Editorials

ఉర్రూతలూగిస్తున్న ఉత్తరాఖండ్-TNI ప్రత్యేకం

Uttarakhand Tourism - Dehradun And Mussoorie Tourist Spots Telugu-ఉర్రూతలూగిస్తున్న ఉత్తరాఖండ్-TNI ప్రత్యేకం

అమెరికాకు చెందిన ప్రముఖ కార్డీయాలజిస్ట్, ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ఎనభై కోట్లవరకు విరాళాలు అందించిన డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డితో కలిసి ఇటీవల నాలుగు రోజులపాటు ప్రకృతి సోయగాలతో అలరించే హిమాలయ పర్వత శ్రేణులలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటించాము. ఇటీవల నేను అమెరికా వెళ్ళినపుడు అమెరికాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రమైన కాలిఫోర్నియాలోని ‘ఇసుమిటి’ పర్వత శ్రేణులను డా.హనిమిరెడ్డి నాకు చూపించారు. ఈసందర్భంగా మన దేశంలో కూడా ఇటువంటి అద్భుతమైన మంచు కొండలు, జలపాతాలు ఉన్నాయని డా. హనిమిరెడ్డికి నేను వివరించాను. గత ఇరవై ఏళ్ల నుండి ఈ ప్రాంతంతో నాకు పరిచయం ఉంది. ప్రతి ఏడాది ఋషికేశ్ లోని శివానంద ఆశ్రమాన్ని ఒకటి లేదా రెండు సార్లు దర్శించడం మాకు ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలను చాలా సార్లు సందర్శించాను. తాను కూడా ఈ ప్రాంతాన్ని చూస్తానని ప్రణాళిక రూపొందించమని డా. హనిమిరెడ్డి నన్ను కోరారు. దీని ప్రకారం డా.హనిమిరెడ్డి కోరిక మేరకు నాలుగు రోజులు ఉత్తరాఖండ్ పర్యటనకు మేము ఇరువురం బయలుదేరాం.

*** మురిపించే ముస్సోరి
79 ఏళ్ల వయసులో ఇప్పటికీ రోజుకు ఏడు కిమీ పరుగెత్తే డా.హనిమిరెడ్డితో కలిసి ఫిబ్రవరి 8 వ తేదీన ఉత్తరాఖండ్ పర్యటనకు బయలుదేరాం. హైదరాబాద్ లో ఉదయం ఏడు గంటలకు విమానం ఎక్కి దేహ్రాదూన్ కు తొమ్మిది గంటలకల్లా చేరుకున్నాం. దిగగానే ఋషికేశ్ లో నాకు తెల్సిన ట్రావెల్ కంపెనీ నుండి వచ్చిన ఇన్నోవా కారు ఎయిర్ పోర్టులో సిద్దంగా ఉంది. ఉదయం తోమ్మ్డిది గంటలకు దేహ్రాదూన్ లో చలి కాస్త ఎక్కువగానే ఉంది. ఇంకా మంచు తెరలు వీడలేదు. రోడ్డు పక్కనే ఉన్న దాబాలో మంచి వేడివేడి టీ సేవించాము. దేహ్రాదూన్ నుండి ముస్సోరీ ప్రయాణం ప్రారంభమైంది. మార్గమధ్యలో ఉన్న చూడదాగిన ప్రదేశాలన్నింటిని చూపెట్టమన్నాం. మాకు వచ్చిన కారు డ్రైవర్ రవి ఇంగ్లిష్, హిందీలో చాలా చక్కగా మాట్లాడాడు. డెహ్రాడూన్ నుండి ముస్సోరికి దాదాపు గంటన్నర ప్రయాణం. ఈ పరిసరాల్లో ముప్పైకి పైగా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి మాత్రమే మేము చూశాం. ముందుగా ఒక పురాతనమైన శివాలయం ముందు కారు డ్రైవర్ కారును ఆపారు. ఆ శివాలయంలో కానుకలు అంగీకరించరు. హుండీలు లేకుండా ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఇక్కడకు వెళ్ళిన ప్రతివారికి రొట్టెలు, బంగాళదుంప కూర ప్రసాదంగా అందజేస్తారు. చాలా రుచిగా ఉంది. అనంతరం దగ్గరలోనే ఉన్న డీర్ పార్క్ చూశాం. అక్కడి నుండి గన్ని హిల్స్ (gunni hills) చేరుకున్నాం. ఇది ముస్సోరీ చుట్టూ ఉన్న కొండల్లో ప్రధానమైంది. కింద నుండి పైకి రోప్ వే ద్వారా తీసుకువెళ్తారు. పై నుండి ముస్సోరీ అందాలను మంచు కొండల సోయగాలను తిలకించడం మంచి అనుభూతిని మిగులుస్తుంది. అక్కడి నుండి ముస్సోరీలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ధనౌల్టి (DHANAULTI) కి వెళ్ళాం. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఆప్రాంతం మంచుతో పూర్తిగా కప్పేసి ఉంది. మరొకపక్క సూర్యుడి వెలుగులతో ఆప్రాంతం వెండి కొండలాగా మెరిసి పోతోంది. ముస్సోరిలో అత్యధికంగా మంచు కురిసే ప్రదేశం ఇదే. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎకో పార్కులో విహరించడం కూడా మర్చిపోలేని జ్ఞాపకం. అనంతరం ముస్సోరిలో మరొక ప్రముఖ పర్యాటక కేంద్రమైన కేమ్టీ ఫాల్స్ (KEMPTY FALLS) కు వెళ్లాం. ముస్సోరీ వెళ్ళిన ప్రతి ఒక్కరు చూడదగిన ప్రదేశం ఇది. డెహ్రాడూన్ ముస్సోరీ మధ్య మార్గంలోనే ఉంటుంది. 40 అడుగుల ఎత్తు నుండి జలపాతం కిందకు పడుతూ ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు ఇక్కడ ఈత కొట్టడానికి, చేపలు పట్టడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ముస్సోరీ నగరంలో చుట్టూ కారులోనే ఒక రౌండ్ వేశాం. ముస్సోరీ మాల్ రోడ్డు కేంపని గార్డెన్, జ్వాలాదేవి మందిరం, లైబ్రరి బజార్, పురాతనమైన చర్చి తదితర వాటిని చూశాం. ముస్సోరిలో భవనాలు చాలా వరకు కొండలపైనే నిర్మించారు. మంచు కురిసే ప్రదేశాలను చూడాలనుకునే వారు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ముస్సోరిని సందర్శించాలి. ముస్సోరిలో మొదటి రాత్రి కొండ మీద నిర్మించిన కంట్రీ ఇన్ (country inn) హోటల్లో బస చేశాం.

*** డెహ్రాడూన్ మీదుగా రుషికేష్..
రెండోరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా సిద్దమయ్యం. ముస్సోరీ వీధులను చూసుకుంటూ డెహ్రాడూన్ కు వెళ్లాం. మార్గమధ్యలో సిఎం, గవర్నర్ బంగ్లాలు, అసెంబ్లీ హాలు, సచివాలయం తదితర ప్రదేశాలు డ్రైవర్ చూపించాడు. డెహ్రాడూన్ లో క్లాక్ టవర్ సెంటర్ మంచి వ్యాపార కేంద్రం. ఆ పరిసరాల్లో కొద్దిసేపు తిరిగి అనంతరం ప్రసిద్ది చెందిన డూన్ (DOON) స్కూల్ కు వెళ్ళాం. స్కూల్ చుట్టూ ఒక రౌండు తిరిగాం. రెండో పక్క ఉన్న గేట్ వద్ద ఫోటో దిగాము. అక్కడ గేటును హైదరాబాద్, సికింద్రాబాద్ కు చెందిన డూన్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్ధులు విరాళంగా అందించారు. గేటు పైన దానిని చూడగానే డూన్ స్కూల్లో మన తెలుగువారి ప్రాధాన్యత ఏమిటో అర్ధమైంది.