Devotional

పంచ శివలింగాలు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి?

What And Where Are Five SIvalingas?

సకల ప్రాణికోటికి ఆధారం పంచ భూతాలైన గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచ భూతాలకు ప్రతి రూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచ భూత శివలింగాలను పూజిస్తారు.
*హిందూ సంస్కృతిలో పరమేశ్వరున్ని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
*ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ క్షేత్రాల ప్రత్యేకతలు ఏమిటి? ప్రయాణ సమయం? తదితర విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
1. ఆకాశ లింగం:
పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశ లింగం ఒకటి. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో 9 గోపురాలు ఉంటాయి. వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ, విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లుకు సంబంధించినది.ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు. చంద్రమౌళీశ్వర స్పటిక లింగం, రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లోనూ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు.పరమేశ్వరుని మూడవ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు. ఈ ప్రదేశాన్ని యంత్రం చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు. దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. దీనినే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు. తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి. తెరకు బయట వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని, లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది.
2. పృధ్వీ లింగం:
కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద గాలి గోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి. ఆలయం లోపల య్యి స్తంభాల నిర్మాణంతో పాటు 1,008 శివలింగాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ 3,500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఉంది. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆమ్ర అంటే మామిడి అని అర్ధం. మామిడి చెట్టు కింద వెలసిన దైవం కాబట్టి ఇక్కడి శివలింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా కొలుస్తారు.
3. అగ్ని లింగం:
తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచలం క్షేత్రం ఉంది. పంచ భూతాలలోని అగ్ని భూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అని కొండ అని అర్ధం. దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది. కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేద, పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కధనం. అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది.
4. జలలింగం:
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన, ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది. ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన 7 గోపురాలతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే పానపట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కొద్ది సేపటి తర్వాత పిండి.. ఆ నీటిని భక్తులకు చూపిస్తారు.
5. వాయు లింగం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగాన్ని వాయు భూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు. కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ స్వామి వారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణ వాయు లింగంగా పూజిస్తారు. స్వామి ఉఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది.