Devotional

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

Shivaratri 2020 In Telugu States-Devotional News

1. శివయ్యా వస్తామయా! – ఆద్యాత్మిక వార్తలు – 20/02
ఓ పక్క భక్తి భావాలు.. ఆ చెంతనే వింత వైఖరులు..ముక్తి కోసం వచ్చేవాళ్లుంటారు.. భుక్తి కోసం వస్తుంటారు..విశ్వాసం కొందరిదైతే.. ఉత్సాహం ఎందరిదో!మరెన్నో అనుభూతుల సమాహారం జాతర.చీకట్లోనూ చిత్రమైన రంగులు చూపిస్తాయి తిరునాళ్లు!!శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో జాతరల జోరు మొదలవుతోంది. హాలాహలధారుడి సన్నిధానాలన్నీ కోలాహలానికి వేదికలవుతున్నాయి. అందులో మీరూ భాగమవ్వండి.
1.ప్రభల కోటయ్య: కోటప్పకొండ, గుంటూరు
మహాశివరాత్రి వచ్చిందంటే కోటప్పకొండ తిరునాళ్ల గురించి మాట్లాడాల్సిందే! ప్రభల వైభవం గురించి చెప్పుకోవాల్సిందే!! గుంటూరు జిల్లాలో ఉంటుంది కోటప్పకొండ. ఇక్కడి త్రికూటాచలంపై కొలువుదీరిన త్రికోటేశ్వరస్వామికి కృతజ్ఞతగా శివరాత్రికి తిరునాళ్లు నిర్వహిస్తారు. కొండ చుట్టూ కొండంత ఉత్సాహంతో సాగే తిరునాళ్లు ఇవి. పరిసర పల్లెల్లో కనిపిస్తుందా సందడి. పక్క రాష్ట్రాల్లోనూ వినిపిస్తుందీ వైనం గురించి. శివరాత్రికి నెల రోజుల ముందు నుంచే ప్రభల నిర్మాణం మొదలవుతుంది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ప్రభను కోటప్పకొండకు తరలిస్తారు. ఎండ్ల బండిపై తీసుకొచ్చే సమయంలో ప్రభ ఒరిగిపోవడం, ఇరుసులు విరిగిపోవడం వంటివి ఎదురైనా వెనకడుగు వేయరు యువకులు. ప్రభకు ఇరువైపులా తాళ్లు కట్టి పడిపోకుండా నియంత్రిస్తారు. విద్యుద్దీపాలు చుట్టుకొని వెలిగిపోతున్న ప్రభలు.. పండగ నాటికి కోటప్పకొండ పాదాల చెంతకు చేరుకుంటాయి. వందల్లో ప్రభలు.. వేలల్లో ప్రభలు.. వాటి వెంట లక్షల్లో జనం. అసలు సంబరం అప్పుడు మొదలవుతుంది. కొండ చుట్టూ తాత్కాలిక దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తాయి. కోరుకున్న వస్తువు చిటికెలో అందుతుంది. తీన్మార్‌ డప్పులు కాలు నిలువనియ్యవు. లంగా ఓణీలో వచ్చే తరుణులు చూపు తిప్పుకోనివ్వరు. రాత్రయితే దీపాల వెలుగులు.. చీకట్లో దాగున్న అందాలు చూపుతాయి. ఆటపాటలతో పండగ శోభ అమాంతంగా పెరిగిపోతుంది. శివరాత్రి కోటయ్యస్వామిని దర్శించుకొని.. రాత్రంతా జాగరణ చేసి తిరిగి ప్రభతో పాటు గ్రామానికి చేరుకోవడంతో తిరునాళ్లు ముగుస్తాయి.
***చేరుకునేదిలా:
కోటప్పకొండ.. నరసరావుపేట నుంచి 9 కి.మీ. దూరంలో ఉంటుంది. విజయవాడ, గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లి కోటప్పకొండకు చేరుకోవచ్చు.
2.మల్లన్నా.. వస్తున్నామన్నా: కొమురవెల్లి, సిద్దిపేట
తెలంగాణలో కొమురవెల్లి జాతర ప్రత్యేకమైంది. మూడు నెలల పాటు జరిగే ఉత్సవం.. శివరాత్రి నాటికి పతాక స్థాయికి చేరుకుంటుంది. సిద్దిపేట జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో ఉంటుంది కొమురవెల్లి. ఈ క్షేత్రంలో కొలువుదీరిన కోర మీసం మల్లన్న దర్శనానికి వేలమంది తరలి వస్తారు. మల్లన్న జాతరలో పల్లె పదాలు పల్లవిస్తాయి. భక్తులంతా బృందాలుగా భజనల్లో మునిగిపోతారు. ఒగ్గు కథలు వింటూ కాలక్షేపం చేస్తుంటారు. జాతరలో పట్నం వేడుక ఘనంగా సాగుతుంది. పంచవన్నెలతో రంగవల్లులు వేస్తారు. అందులోకి మల్లన్న వస్తాడని విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ‘పెద్దపట్నం’ వేడుక జరుగుతుంది. పట్నంలో వాడిన రంగులు, పసుపు, కుంకుమ ఇళ్లకు తీసుకెళ్తే మంచి జరుగుతుందని నమ్మకం. జాతరలో అంగళ్ల సందడి అంతా ఇంతా ఉండదు. కనకాన్ని తలదన్నె వన్నెలీనుతూ గిల్టు సరుకు బారులు తీరుతుంది. గాజులు, చెవి దుద్దులు, మాటీలు, గొలుసులు ఒకటేమిటి.. రకరకాలు. చిరుతిళ్ల సందడి దీనికి రెండింతలు ఉంటుంది. ఆటపాటల ముచ్చట్లు ఇంతకుమించి సాగిపోతాయి. ఇవన్నీ ఆస్వాదిస్తూ శివరాత్రి జాగారం చేస్తారు.
**చేరుకునేదిలా:
కొమురవెల్లి హైదరాబాద్‌కు సుమారు 90 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వెళ్లే దారిలో రహదారికి 3 కి.మీ. లోనికి ఉంటుంది. జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంటకో బస్‌ ఉంటుంది. సిద్దిపేట, కరీంనగర్‌ బస్సులు ఎక్కితే.. రాజీవ్‌ రహదారిపై కొమురవెల్లి స్వాగత తోరణం దగ్గర దిగి.. ఆటోల్లో ఆలయం దాకా వెళ్లొచ్చు.
3.ప్రకృతి జాతర: మహేంద్రగిరి, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దులో శ్రీకాకుళం జిల్లా మందస మండలం సింగుపురం సమీపంలో ఉంటాయి మహేంద్రగిరులు. ఈ కొండల్లో పురాతన ఆలయాలు ఉన్నాయి. పంచపాండవులు వీటిని నిర్మించారని చెబుతారు. శివరాత్రి ఉత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. వ్యయప్రయాసలకోర్చి శివరాత్రికి ముందు రోజే గిరిపైకి చేరతారు. భజనలు, సంకీర్తనలతో రాత్రంతా జాగారం చేస్తారు. మర్నాడు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తిరుగు ప్రయాణమవుతారు.
**చేరుకునేదిలా:
శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి బస్సుల్లో మందస చేరుకోవాలి. అక్కడ నుంచి ఇతర వాహనాలు, బస్సుల్లో రాజబస వరకు చేరుకోవచ్ఛు రాజబస నుంచి 12 కి.మీ. నడిచి గిరికి చేరుకుంటారు. రైళ్లలో ప్రయాణించేవారు పలాసలో దిగి బస్సుల్లో మందస, అక్కడి నుంచి రాజబసకు చేరుకోవచ్చు.
2.రాజన్న ఆలయంలో నేటి నుంచి జాతర
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర జరుగుతుంది. ఇందుకోసం అధికారులు ఆలయంలో రూ.1.56 కోట్లతో సౌకర్యాలు కల్పించారు. భక్తులు జాగారాలు చేసేందుకు గుడిచెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రూ.కోటితో శివార్చన పేరిట రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడు లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు.
3.గాజు సీసాల్లో నీళ్ల విక్రయాలకు తితిదే బ్రేక్
తిరుమలలో గాజు సీసాల ద్వారా చేపట్టదలచిన మంచి నీటి విక్రయాలను తితిదే తాత్కాలికంగా నిలిపేసింది. ఈ మేరకు ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తితిదే రూపొందించిన విధానం ప్రకారం యాత్రికులు రూ.40 చెల్లిస్తే దుకాణాదారు 750 మి.లీ నీళ్ల సీసాను విక్రయిస్తారు. రూ.20 ముందస్తుగా తీసుకుంటారు. బాటిల్ తిరిగి ఇచ్చేస్తే రూ.20 వెనక్కి ఇస్తారు. ఇది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమంటూ ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. దీంతో గాజు సీసాల్లో మంచి నీటిని అమ్మాలనే నిర్ణయాన్ని తితిదే తాత్కాలికంగా నిలిపేసింది.
4.నేటి నుంచి సామాన్య భక్తులకూ వడప్రసాదం
సామాన్య భక్తులకు వడ ప్రసాదాన్ని అందించేందుకు తితిదే నిర్ణయించింది. గురువారం నుంచి 5 వేల వడలను ప్రత్యేక కౌంటర్ ద్వారా అందించనుంది. ఒక్కో వడ ధరను రూ.100గా నిర్ణయించింది.
5.రామమందిర ట్రస్ట్ అధ్యక్షుడిగా నృత్యగోపాల్ దాస్
అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్దాస్, ప్రధాన కార్యదర్శిగా చంపత్రాయి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ట్రస్ట్ తొలి సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. ఈ భేటీ సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ నివాసంలో జరిగింది. అయోధ్య వివాదం పరిష్కారమైన తరవాత మందిర నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు ప్రత్యేకంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాను ఆలయ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పుణేకి చెందిన గోవింద్ దేవ్గిరిని కోశాధికారిగా నియమించారు.
