DailyDose

చుక్కలు తాకిన బంగారం ధర-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Gold Prices On High Rise

* పెళ్లిళ్ల సీజన్‌తో పసిడి ధర మళ్లీ పరుగులు పెడుతోంది. క్రమక్రమంగా పెరుగుతూ మళ్లీ రూ. 42వేలు దాటింది. బుధవారం రూ. 462 పెరగడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా నేడు పుత్తడి దారిలోనే పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది.
* దేశంలోకి తొలి 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌ రాబోతుంది. ‘వివో’ సంస్థ ‘ఐక్యూ’ అనే కో బ్రాండ్‌‌లో స్మార్ట్‌‌ఫోన్స్‌‌ను రిలీజ్‌‌ చేయబోతుంది. దీనిలో మొదటగా ‘ఐక్యూ 3’ అనే స్మార్ట్‌‌ఫోన్‌‌ ఈ నెల 25న విడుదలవుతుంది. ఇది దేశంలో రిలీజ్‌‌ కానున్న తొలి 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌. అలాగే స్నాప్‌‌డ్రాగన్‌‌ 865 ప్రాసెసర్‌‌‌‌తో రాబోతున్న ఫస్ట్‌‌ ఫోన్‌‌ కూడా ఇదే. 6.4 అంగుళాల ఫుల్‌‌ హెచ్‌‌డి స్క్రీన్‌‌, 12జీబీ/256జీబీ, ఆండ్రాయిడ్‌‌ 10, క్వాడ్‌‌ కెమెరా (64 ఎంపీ ప్రైమరీ+13 ఎంపీ అల్ట్రా వైడ్‌‌ + 13 ఎంపీ టెలిఫొటో + 2 ఎంపీ డెప్త్‌‌ సెన్సర్‌‌‌‌), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,370 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటి ఫీచర్స్‌‌ ఉన్నాయి. 25న మధ్యాహ్నం ఫ్లిప్‌‌కార్ట్‌‌లో సేల్‌‌కు అందుబాటులో ఉంటుంది.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల పాలైన మార్కెట్లు ఈరోజు ఆరంభం నుంచే పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 428 పాయింట్లు లాభపడి 41,323 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు పైకి ఎగబాకి 12,125 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.46 వద్ద కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి వల్ల ఎదరయ్యే ఆర్థిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంగళవారం నిర్మలా సీతారామన్‌ ప్రకటించడమే సూచీలు ఎగబాకడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సిప్లా షేర్లు లాభాల్లో పయనించగా.. టాటా మోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలతో ముగించాయి.
* తక్కువ ధరల్లో విమానప్రయాణం అందించే విమానయాన సంస్థ స్సైస్‌జెట్‌ నుంచి మరో 20 విమానాలు రానున్నాయి. మార్చి 29 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నట్టు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. కొత్త విమానాలు గౌహాతీ-పట్నా, హైదరాబాద్‌-మంగుళూరు, బెంగళూరు-జబల్‌పూర్‌, పట్నా-వారణాశి, ముంబాయి- ఔరంగబాద్‌ల మధ్య సర్వీసు నడపనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో దేశీయంగా 12 నగరాలను కలుపుతూ 52 విమానాలను వినియోగంలోకి వస్తాయని స్పైస్‌జెట్‌ పేర్కొంది. ఆ సంస్థ ముఖ్య వాణిజ్య అధికారి శిల్పా భాటియా మాట్లాడుతూ.. దేశీయంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండే టికెట్టు ధరలతో తమ విమానసర్వీసులు నడుపుతున్నామని, మరిన్ని విమాన సర్వీసులను పెంచి ఇప్పటివరకు ఎయిర్‌కనెక్టివిటీ లేని ప్రాంతాలలో కూడా విస్తరిస్తామన్నారు. అలాగేముంబయి-చెన్నై, హైదరాబాద్‌- మంగళూరు, గౌహాతీ-దిల్లీల మధ్య రానున్న కాలంలో బోయింగ్‌ 737-800, బోంబార్డియర్‌ క్యూ400 విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
* తన ఆస్తుల జప్తునకు ED తీసుకుంటున్న చర్యలపై స్టే విధించాలంటూ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత మార్చిలో పిటిషన్ ను విచారిస్తామని కోర్టు తెలిపింది. బ్యాంకులు మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడంతో ఈడీ అతని ఆస్తుల జప్తునకు చర్యలు ప్రారంభించింది.
