Kids

ఇతరులతో మాట్లాడే పద్ధతి ఇది

Telugu Kids Info-How to talk to others

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ చిన్న ప్రయోగం చేయండి.. ఫలితం అద్భుతంగా ఉంటుంది! ఎవరైనా ఇద్దరు వ్యక్తుల సంభాషణ మనం నిశితంగా గమనిస్తే.. ఒకరి మాటలు మరొకరు వివరంగా వినడం కన్నా, ఇద్దరూ తమ గురించి తాము చెప్పుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవండి. కొద్దిరోజుల్లోనే మీ రిలేషన్స్‌లో భారీవ్యత్యాసం మీరు గమనించగలరు.

*** మీ గురించి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి!
కొత్త వ్యక్తులతో గానీ, పాత వ్యక్తులతో గానీ ఇక మీదట కొద్దిరోజులపాటు సంభాషించేటప్పుడు.. మీ గురించి చెప్పటం పూర్తిగా మానేయండి. అవతలి వ్యక్తులు చెప్పే మాటలు పూర్తి ఫోకస్డ్‌గా వినండి. వారు ఏదైనా చెబుతుంటే మధ్యలో అడ్డుకోవటం కాకుండా చాలా ఆసక్తి ప్రదర్శిస్తూ వినండి. వారి నుండి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి, వారికి ఉత్సాహాన్నిచ్చే ప్రశ్నలు వేయటం మొదలు పెట్టండి.
ఎప్పుడైతే అవతలి వారి గురించి ఆసక్తిగా వినడం మొదలు పెడతారో మీ ప్రమేయం లేకుండానే అవతలివారు మిమ్మలను, మీ కంపెనీ ఇష్టపడటం మొదలుపెడతారు. వారి మాటలను వినడం ద్వారా వారికి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లు వారు గ్రహిస్తారు. తెలియకుండానే మీ మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. వారి గురించి వారు మీతో చెప్పుకునేటప్పుడు, మధ్యలో మిమ్మలను కూడా ఒకటి రెండు ప్రశ్నలు వేస్తారు. చాలా సరళంగా, తక్కువ సమయంలో మీ గురించి మీరు సమాధానం చెప్పి, మళ్లీ వారి గురించి తెలుసుకోవడానికి ఇష్టం చూపిస్తున్నట్లు ఎదురు ప్రశ్నలు వేయండి. ఇలా చేయటం వల్ల తక్కువ సమయంలోనే రిలేషన్ షిప్ బలోపేతం అవుతుంది.

*** వారు చెప్పే సందర్భాన్ని బట్టి..
అప్పుడేమైంది.. మీకు భయమేసిందా?.. మీరు చాలా టాలెంటెడ్.. మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ హాబీస్ ఏంటి? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వంటి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉండొచ్చు.

*** ఈ భారం తగ్గుతుంది
మనం మాట్లాడేటప్పుడు, తర్వాత ఏం మాట్లాడాలి అనేది ఆలోచించటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా అవతలివారిని ఇంప్రెస్ చేయడానికి ఏం చెప్పాలో ఆలోచనలు ఫ్రేమ్ చేసుకోవటం కోసం ఎక్కువ మానసిక వనరులు ఖర్చవుతాయి. అలా కాకుండా అవతలి వారు చెప్పేది పూర్తిగా ఓపిగ్గా వినడం మొదలు పెడితే.. అవతలి వారి గురించి మరింత డీటెయిల్ తెలుసుకోవచ్చు. వారి అనుభవాల నుండి, ఆలోచనల నుండి మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అవతల వారి వ్యక్తిత్వం మీద ఒక స్థాయి అవగాహన కూడా వస్తుంది.

*** ఇది గమనించండి!
మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు.. డాక్టర్ తనకు తాను మాట్లాడటం కన్నా, మీరు మాట్లాడే దాన్ని వినటం ఎక్కువగా చేస్తే ఆ డాక్టర్‌కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సరిగ్గా ఇదే అన్ని విషయాల్లో అప్లై అవుతుంది. సమాజంలో దాదాపు అందరూ అనేక రకాల సంతోషాలు, అనుభవాలు, బాధలను కలిగి ఉంటారు. వాటిని షేర్ చేసుకునే కంపెనీ కోసం నిరంతరం ఎదురుచూస్తూ ఉంటారు. వాటిని వినగలిగే ఓపిక మీరు కలిగి ఉంటే చాలు.. కచ్చితంగా సోషల్ రిలేషన్స్ బలోపేతం చేసుకున్నట్లే!

*** వేల్యూ పెరుగుతుంది!
అలాగే ఎక్కువ మాట్లాడే వారు సహజంగా విలువ కోల్పోతుంటారు. వీలైనంతవరకు నిశ్శబ్దంగా ఉంటూ, ఓపికగా వినే వారికి తెలీకుండానే ఒక గౌరవం లభిస్తుంది. వారు మాట్లాడే నాలుగైదు మాటలకు కూడా అందరూ చాలా ప్రాధాన్యత ఇస్తారు.

*** మీ గురించి చెప్పుకపోతే ఎలా తెలుస్తుంది?
మీ గురించి అవతల వ్యక్తి పూర్తిస్థాయిలో ఆసక్తి కనబరిచినప్పుడు మాత్రమే మీ గురించి క్లుప్తంగా వెల్లడించండి. మీ జీవన విధానం మీ గురించి అవతల వారికి దానంతట అదే చెప్పే విధంగా ఉండాలి కానీ మాటల ద్వారా మీరు చెప్పాల్సిన పనిలేదు. మీ గురించి అవతలి వారు తమంతట తాము తెలుసుకుంటే కచ్చితంగా అప్పుడు మరింత గౌరవం లభిస్తుంది.