6.మార్చి 28న శ్రీరామాయణ ఎక్స్ప్రెస్ ప్రారంభం
రామాయణంతో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఉద్దేశించిన శ్రీరామాయణ ఎక్స్ప్రెస్ రైలును మార్చి 28 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు బుధవారం తెలిపారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య, బిహార్, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలతోపాటు నేపాల్కు కూడా ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నారు. దిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలులో ఒక్కరికి స్లీపర్ క్లాస్ టికెట్ ఛార్జీలు రూ.16,055, ఏసీ ప్యాకేజీకైతే రూ.26,775 చొప్పున వసూలు చేస్తారు. దీనికి అదనంగా శ్రీలంక సందర్శనకు కూడా ఏర్పాటు చేస్తారు. చెన్నై నుంచి విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. దీనికి ఛార్జీలు అదనం.
7. వైభవంగా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల వేడుకలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య విఘ్నేశ్వరపూజతో బుధవా రం అత్యంత వైభోపేతంగా ప్రారంభం అయ్యాయి. కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కీసరగుట్ట దేవాలయ ప్రాంగణ మందిరంలో వేదపండితులు శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి రోజు పూజ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. మంత్రి చేతుల మీదుగా ఈ పూజ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభం చేశారు. ఆలయ చైర్మన్ తటాకం శ్రీనివాస్శర్మ స్వామి వారి కి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్ వరణం, యాగశాల ప్రవే శం, ఆఖండ జ్యోతి ప్రతిష్టాపనం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వేదపాఠశాలకు చెందిన వేదపండితులు, కీసరగుట్ట వేదపండితులు మారుతి సత్యనారాయణశర్మ, బాల్రాంశర్మ, రవిశర్మ, వీరేశంశర్మలు చైర్మన్తో కలిసి యాగశాల ప్రవేశాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారికి అగ్నిప్రతిష్టాపనము, భేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగా లాపన, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థ్ర ప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను అత్యంత వైభోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, దేవస్థానం వంశపార్యంపర్య ధర్మకర్తలు తటాకం నారాయణశర్మ, టి.రమేశ్శర్మ, టి.ఉమాపతిశర్మ, టి. వెంకటేశ్, టి. నాగలింగంలతో పాటు పలువురు పాల్గొన్నారు.
8. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు గురువారం,
20.02.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 14C°-28C°
• నిన్న 68,065 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 27,517 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.41 కోట్లు,
• నిన్న 16,633 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• రేపు గోగ‌ర్భతీర్థంలోని
క్షేత్ర‌పాల‌కునికి మ‌హాశివ‌రాత్రి
వేడుక‌లు,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
9. పంచాంగము 20.02.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: ద్వాదశి సా.05:21 వరకు
తదుపరి త్రయోదశి
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.09:23 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: సిధ్ధి ఉ.07:19 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: తైతిల సా.04:02 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం:సా.05:40 – 07:19
దుర్ముహూర్తం: 10:33 – 11:20
మరియు 03:13 – 03:59
రాహు కాలం: 01:57 – 03:24
గుళిక కాలం: 09:35 – 11:02
యమ గండం: 06:40 – 08:07
అభిజిత్ : 12:06 – 12:52
సూర్యోదయం: 06:40
సూర్యాస్తమయం: 06:19
వైదిక సూర్యోదయం: 06:44
వైదిక సూర్యాస్తమయం: 06:15
చంద్రోదయం: రా.04:13
చంద్రాస్తమయం: ప.03:35
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: దక్షిణం
చంద్ర నివాసం: తూర్పు
నీల – తిల ద్వాదశి
శతభిష కార్తె
గురు ప్రదోషం
10. రాశిఫలం – 20/02/2020
తిథి:
బహుళ ద్వాదశి సా.4.56, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
పూర్వాషాఢ ఉ.8.54
వర్జ్యం:
సా.5.10 నుండి 6.49 వరకు
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగానుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగానుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధన లాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపంచేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగానుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ మేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధివుంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధిగమవుతాయి. ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగానుండుటకు ప్రయత్నించాలి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదావేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
11. హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా 423 వ ఉరుసు మహోత్సవానికి ప్రముఖులకు ఆహ్వానం
హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా 423 వ ఉరుసు మహోత్సవానికి ప్రముఖులకు ఆహ్వానం హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా 423 వ ఉరుసు మహోత్సవానికి హాజరయ్యారు కావాలని దర్గా పీఠాధిపతి అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు మరియు డిప్యూటీ కమిషనర్ విక్రాంత్ పాటిల్ , డిసిపి జనాబ్ నవాబ్ జానీ సాహెబ్‌ లను మరియు ఏ సి పి, సిఐ లకు ఆహ్వానం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని శాలువాతో మరియు చిత్రపటంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు మరియు మైనార్టీ నాయకులు జి ఎం సి బాషా, న్యాయవాది ముక్తార్ అలి , రుహుల్లా అలీం, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు.
12. 26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు యాదాద్రి భువనగిరి : ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈవో గీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 3న ఎదుర్కోలు, 4న కల్యాణం, 5న రథోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు. మార్చి 7న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, సీఎం కేసీఆర్‌, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత పేర్కొన్నారు.