* చైనాలో కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో టీవీలపై పడనుంది. వచ్చే నెల నుంచి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. కరోనా వైరస్ మూలంగా చైనాలో టీవీలకు సంబంధించి ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెల్స్ సరఫరాకు అంతరాయమేర్పడడమే ఇందుకు కారణం. టీవీల తయారీలో అతి ప్రధానమైనవి ఈ టెలివిజన్ ప్యానెల్స్. టీవీ ధరలో దీని వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. ఎక్కువగా చైనా నుంచి ఇవి దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. చైనా నూతన సంవత్సరానికి తోడు కరోనా వైరస్ కారణంగా అక్కడ ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయాయి. కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకున్నప్పటికీ నామమాత్రంగానే కార్మికులు పనిచేస్తున్నారు. దీనివల్ల ప్యానెల్స్ ధరలు 20 శాతం మేర పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మళ్లీ ఉత్పత్తి పునరుద్ధరణ జరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుందని అంచనా. దీని కారణంగా మార్చి నుంచి 10 శాతం మేర టీవీల ధరలు పెరగనున్నాయని ఎస్‌పీపీఎల్ (భారత్‌లో థామ్సన్ టీవీల లైసెన్స్‌దారు) సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30-50 శాతం ఉత్పత్తిలో కోత ఉంటుందని తెలిపారు. టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషన్ల ధరలు కూడా పెరుగుతాయని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాన్జా తెలిపారు. మార్చి నుంచి టీవీల ధరలతో పాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు పెరుగుతాయని చెప్పారు. చాలా కంపెనీలు వీటికి సంబంధించిన కంప్రెషర్లను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.
* ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోన్‌పహాడీలో 2700 టన్నులు, హార్దీలో 650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ నిక్షేపాలను తవ్వితీసే మైనింగ్ కార్యక్రమాన్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సర్వే కొనసాగుతోంది. ఈ-టెండరింగ్ ద్వారా వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇక్కడ బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
* భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైనాకు నడిపే విమాన సర్వీసులను మరికొంతకాలం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దిల్లీ-షాంఘై, దిల్లీ-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులను జూన్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. చైనాలో కొవిడ్ వ్యాప్తి కారణంగా ఎయిర్‌ఇండియా గతంలో దిల్లీ-షాంఘై మధ్య విమానాల్ని ఫిబ్రవరి 14 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల గడువు పూర్తయినప్పటికీ ఇంకా సర్వీసులను పునరుద్ధరించలేదు. మరోవైపు కొవిడ్ వ్యాప్తి కారణంగా చైనాలో ఇప్పటి వరకు 2,118 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
* బంగారం ధర ఎన్నడూ లేని గరిష్ఠస్థాయిలకు చేరుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.43,000 పైకి, ఆభరణాల బంగారం (22 క్యారెట్లు) గ్రాము రూ.3980కి చేరింది. అయితే దేశ రాజధాని దిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబయిలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రొద్దుటూరు సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంతకంటే కాస్త తక్కువ ధరలే ఉన్నాయి. బంగారం ధరల్లో వ్యత్యాసం ఎలా ఉందనే ప్రశ్నకు, అక్కడ పాత బంగారం విక్రయానికి రావడం, కొత్త అమ్మకాలు లేక, ధర తగ్గించి అమ్ముతున్నారనే జవాబు విక్రేతల నుంచి వస్తోంది.
* సోషల్ వర్క్‌స్పేసెస్ పేరుతో కార్యాలయాల డిజైనింగ్ మొదలు, అవసరమైన అన్ని సేవలు, ఫర్నిచర్‌ను ఒకేచోట ప్రదర్శించే కేంద్రాన్ని గోద్రెజ్ ఇంటీరియో హైదరాబాద్‌లో నెలకొల్పింది. తమ వద్ద ఉన్న 45కు పైగా కాన్సెప్ట్‌లు పరిశీలించి, కావాల్సింది ఎంచుకునేందుకు ఈ కేంద్రంలో వీలుంటుందని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్ మాథుర్ గురువారం ఇక్కడ చెప్పారు. నేటితరం ఉద్యోగులు ‘నా కోసం’, ‘మన కోసం’ తగినంత స్థలం ఉండాలని ఆశిస్తున్నారని, వారి ఊహలు నిజం చేసేలా ఇవి ఉంటాయన్నారు. ప్రస్తుతం సోషల్ ఆఫీసు మార్కెట్ విలువ రూ.200 కోట్ల మేర ఉందని, ఏటా 12శాతం వృద్ధి నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూపు టర్నోవర్ రూ.1,500 కోట్లు దాటేందుకు సోషల్ ఆఫీసు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత ఆదాయంలో హైదరాబాద్ వాటా 45 శాతం వాటా ఉందని వెల్లడించారు.
* టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీర్ఘకాలిక కాలావధి కలిగిన ప్లాన్ కోరుకునే వారి కోసం దీన్ని ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ధరను రూ.2,121గా నిర్ణయించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన 2020 ప్లాన్‌ను ఇది పోలి ఉంది. 2,121 ప్లాన్ కింద వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. జియో నుంచి జియో, ల్యాండ్ లైన్‌కు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియోయేతర కాల్స్ మాట్లాడుకోవడానికి 12వేల నిమిషాలు అందిస్తున్నారు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఈ ప్లాన్ కింద లభిస్తుంది. జియో యాప్‌తో పాటు, గూగుల్‌పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్‌లోనూ ఈ ప్లాన్ లభ్యమవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా జియో ప్రకటించిన 2020 ప్లాన్ సైతం ఇవే ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ ఆ ప్లాన్ వ్యాలిడిటీని 365 రోజులుగా ప్రకటించింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను జియో అందించింది.