(ఫోటో చూడండి). అక్కడ నుండి ఋషికేశ్ కు ప్రయాణమయ్యాం. కొండలు, గుట్టలు, లోయలు నడుమ గంట సేపు ప్రయాణం సాగింది. ఋషికేశ్ కు దాదాపు 20 కిమీ దూరం ఉన్న వశిష్ట గుహలకు చేరుకున్నాం. గంగానది ఒడ్డునే ఇక్కడ ఉన్న గుహలలో వశిష్ట మహర్ష్జి ఆయన భార్య తపస్సు చేసుకున్న గుహలును దర్శించాం. అక్కడే ఆశ్రమం కూడా ఉంది. అక్కడ నుండి దాదాపు ముప్పై కిమీ దూరం ఉన్న హిమాలయాల్లోని ప్రసిది చెందిన ‘నీలకంటేశ్వర’ దేవాలయానికి వెళ్ళాం. హిమాలయ పర్వతాల మధ్య నుండి ఎత్తైన కొండల మధ్య ఈ ఆలయానికి చేరుకోవడం ఒక మధురమైన అనుభూతి. శివుడు హాలాహలాన్ని మింగినపుడు దానిని తన కంటంలోనే ఉంచుకుని ఉపశమనం కోసం ఇక్కడ తపస్సు చేసాడు. అందుకే ఈ ప్రదేశానికి నీలకంటేశ్వర్ అనే పేరు వచ్చింది. శివుడు ఇక్కడ ‘మెడ’ ఆకారంలో వెలిశాడు. శివలింగం ఈ రూపంలోనే ఉంటుంది. మాఘమాసం పౌర్ణమి రోజు కావడంతో అక్కడ రద్దీ అధికంగా ఉంది. దాదాపు రెండు గంటలకు పైగా క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నాం. మేడ ఆకారంలో ఉన్న శివలింగాన్ని ముట్టుకుని అభిషేకం చేశాం. అక్కడ నుండి రుశికేష్ లో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తపోవన్, లక్ష్మణజూల మీదుగా శివానంద ఆశ్రమానికి చేరుకున్నాం. ‘రాంజూలా’ సమీపంలోనే ఈ ఆశ్రమం ఉంది. శివానంద ఆశ్రమం జనరల్ సెక్రటరి స్వామీ పద్మనాభానందతో నాకు పదిహేను సంవత్సరాల నుండి పరిచయం ఉంది. ఆయనతో మేము కొద్దిసేపు సమావేశం అయ్యాము. రాంజూలా పక్కనే గంగానది ఒడ్డున గురుదేవ్ కుటీర్ లో నేను ఎప్పుడూ నివాసం ఉంటాను. ఆరాత్రి కూడా మాకు అక్కడే వసతి ఇచ్చారు. పౌర్ణమి రోజున గంగానది అందాలను తిలకించి హనిమిరెడ్డితో పాటు నేను పులకరించిపోయాం. శివానంద ఆశ్రమంలో భక్తులకు, యాత్రికులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. నేను, డా, హనిమిరెడ్డి, మా కారు డ్రైవర్ డైనింగ్ హాలుకు వెళ్లి ఉచితంగా అందించే భోజనాన్ని తిన్నాం. మరుసటి రోజు ఉదయం గజగజలాడించే చలిలో గంగానదిలో స్నానం చేశాం. అనంతరం రాంజూలా దాటి గంగానదికి అటువైపుకు వెళ్ళాం. అక్కడ ప్రముఖ హోటల్ ‘చోటు వాలా’ మీదుగా నా ఆప్త మిత్రుడు హరిపాల్ సింగ్ నడిపే షాపింగ్ మాల్ కు వెళ్లాం. అనంతరం గంగానదికి పక్కనే ఉన్న శివాలయాన్ని దర్శించాం. స్వర్గాశ్రమం, ఖాళికమిలిబాబా ఆశ్రమం, పరమర్దానికేతన్, గీతాభవనం చూసి బోటు మీదుగా గంగానది దాటి ఇవతల ఒడ్డుకు చేరుకున్నాం. మేము బస చేసిన గురుదేవ్ కుటీర్ కు సమీపంలోనే రాంజూలా పక్కనే ఉన్న పోస్టాఫీస్ ప్రాంగణంలో శివానంద ఆశ్రమానికి చెందిన హంసానందస్వామి కార్యాలయం ఉంటుంది. ఆయన మన తెలుగువారు. వచ్చిన వారందరిని ఆత్మీయంగా పలకరిస్తూ ప్రసాదాలు అందించడం చేస్తూ ఉంటారు. గత ఇరవై ఏళ్ల నుండి హంసానంద స్వామితో నాకు పరిచయం ఉంది. ఎక్కువగా ఆయన ఆశ్రమానికి వచ్చే విదేశీయులకు, భగవద్గీత గురించి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. నేను, డా.హనిమిరెడ్డి ఆయనతో చాలా సేపు ముచ్చటించాం. ఋషికేశ్ వెళ్ళే తెలుగువారు హంసానంద స్వామిని తప్పనిసరిగా కలుసుకుంటే మంచిది. ఆయన ఆద్వర్యంలో సాయంత్రం 5.30 గంటలకు గురుదేవ్ కుటీర్ లో ఉన్న ఘాట్ లో గంగా హారతి ఇస్తారు. మనతో కూడా ఇప్పిస్తారు.

*** హరిద్వార్‌కు ప్రయాణం
మూడోరోజు మధ్యాహ్నం 11 గంటలకు రుషికేష్ నుండి 20కిమీ దూరం ఉన్న హరిద్వార్ కు మా ప్రయాణం ప్రారంభం అయింది. మార్గమధ్యలో టిటిడీ దేవాలయాలను(ఆంధ్రా ఆశ్రమం), జీయర్ స్వామీ మటం, దయానంద ఆశ్రమాలను డా. హనిమిరెడ్డికి చూపించాను. అనంతరం హరిద్వార్ లో ప్రధానమైన ‘శాంతి కుంజ్’ ఆశ్రమానికి వెళ్ళాం. ఈ ఆశ్రమంలో భక్తులంతా గాయత్రీ మాతను ప్రధానంగా పూజిస్తారు. ఈ ఆశ్రమానికి అనుబంధంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఉంది. అక్కడ ఉన్న గాయత్రీ మాత ఆలయాన్ని సందర్శించాము. అక్కడి నుండి హరిద్వార్ లో ప్రముఖ పుణ్య స్థలమైన ‘హడికిపడి’కి వెళ్ళాం. ఇక్కడ ఉన్న గంగా ఘాట్ లో కుంభమేళాను నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ ఇచ్చే గంగాహరతికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. దగ్గరలోనే కొండల మీద కొలువై ఉన్న మనసాదేవి, చండిదేవి ఆలయాలను అక్కడి నుండే తిలకించి నమస్కారం పెట్టాం. అక్కడి నుండి దాదాపు 20 కిమీ దూరంలో ఉన్న రాందేవ్ బాబా నివసిస్తున్న పతంజలి ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ ఉన్న ఆయుర్వేద ఆస్పత్రిని, ఔషధాల విక్రయశాలను, షాపింగ్ మాల్ ను సందర్శించాం. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో హరిద్వార్ రైల్వే స్టేషన్ కు వచ్చి శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో డిల్లి చేరుకున్నాం. డిల్లీలో ప్రముఖ హోటల్ లీ- మెరీడియన్ హోటల్లో బస చేశాం. తెల్లవారి ఎనిమిది గంటలకు సిద్దమై ఇండియా గెట్ వద్ద చక్కర్లు కొట్టాం సమీపంలో ఉన్న ఏపీ భవన్ కు వచ్చి కళతప్పిన ఆ పరిసరాలను పరిశీలించాం. అనంతరం పార్లమెంటు చూసి డిల్లి నడిబొడ్డున ఉన్న ఆంధ్రా ఎడ్యుకేషనల్ సోసైటీకి చేరుకున్నాం. ఆ సొసైటీ కార్యదర్శి, డిల్లీలో ప్రముఖ పారిశ్రామికవేత్త డా.సుంకర ఈశ్వరప్రసాద్ తో నాకు సుదీర్ఘ కాలం నుండి పరిచయం ఉంది. అంతకు ముందు రోజే మేము డిల్లి వస్తున్న విషయాన్నీ ఆయనకు చెప్పాను. డా.హనిమిరెడ్డి గారి ఔదార్యం గురించి తెలిసి ఉన్న ఈశ్వరప్రసాద్ వాళ్ళ స్కూల్ కు మమ్మల్ని ఆహ్వానించారు. డా. హనిమిరెడ్డిని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ పాలకవర్గం ఘనంగా సత్కరించింది. అక్కడి పిల్లలను అద్యాపకులను, పాలకవర్గాన్ని ఉద్దేశించి డా. హనిమిరెడ్డి గంటపాటు ఇచ్చిన ప్రసంగం వారిని ముగ్దులను చేసింది. అమెరికాలో విద్యాభ్యాసం, ముఖ్యంగా డాక్టర్లుకు ఉన్న ఉపాధి అవకాశాల గురించి పిల్లలు అడిగిన ప్రశ్నలకు డా. హనిమిరెడ్డి సమాధానాలు ఇచ్చారు. వారిచ్చిన ఆతిద్యాన్ని స్వీకరించి డిల్లి విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు చేరుకున్నాం. విమానాశ్రయంలో దిగగానే డా.హనిమిరెడ్డి స్పందన నా జీవితంలో మరువలేనిది. ఎవరైనా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్ళాలంటే. నన్ను సంప్రదించండి. సెల్ నంబరు: 9440231118, ఈ-మెయిల్:kilarumuddukrishna@yahoo.com— కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.