Devotional

ఏప్రిల్ 2న అయోధ్యలో శంఖుస్థాపన

Ayodhya Rama Temple Ground Breaking On April 2nd

అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులకు శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 2న శంకుస్థాపన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలో సమావేశంకానున్న రామ మందిర్ ట్రస్ట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న రామాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ 2న శ్రీరామ నవమి కావడంతో ఆ రోజున శంకుస్థాపనకు ముహుర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న రామ మందిర్ ట్రస్ట్ సమావేశం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ చేపట్టనుంది. రామ జన్మభూమి స్థలం వద్దకు గత 30 ఏళ్లుగా ఎవరినీ అనుమతించడంలేదు. త్వరలో ట్రస్ట్ సభ్యులు ఆ ప్రాంతాన్ని సందర్శించి…శంకుస్థాపనకు సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం.67 ఎకరాల భూమిని చదును చేయడం తదితర పనులుండటంతో ఏప్రిల్ 2న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సాధ్యంకాకపోవచ్చని కథనాలు వెలువడ్డాయి. అయితే రామమందిర్ ట్రస్ట్ సభ్యులు ఈ తేదీకే మొగ్గుచూపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా 15-20 లక్షల మంది అయోధ్యలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజున రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలు, ఇతర కారణాలతో శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజున శంకుస్థాపన చేయలేని పక్షంలో..అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)ను ముహుర్తం రోజుగా నిర్ణయించవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.