Business

సొంతవాడినని విమర్శించారు

Ratan Tata Recalls Critics Comments On Him

బంధుప్రీతి.. వారసత్వం లాంటి విమర్శలు తానూ ఎదుర్కొన్నానని చెబుతున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా. ప్రముఖ ఫేస్‌బుక్‌ పేజీ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’కు టాటా ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తన కుటుంబం, పెళ్లి, కెరీర్‌, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా జేఆర్‌డీ టాటాతో తనకున్న అనుబంధాన్ని కూడా వెల్లడించారు. ఆయన తనకు తండ్రి, సోదరుడితో సమానమని చెప్పుకొచ్చారు. జేఆర్‌డీ టాటా, రతన్‌ టాటా ఇద్దరూ టాటా కుటుంబానికి చెందినవారే. టాటా గ్రూప్‌కు జేఆర్‌డీ 50ఏళ్లకు పైగా నాయకత్వం వహించారు. టాటా సన్స్‌, టాటా ఇండస్ట్రీస్‌కు కూడా ఆయనే ఛైర్మన్‌గా ఉన్నారు. 1991లో టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న జేఆర్‌డీ టాటా.. తన వారసుడిగా రతన్‌ టాటాను ప్రకటించారు. కంపెనీ పగ్గాలను పూర్తిగా అప్పజెప్పారు. అయితే జేఆర్‌డీ టాటా నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వచ్చాయని, బంధుప్రీతి వల్లే రతన్‌ టాటాకు ఉన్నత పదవి కల్పించారని చాలా మంది విమర్శించారని టాటా తాజాగా వెల్లడించారు.

‘కెరీర్‌ తొలినాళ్లలో నేను జంషెద్‌పూర్‌లోని టాటా కంపెనీలో ఇంటర్నెషిప్‌ కింద పనిచేశాను. అప్పుడు నాకు ఏ పని చెప్పకుండా పలు విభాగాలకు మార్చేవారు. టాటా కుటుంబం నుంచి వచ్చానని ఎవరూ నాకు పని చెప్పేవారు కాదేమో. అలా ఆరు నెలలు గడిచాక నేను టాటాస్టీల్‌కు మారాను. అక్కడే నాకు సరైన పని దొరికింది. కింది స్థాయి ఉద్యోగుల నుంచి నేను కెరీర్‌ను ప్రారంభించాను. దాని వల్లే ఉద్యోగుల ఇబ్బందులు నాకు తెలిసొచ్చాయి. దాదాపు ఆరేళ్ల పాటు జంషెద్‌పూర్‌లోనే ఉన్నాను. 1991లో టాటా గ్రూప్‌, టాటా ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ పదవుల నుంచి జేఆర్‌డీ టాటా తప్పుకున్నారు. అప్పుడు ఎలాంటి విమర్శలు రాలేదు. కానీ టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను నాకు అప్పగించినప్పుడు మాత్రం ఎన్నో విమర్శలు వచ్చాయి. బంధుప్రీతికి తలొగ్గి రతన్‌కు టాటా సన్స్‌ బాధ్యతలు అప్పగించారని, జేఆర్‌డీకి తప్పుకు ఎంపిక అని చాలా మంది అన్నారు. వాటన్నింటిని అధిగమించిన నేను ఈ స్థాయికి వచ్చాను’ అని టాటా చెప్పుకొచ్చారు. జేఆర్‌డీ టాటాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయనో గొప్ప మార్గదర్శకుడని కొనియాడారు. జేఆర్‌డీ తనకు తండ్రి, సోదరుడి లాంటివారని అన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని గుర్తుచేసుకున్నారు. రతన్‌ టాటా ఇంటర్వ్యూను హ్యూమన్స్‌ ఆఫ్ బాంబే మొత్తం మూడు భాగాలుగా విభజించింది. తొలి భాగాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గతవారం పోస్ట్‌ చేయగా.. రెండో భాగాన్ని తాజాగా తన ఖాతాలో పోస్ట్‌ చేసింది.