Editorials

మనల్ని మనం ప్రేమించుకుందాం

Love Yourself First. Then Spread Love.

మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. రెంటికీ ఏమిటి తేడా? ప్రేమ మనల్ని, మనం ఎవరమైనా, ఎలాంటి వారమైనా అంగీకరిస్తుంది. మనలోని బలహీనతల్ని కూడా మాన్పిస్తుంది. గౌరవం అలా కాదు. దానికి తగిన కారణాలుండాలి. తగిన అర్హతలుండాలి.

మనమీద మన ప్రేమ, మన బలహీనతల పట్ల ఉదాసీనత వహిస్తుంది. గౌరవం అలా కాదు. బలహీనతల్ని వదిలించుకొమ్మంటుంది. లోపాల్ని సరిచేసుకొమ్మంటుంది. అర్హమైన స్థాయికి ఎదగమంటుంది.

మనల్ని ఉద్ధరించగలిగేది మన మీద మనకున్న గౌరవమే. ప్రేమించుకుందాం… మనల్ని మనం. అప్పుడు మనకు మనం ఎంతో నచ్చుతాం. ఎంతో ఇష్టమైపోతాం. అనవసరమైన నిరాశ, నిస్పృహ దరికి చేరవు. అదే సమయంలో మనల్ని మనం గౌరవించుకునే ప్రయత్నమూ చేయాలి. మనిషి ఎదగాలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతిని అందుకునే ప్రయత్నం చేయాలి. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉన్న చోటనే ఉన్న స్థితిలోనే ఉండిపోకూడదు. ఆగిపోకూడదు. ప్రేమ మనల్ని మననిస్తుంది. మనంగా ఆడనిస్తుంది. మన్నననిస్తుంది. మనంగా ఉండనిస్తుంది. మన్ననిస్తుంది. న్యూనతాభావంతో ముడుచుకుపోనివ్వదు. అయితే ఇక్కడ ఒక పరిమితి ఉంటుంది. పరిణతి కొరవడుతుంది. మనం ఎలా ఉన్నా మన మీద మనకున్న ప్రేమ దానికి తృప్తిపడుతుంది. పాపాల మీద సానుభూతి లేపనం పూస్తుంది. దాంతో అక్కడ ఆగిపోతాం. ఉండిపోతాం… ఉన్నచోటే. మనల్ని మనం గౌరవించుకోవాలనే స్పృహ ఉంటే మనలోని లోపాలను, బలహీనతలను నిర్మూలించుకునే ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకతలను గుర్తిస్తాం.

మనమీద మనకు గౌరవం ఉన్నప్పుడే మనపట్ల మనకు విలువ ఉంటుంది. మనలోని అమూల్యతలను వృథా పోనివ్వరాదనే జాగ్రత్త ధోరణి అలవడుతుంది. పెంపొందించుకోవాలనే శ్రద్ధ కలుగుతుంది. మనల్ని మనం ఎదుటి వ్యక్తిగా ఆ వ్యక్తిలోని అమూల్యాంశాలను ఆస్వాదించగలం. గౌరవించగలం. ముఖ్యంగా స్వయం సానుభూతి, జాలిలాంటి దిగజారుడు భావనలను దూరంగా ఉంచుకోగలం. మనిషిగా మనగలం. మనిషిగా జీవించగలం. ఎదగగలం

మనలోని లోపాలకు సిగ్గుపడుతూ, మనల్ని మనం ఈసడించుకుంటూ మనకు మనంగా దిగజారవలసిన అవసరం లేదు. మనల్ని మనం గౌరవించుకోగలిగినప్పుడు మనకీ దుస్థితి రాదు. మన జన్మ కారణాన్ని గుర్తించాలి. గుర్తుంచుకోవాలి. దాని అమూల్యతను, అపురూపతను పై స్థాయిలో పెట్టి చూడాలి. ఎవరి జన్మయినా, ఏ జీవి జన్మయినా అకారణంగా రాలేదు. ఒక కర్మ ఫలంగా ఒక కర్తవ్యానికై వచ్చింది. దాన్ని పూరించే క్రమంలో నెరవేర్చే కార్యక్రమంలో మనమో పవిత్ర యజ్ఞాన్ని చేస్తున్నాం. దానికి మనల్ని మనం తప్తకాంచనంలా పవిత్రీకరించుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా యాజ్ఞీక సంబారాలయిన సమిధలు హవిస్సుల్ని మన సంస్కార రూపంలో సిద్ధం చేసుకోవాలి. సమర్పణ చేసుకోవాలి.

మనల్ని మనం ప్రాపంచిక స్థాయిలో ఉండగానే శుద్ధీకరించుకుంటే పారమార్థిక స్థాయికి సిద్ధం కాగలం. దేనిమీదైనా మనకు గౌరవం ఉన్నప్పుడే దానిమీద శ్రద్ధ కలుగుతుంది. దేన్నయినా శ్రద్ధగా నిర్వహించినప్పుడే మనం గౌరవాన్ని అందుకునే స్థాయికి ఎదుగుతాం.