దేశానికి సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీ స్థాపించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని.. లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహించిన ‘ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్’ సదస్సులో పవన్ మాట్లాడారు. భగత్‌సింగ్‌లాంటి వారు తనకు ఆదర్శమని చెప్పారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయాలను చూస్తూ పెరిగానని.. అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానన్నారు. యువతలోని ఆవేశాన్ని అర్థం చేసుకుని వారితో మాట్లాడానని చెప్పారు. రాజకీయంగా తమకు ఒకే ఎమ్మెల్యే ఉన్నారని.. కానీ, తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. కర్నూలులో సుగాలి ప్రీతి మృతి విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీ నిర్వహించామని.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిందని పవన్ గుర్తు చేశారు. సినిమాల్లో అయితే రెండు మూడు నిమిషాల్లో సాధ్యమవుతుందని.. నిజ జీవితంలో అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటే సహనం కావాలి. కొన్నేళ్ల పోరాటంతోనే అది సాధ్యమవుతుంది. వెంటనే మార్పు కావాలనుకుంటే ఏదీ రాదు. మార్పు కోసం యువత కనీసం 15 ఏళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యాచరణతో లక్ష్యాలు నెరవేరుతాయి. నా స్వలాభం, అధికారం కోసం నేను పనిచేయడం లేదు. ఓటములు ఎదురైనా దేశ సేవ కోసం ఓపికతో ముందుకు సాగుతున్నా. యువత క్షేత్రస్థాయి వాస్తవాలను అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతర్జాలం ద్వారా తెలుసుకోవడం కాదు.. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లా వెంటనే ఫలితం కావాలని కోరుకోవద్దు. వివిధ వర్గాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నా మనమంతా ఒకే దేశం నినాదంతో ఐక్యంగా ఉన్నాం’’ అని పవన్ అన్నారు.
సహనంతో ఉండండి. ఇది ఇన్స్టంట్ నూడుల్స్ కాదు.
Related tags :