ఇటీవల రాత్రిపూట చాలామంది రోటీలు తింటుండటం చూస్తూనే ఉన్నాం. మరికొందరు గోధుమరొట్టెలకు బదులు కాస్తంత మార్పు అంటూ జొన్నరొట్టెలు తింటున్నారు. తక్కువ వర్షపాతంలో కూడా జొన్నలు తేలిగ్గా పండుతాయి. కాబట్టి వర్షపాతం అంతగా లేనిచోట కూడా జొన్నలను విస్తృతంగా సాగుచేస్తుంటారు. అందుకే చాలా సంస్కృతుల్లో జొన్నన్నం, జొన్నరొట్టెలూ నిత్య ఆహారంగా ఉన్నాయి. మనం రెండు మూడు తరాల కింద వరి ఆహారానికి మారకముందు జొన్న అన్నం, జొన్నరొట్టెలు తినడమే పరిపాటి. జొన్నల్లో ప్రోటీన్లు ఎక్కువే. అందుకే జొన్న రొట్టెల్ని బలవర్థక ఆహారంగా పరిగణిస్తుంటారు. వీటిల్లో ఐరన్, క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువ. థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి బీకాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువ. జొన్నల్లో ఉండే ఫీనాలిక్ యాసిడ్స్, ట్యానిన్స్, యాంథోసయనిన్ వంటి పోషకాలు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అన్నిటికంటే ప్రధానమైన అంశం… జొన్నలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. అందువల్ల ఊబకాయం (ఒబేసిటీ) ద్వారా వచ్చే ఎన్నో అనర్థాలను నివారించినట్లు అవుతుంది. గుండె ఆరోగ్యానికీ జొన్న ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు వచ్చే ఎన్నోరకాల సమస్యలను నివారిస్తాయి. మలబద్ధకం సమస్యను స్వాభావికంగా అధిగమించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలాకాలం పాటు యౌవనంగా కనిపించడం సాధ్యమవుతుంది. గ్లూటెన్ కారణంగా గోధుమ వల్ల అలర్జీ ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
జొన్నలు తినేవారిలో ఊబకాయం తక్కువ
Related tags :