరోజు వ్యవధిలో సగటు వాడకం ఎంత ఉంటే దాని వినియోగంగా పిలుస్తారు.
*వచ్చే ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వృత్తి కళాకారులు, డిజైనర్లకు తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఇచ్చే రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మంగళవారం తెలిపారు. వచ్చే డిసెంబరు నాటికి 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు, పది సంవత్సరాల అనుభవం ఉన్న చేనేత కళాకారులు, 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, అయిదు సంవత్సరాల అనుభవం ఉన్న డిజైనర్లు తమ దరఖాస్తు ఫారాలు ఏప్రిల్ 30లోగా సంబంధిత జిల్లా చేనేత సహాయ సంచాలకునికి అందజేయాలన్నారు.
*అధికారులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం సందర్భానుసారంగా సముచితంగా గౌరవించుకుంటోందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవం రవీంద్రభారతి ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం, ఒగ్గు కళాకారుడు చెట్టి కొమురయ్యకు విశిష్ట పురస్కారాన్ని అందజేశారు.
*బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ, ఛైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో జరగనున్న ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఆయన గవర్నర్ను ఆహ్వానించారు
*ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్ శ్రావణ్ ఎస్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈయన రెండు రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ వ్యవహారాల అధిపతిగా వ్యవహరిస్తారు. ఆ పోస్టులో ఇప్పటి వరకు పని చేసిన రాహుల్ భరద్వాజ్ ముంబయిలోని మార్కెటింగ్ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. శ్రావణ్ ఎస్ రావు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజినీరింగులో పోస్టుగ్రాడ్యుయేషన్ చేయటంతోపాటు వివిధ మేనేజ్మెంట్ కోర్సులను పూర్తి చేశారు.
*పోలీసు శాఖలో పోస్టింగ్ లేకుండా నిరీక్షణలో ఉన్న అధికారులకు వేతనాలు ఇవ్వబోమంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం నిజం కాదని పేర్కొన్నారు.
*గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో నిరంతర నీటి సరఫరా పనుల ప్రతిపాదనలను రూ.424.92 కోట్లకు సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధి ప్రణాళిక మొదటి దశలో భాగంగా ఈ పనులను ప్రతిపాదించారు. 2016లో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం రూ.348.48 కోట్లతో పనులకు టెండర్లు పిలిచే బాధ్యతను ప్రాజెక్టు పర్యవేక్షణ సంస్థలు ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్కో, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీవీఎంసీకి అప్పటి ప్రభుత్వం అప్పగించింది.
*పట్టణాల పరిధిలో గతంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగించాలని అధికారులకు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. వాలంటీర్లను ఇంటింటికీ పంపి సర్వే చేయించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి కేటాయింపులు పూర్తి చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల కేటాయింపుపై కృష్ణా, గుంటూరు. పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పురపాలక కమిషనర్లతో విజయవాడలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
*ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాలు, డిస్టలరీలు, డిపోల్లో మద్యం విక్రయాలకు సంబంధించి ఒకే సాఫ్ట్వేర్ రూపకల్పన, హాలోగ్రామ్స్ తయారీ టెండర్ల ఖరారు, హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టమ్ (హెచ్పీఎఫ్ఎస్) అంశాలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఎక్సైజ్ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్శాఖ అదనపు కమిషనర్లతోపాటు రెవెన్యూ, ఆర్థిక, ఐటీ శాఖల నుంచి ఒక్కో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
*ఇంటర్మీడియట్ హాల్టికెట్లలో తప్పులు దొర్లడంతో జారీ నిలిపివేశారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లపై మార్చి 2020 ఉండాల్సి ఉండగా.. మార్చి 2019గా ఉంది. ఇది గుర్తించిన క్షేత్రస్థాయి అధికారులు ఇంటర్ విద్యామండలి దృష్టికి తీసుకురావడంతో జారీని నిలిపివేశారు.
*రామాయపట్నం పోర్టు సరిహద్దులను నిర్ణయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టు నిర్మాణానికి రైట్స్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. అందులో పేర్కొన్న విధంగా పోర్టు సరిహద్దులను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోర్టు చట్టం 1908 ప్రకారం ఉన్న నిబంధనలు మొత్తం రామాయపట్నం పోర్టుకు వర్తిస్తాయి. సరిహద్దులను లైట్ హౌస్ కేంద్రంగా తీసుకుని నిర్ణయించింది.
*పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో పనిచేస్తున్న పురపాలకశాఖ ఉద్యోగులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ సంఘం అధ్యక్షులు కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి విన్నవించారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ పరిపాలన, శానిటరీ శాఖ ఉద్యోగులకు అమలు చేయకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ తదితరులు ఉన్నారు.
*అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరంలో అరబిందో కార్మికులు మోకాళ్లపై కూర్చొని ధర్నా చేపట్టారు. అరబిందో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు..