రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు 65వ రోజు ఉద్రిక్తంగా మారాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. నిన్న కృష్ణాయపాలెంలో ఇళ్ల స్థలాల కోసం భూములు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు 426 మంది రైతులపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ మందడం దీక్షా శిబిరం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను శుభ్రం చేస్తూ రైతులు నిరసన తెలిపారు. రోడ్డు ఖాళీ చేయాలంటూ అక్కడికి చేరుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎన్ని సార్లు కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మందడం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు అమరావతి నిరసన సెగ తాకింది. ఐనవోలు ఎస్.ఆర్.ఎం వర్సిటీలో ‘పరిశ్రమ-విద్య’పై ఏర్పాటు చేసిన సదస్సుకు రోజా హాజరయ్యారు. రోజా ఐనవోలు వచ్చిన విషయం తెలుసుకున్న మహిళా రైతులు వర్సిటీ బయట ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’, ‘భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులు కాదు’ అంటూ నినాదాలు చేశారు. సదస్సు ముగియగానే రోజా వాహనాన్ని రైతులు వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు, నీరుకొండ రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులను అడ్డుకుని ఆమెను ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వాహనంలో అక్కడి నుంచి పంపించారు. పెదపరిమి వద్ద రైతులు మరోసారి రోజా వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం కదలనీయకుండా రైతులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన రోజా క్షమాపణలు చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు భారీగా చేరుకోవడంతో పోలీసులు రోజా వాహనం చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ఆమె తన కారులోనే కూర్చుని ఆందోళనకారులను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. దాదాపు 400 మంది పోలీసులు పెదపరిమి చేరుకుని రోజాకు రక్షణ కల్పించారు. ఆందోళన కారులను చెదరగొట్టి రోజాను గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లే మధ్యంలో పలు చోట్ల రోజా వాహనాన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. ఈక్రమంలో రైతులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. మరో మహిళ కాలికి గాయాలయ్యాయి.
రోజాకు అమరావతి నిరసన సెగ
Related tags :