Agriculture

ఆవాలు నువ్వుల సాగుకు నేల తయారీ అవసరం

Sesame And Mustard Seeds Soil Arrangements-Telugu Agricultural News

మినుము, పెసర వంటి అపరాలను వరి కోయక ముందే నేలలో తేమ ఉన్నప్పుడు విత్తి సాగు చేస్తున్నట్లుగానే, ఇటీవల దుక్కి దున్నకుండానే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగ పంటలను జీరోటిల్లేజి విధానంలో సాగు చేస్తున్నారు.
* వేరుశనగ, ఆవాలు, నువ్వులు తదితర పంటలకు నేల తయారీ అవసరం. ఎందుకంటే వరి కోసిన తరువాత దమ్ము చేసిన మాగాణి ఎండిపోయి, గట్టి ముద్దలా మారుతుంది. ఈ భూముల్లో విత్తితే మొలకశాతం బాగా తగ్గి, ఉండాల్సిన మొక్కల సాంద్రత ఉండదు. ఫలితంగా దిగుబడి బాగా తగ్గిపోతుంది.
* వరి తర్వాత భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు దున్నడం ముఖ్యం. తేమ ఎక్కువగా ఉంటే నాగలితో దున్నడానికి కుదరదు. భూమి బాగా ఎండినప్పుడు దున్నితే పెద్దపెద్ద పెడలు ఏర్పడతాయి. అందువల్ల తగినంత తేమ ఉన్నప్పుడు నాగలితో లోతుగా రెండుసార్లు దున్నాలి. తరువాత తిరుగు దంతితో ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా దున్నితే గడ్డలన్నీ పగిలి భూమి మెత్తగా తయారవుతుంది.
* శనగ విత్తేందుకు.. తొలకరిలో వేసిన పైరు కోసిన తర్వాత నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదును చేయాలి.
* నువ్వులు విత్తడానికి నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, రెండుసార్లు గుంటకతోలి, చదును చేయాలి. ఇలా తయారైన నేలను చదును చేసి బోదెలు, చాళ్లు చేయాలి. విత్తనాలను బోదెలపై విత్తితే పంట పెరుగుదల, దిగుబడి బాగుంటుంది.
* జీరోటిల్లేజి పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నప్పుడు.. వరి కోసిన తరువాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు.. అప్పటికే మొలిచిన కలుపు నివారణకు లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున పారాక్వాట్‌ కలిపి.. కలుపు మొక్కలు, దుబ్బులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పారాక్వాట్‌ పిచికారీ చేసిన తర్వాత నేలలో సరిపడా తేమ ఉంటే వెంటనే విత్తుకోవచ్చు లేదా పలుచటి తడిచ్చి చేతితో లేదా యంత్రాల సహాయంతో విత్తుకోవచ్చు.
* ఆరుతడి పంటల్లో అవసరాన్ని బట్టి కలుపు మందులు వాడాలి. మొక్కజొన్నకు అట్రజిన్‌ 4-5 గ్రా. లీటరు నీటికి, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగకు పెండిమిథాలిన్‌ 5-6 గ్రా. లీటరు నీటికి కలిపి విత్తిన 1-2 రోజుల్లో పిచికారీ చేయాలి.