కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్‌లలో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్‌లో మార్పులు చేయాలంటే అందుకు మనం ఉపయోగించే సాంకేతికత కట్, కాపీ, పేస్ట్. మరి దీన్ని అభివృద్ధి చేసిన లారీ టెస్లర్ గురించి మనలో ఎంతమందికి తెలుసు!! ఆయన బిల్‌గేట్స్, స్టీవ్ జాబ్స్‌లా ప్రముఖ వ్యక్తి కాకపోవచ్చు. కానీ ఆయన అభివృద్ధి చేసిన కట్, కాపీ, పేస్ట్ సాంకేతికత మాత్రం ప్రపంచంలో ఎంతోమందికి ఉపయోగపడుతోంది. 74 ఏళ్ల లారీ టెస్లర్ సోమవారంనాడు కన్నుమూశారు. 1970లో జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ (పీఏఆర్‌సీ)లో పనిచేస్తున్న సమయంలో ఆయన కట్, కాపీ, పేస్ట్‌ను అభివృద్ధి చేశారు. పాత రోజుల్లో ముద్రించిన పత్రాలను కత్తిరించి వాటిని మరో చోట అతికించే విధానం స్ఫూర్తితో ఆయన కట్, కాపీ, పేస్ట్‌ని కనుగొన్నారు. అయితే ఆపిల్ సంస్థ లిసా కంప్యూటర్లలో దీన్ని ఉపయోగించడంతో ఇది బాగా పాపులర్ అయింది. ఆపిల్ సంస్థతో కలిసి టెస్లర్ 20 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన లిసా, మకిన్‌తోష్, న్యూటన్ సంబంధించి ఐఫోన్‌లో వాడే యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌ను అభివృద్ధిలో భాగమయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మనం వాడుకలో ఉపయోగిస్తున్న బ్రౌజర్ అనే పదాన్ని కూడా 1976లో టెస్లర్ సూచించారు. 1945లో న్యూయార్క్‌లో జన్మించిన లారీ టెస్లర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ విద్యను అభ్యసించారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్, ఆపిల్, యాహూ, పీఏఆర్‌సీ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. టెస్లర్ మృతిపై సామాజిక మాధ్యమాలు వేదికగా పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Ctrl-C Ctrl-V ఆవిష్కర్త మృతి
Related tags :