* జీవ శాస్త్ర పరిశోధనలు చేయగల సత్తా మన దేశీయులకు ఉందని, సత్వర అనుమతులే ప్రధాన సమస్య అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. బయోఆసియా-2020 సదస్సులో భాగంగా మంగళవారం ‘దేశీయంగా జీవ శాస్త్రాల పరిశ్రమ భవిష్యత్తు ఏమిటి?’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు.
* భారత్లో కంపెనీలు ఈ ఏడాది సగటున 9.1 శాతం మేర వేతనాలను పెంచనున్నట్లు హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఏఆన్ నివేదిక అంచనా వేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2019లో 9.3 శాతం మేర వేతనాలు పెరిగాయి. 20 రంగాలకు చెందిన 1000కి పైగా సంస్థల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 39 శాతం సంస్థలు 10 శాతం మేర, 42 శాతం సంస్థలు 8-10 శాతం మధ్య వేతనాలను పెంచనున్నాయి. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే అధిక ద్రవ్యోల్బణంతో పాటు నైపుణ్యాల విషయంలో గట్టి పోటీ ఉండడం వల్ల భారత్లో వేతనాల పెంపు అధికంగా కనిపిస్తోంది.
* అంకురాలు, విద్యాసంస్థలతో కలిసి పనిచేసేందుకు వీలుగా నోవార్టిస్ బయోమ్ ఇండియాను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈఓ వాస్ నరసింహన్ ప్రకటించారు. బయో ఆసియా 2020 సదస్సులో ఆయనకు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు, వినూత్న ఆలోచనలకు ఈ కేంద్రం వేదిక అవుతుందని, ఆసియాలోనే మొదటి కేంద్రం అని పేర్కొన్నారు. వ్యాపార సేవల కోసం మరో కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నోవార్టిస్ కేంద్రంలో ఇప్పటికే 6,000 మంది పని చేస్తున్నారని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడో అతిపెద్ద కేంద్రమన్నారు.
* ఏజీఆర్ బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో, బ్యాంక్ గ్యారెంటీని ప్రభుత్వం నగదుగా మార్చుకోవచ్చనే చర్చలు నడుస్తున్న తరుణంలో.. టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్తో వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా సమావేశమయ్యారు. టెలికాం కార్యదర్శితో బిర్లా గంటకు పైగా చర్చలు జరిపారు. బిర్లాతో పాటు వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ ఉన్నారు. కంపెనీ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తుందా లేదా దివాలా ప్రక్రియకు వెళ్తుందా అన్న ప్రశ్నలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు
* పరిశోధన-అభివృద్ధి, కొత్త తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై రాబోయే 5-7 ఏళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) పవన్ ముంజాల్ పేర్కొన్నారు. 2011లో జపాన్కు చెందిన హోండా నుంచి విడివడి ఒంటరిగా కార్యకలాపాలు మొదలుపెట్టినప్పటి నుంచి కొత్త ప్లాంట్లపై 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టగా; ఆర్ అండ్ డీపై 600 మి. డాలర్ల మేర ఖర్చు వెచ్చించినట్లు తెలిపారు.
బీఎస్-6 గ్లామర్ విడుదల: గ్లామర్లో బీఎస్-6 వేరియంట్లను మంగళవారం కంపెనీ విడుదల చేసింది. వీటి ధరలు రూ.68,900; రూ.72,000గా ఉండగా.. పాషన్ ప్రొ బైక్ వేరియంట్ల ధరలను రూ.64,990; రూ.67,190గా నిర్ణయించింది. మార్చిలో మార్కెట్లోకి విడుదల కానున్న ఎక్స్ట్రీమ్ 160ఆర్ను సైతం ఆవిష్కరించింది.
* భారత్లో 2030 నాటికి మహిళా పారిశ్రామికవేత్తలు 15-17 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఉద్యోగ వయసున్న మొత్తం జనాభాలో 25 శాతానికి పైగా కొత్త ఉద్యోగాలు మహిళలే సృష్టిస్తారని అందులో తెలిపింది. భారత్లో ఉన్న మొత్తం సంస్థల్లో సుమారు 20 శాతం (1.35-1.57 కోట్లు) సంస్థలు మహిళల ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది.
* ఆరోగ్యవంతులైన ప్రజల భాగస్వామ్యంతోనే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించగలమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రస్తుతం 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.84 లక్షల కోట్ల) పరిమాణంలో ఉన్న ఔషధ, బయోటెక్ పరిశ్రమ రాబోయే ఐదేళ్లలో, ఏటా 10 శాతం వృద్ధితో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.10 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు.