DailyDose

గుమ్నామీ బాబా నేతాజీ కాదు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Gumnami Baba And Netaji

* రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై గళం విప్పుతున్నందునే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి అవినీతి మరక అంటిస్తున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్‌కు కలలోనూ అచ్చెన్నాయుడు కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కింజరాపు కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభల్లో ఉన్నారని.. తెదేపా అధినేత చంద్రబాబుకు శాసనసభలో చేదోడు వాదోడుగా ఉంటున్నారనే అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

* తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి షిర్డీ వెళ్లే కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు (17205)కు ప్రమాదం తప్పింది. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ వద్దకు రాగానే లోకో ఏసీ కోచ్‌, లోకో సెక్యూరిటీ మధ్య ఉన్న సీబీసీ కప్లింగ్‌ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో రైలు ఇంజిన్‌ ఏసీ కోచ్‌లతో 100 మీటర్లు ముందుకు వెళ్లిపోగా మిగతా 23 కోచ్‌లు అక్కడే ఆగిపోయాయి. లింకు ఊడిపోయిన విషయాన్ని గమనించిన లోకో పైలట్‌ ఇంజిన్‌ను నిలిపివేసి రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

* టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. దీర్ఘకాలిక కాలావధి కలిగిన ప్లాన్‌ కోరుకునే వారి కోసం దీన్ని ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ ధరను రూ.2,121గా నిర్ణయించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన 2020 ప్లాన్‌ను ఇది పోలి ఉంది. 2,121 ప్లాన్‌ కింద వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది.

* నేతి బీరకాయలో నెయ్యి ఉన్నది ఎంత నిజమో.. పేదలపై సీఎం జగన్‌కు ప్రేమ ఉందన్నది కూడా అంతే నిజమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ పేద బలహీనవర్గాల ప్రజలు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా సేకరిస్తున్నారని మండిపడ్డారు.

* దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో మాత్రం వింత ఆచారం ఉంది. జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివుడికి ఇతర ఆలయాల కంటే భిన్నంగా సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) చేపట్టబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తర్వాత ప్రధాని మోదీతో ఉద్ధవ్‌ తొలిసారి భేటీ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ వంటి అంశాలపై చర్చించామని భేటీ అనంతరం ఉద్ధవ్‌ మీడియాతో చెప్పారు.

* నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. గుమ్నామీ బాబాయే నేతాజీ అన్న వాదన సరైంది కాదని ఇటీవల ఓ కమిషన్‌ తేల్చి చెప్పింది. నివేదికను ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభకు సమర్పించింది. అయితే, ఆ నివేదికలో సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీ(సీఎస్‌ఎఫ్‌ఎల్‌) అందించిన ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదిక ఆధారంగానే బాబాయే నేతాజీ కాదన్న నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. దీనిపై సాయక్‌ సేన్‌ అనే నేతాజీ అభిమాని ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదిక ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భారత ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి పర్యాటకులను తాజ్‌ సందర్శనకు అనుమతించరని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సూపరింటెండెంట్‌ వసంత్ కుమార్ స్వర్ణకర్ తెలిపారు.

* కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్ల విషయంలో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పురుష హెల్త్‌ వర్కర్లు కనీసం ఒక్క కు.ని. ఆపరేషన్‌ కూడా నిర్వహించకుంటే ఉద్యోగం నుంచి తొలగించడమో, జీతం నిలిపివేయడమో చేస్తామని హెచ్చరించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

* టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫొటోకు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ హాస్యాస్పద కామెంట్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టాస్‌ వేసే సమయంలో.. కోహ్లీ మైదానంలో ఒక విచిత్రమైన స్టెప్‌ వేశాడు. ఈ సందర్భంగా ఆ ఫొటోకు మంచి కామెంట్లు పెట్టమని బీసీసీఐ అభిమానులను కోరింది. రాట్‌కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయని శ్రేయస్‌ తన కామెంట్‌లో పేర్కొన్నాడు.